
సాక్షి, అమరావతి: రబీ సీజన్‌లో రాయితీపై ఇచ్చే వివిధ రకాల విత్తనాలను ఈనెల 10 నుంచి పంపిణీ చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. 12 రకాల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ సిద్ధం చేసినట్టు బుధవారం ‘సాక్షి’కి చెప్పారు. రబీ సీజన్‌లో అత్యధికంగా సాగు చేసే వాటిలో ఒకటైన శనగ విత్తనాల పంపిణీ గురువారం కర్నూలు జిల్లాలో లాంఛనంగా ప్రారంభమవుతుందన్నారు. మిగతా జిల్లాల్లో పదో తేదీ నుంచి మొదలవుతుందన్నారు. ఆయన తెలిపిన వివరాలివీ..
► 42,023 క్వింటాళ్ల వరి వంగడాలను, 30,819 క్వింటాళ్ల వేరుశనగ, 2,92,319 క్వింటాళ్ల శనగలు, 3,500 క్వింటాళ్ల పెసలు, 11,051 క్వింటాళ్ల మినుములు, 589 క్వింటాళ్ల రాగులు, 42 క్వింటాళ్ల కొర్రలు, 50 క్వింటాళ్ల ఊదలు, 30 క్వింటాళ్ల ఆరికలు, 32 క్వింటాళ్ల సామలు, 2 క్వింటాళ్ల కందులు, 25 క్వింటాళ్ల ఆండ్రు కొర్రలు పంపిణీకి సిద్ధం చేశాం.
► వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా గ్రామ స్థాయిలో సబ్సిడీ విత్తనాల పంపిణీ జరుగుతుంది.
► సబ్సిడీపై ఎకరానికి 25 కిలోల శనగల్ని ఇస్తారు. సబ్సిడీ లేని రైతులు పూర్తి మొత్తాన్ని చెల్లించి కొనవచ్చు.
► జేజీ 11 రకం శనగలు క్వింటాల్ పూర్తి విలువ రూ.7,500 కాగా, ప్రభుత్వం రూ.2,250 సబ్సిడీగా ఇస్తుంది. కేఏకే–2 రకం శనగలు క్వింటాల్ పూర్తి ధర రూ.7,700 కాగా, రూ.2,310 సబ్సిడీగా ఇస్తారు.
► విత్తన నాణ్యతపై ఫిర్యాదులుంటే రైతులు 155251 నంబర్‌కు కాల్ చేయవచ్చు.