ఆలు.. ఢమాల్ | potato .. dhamal | Sakshi
Sakshi News home page

ఆలు.. ఢమాల్

Published Mon, Jan 19 2015 5:01 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

ఆలు.. ఢమాల్ - Sakshi

ఆలు.. ఢమాల్

జహీరాబాద్: మూడు నెలలు...కనుకు లేకుండా తడులుపెట్టారు. ఆలుగడ్డ పంటను కంటికిరెప్పలా కాపాడుకున్నారు. దిగుబడి..రాబడి అంటూ లెక్కలేస్తూ గడిపారు. అయితే వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. పంటలు సాగు చేసే సమయంలో క్వింటాల్ రూ.4 వేలు పలికిన ఆలుగడ్డ..పంట చేతికొచ్చే సమయానికి అమాంతం పడిపోయి రూ.1300కు చేరుకోవడంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కనీసం పెట్టుబడులైనా వస్తే అదే పదివేలనుకుంటున్నారు.
 
10 వేల ఎకరాల్లో సాగు
జహీరాబాద్ నియోజకవర్గంలోని రైతులు ప్రతి ఏటా సంప్రదాయపంటగా ఆలుగడ్డను సాగుచేసుకుంటూ వస్తున్నారు. ఒక్క జహీరాబాద్ నియోజకవర్గంలోనే సుమారు 10 వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగవుతోంది. మార్కెట్‌లో ఆలుగడ్డకు మంచి డిమాండ్ ఉండడంతో ప్రతి సంవత్సరం ఆలుసాగు చేసిన రైతులకు మంచే జరిగేది. ఈ సారి కూడా పంట సాగుచేసే సమయంలో క్వింటాల్ రూ.4 వేలు పలికిన ఆలుగడ్డ...ప్రస్తుతం రూ.1,300లకు పడిపోయింది. గత పక్షం రోజుల నుంచి హైదరాబాద్ మార్కెట్లో క్రమంగా ధర పడిపోతూ వస్తుండడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
 
ఎకరానికి రూ.40 వేలకు పైగా వ్యయం
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ మాసం వరకు రైతులు ఆలుగడ్డ పంటను సాగు చే స్తారు. ఆలు విత్తనాన్ని రైతులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా ప్రాంతం నుంచి క్వింటాలుకు రూ.4 వేలు ధర చెల్లించి తెచ్చుకుంటారు. అక్కడకు వెళ్లలేని రైతులు మాత్రం దళారుల వద్ద కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత పంట సాగుకు కనీసంగా ఎకరాకు రూ.30 వేలు వ్యయం చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

ఇక పంటను మార్కెట్ తరలించే సమయంలోనూ రూ.10 వేలు ఖర్చవుతోందని వారు వెళ్లడించారు. ఇవన్నీ పోను దాదాపు 90 రోజుల పాటు తమ కుటుంబమంతా పొద్దెరగకుండా పనిచేయాల్సి వస్తోందంటున్నారు. ఇంతచేసినా దిగుబడి ఎకరాకు 30 క్వింటాళ్లు దాటడం లేదంటున్నారు. ప్రస్తుతం ఆలుకు లభిస్తున్న ధరతో పోలిస్తే పెట్టుబడులు కూడా వచ్చేట్టు లేవని రైతులు నిట్టూరుస్తున్నారు. ఒక వేళ వాతావరణం అనుకూలించక పోయినా, నాణ్యమైన విత్తన దొరక్కపోయినా దిగుబడి సగానికి సగం తగ్గుతుందని, అప్పుడు అప్పులో మునిగిపోతున్నామంటున్నారు.
 
నెల తేడాలో రేటులో భారీ మార్పు
ఆలుపంట ఇపుడు చేతిలోకి వచ్చి మార్కెట్‌లో ఇబ్బడిముబ్బడిగా వస్తుండడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుత నెల లేదా నెలన్నరలో రైతులంతా ఆలుగడ్డను విక్రయించేస్తారు. ఆ తర్వాత ఆలు ధర అమాంతం పెరిగిపోతుంది. రైతుల వద్ద ఆలు కొనుగోలు చేసిన కొందరు వ్యాపారులు పంటను కోల్ట్‌స్టోరేజ్‌లో ఉంచి రేటు పెరగగానే అమ్ముకుంటారు. దీంతో వారి భారీగా లాభాలు వస్తున్నాయి. పంటలు పండించిన రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవేళ రైతులు పంటలను నిల్వచేసుకుందాంమంటే కోల్ట్‌స్టోరేజ్ సౌకర్యం లేని కారణంగా ఒక్కరోజు ఆలస్యమైనా గడ్డ రంగుమారి తీవ్ర నష్టం జరుగుతుంది. అందువల్లే ఆ రోజు ఎంత పలికితే అంత తీసుకుని రైతులు ఆలుగడ్డను విక్రయించేస్తున్నారు.
 
నిల్వచేసుకునే సౌకర్యం కల్పించాలి
తాము ఆరుగాలం కష్టపడి పండించిన ఆలుగడ్డ పంటకు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌లను నిర్మించాలని రైతులు కోరుతున్నారు. శీతల గిడ్డంగులు అందుబాటులో ఉంటే పంట ఉత్పత్తును నిల్వచేసుకుని, ధరలు పెరగగానే విక్రయించుకునేందుకు వీలుంటుందని వారంటున్నారు.

నియోజకవర్గంలోని జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో అలుగడ్డ పంటను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. జిల్లాలోనే జహీరాబాద్ ప్రాంతంలో ఆలుగడ్డ పంట సాగు అధిక విస్తీర్ణంలో ఉంటుంది. అయినప్పటికీ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణం కోసం తగిన శ్రద్ధ తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. రైతుల అవస్థలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వమే ముందుకు వచ్చి కోల్డ్ స్టోరేజ్‌లను నిర్మించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement