bank lones
-
హయ్యర్ స్టడీస్ లోన్‌పై బ్యాంకు విధించే చార్జెస్, ఇవే!
ఉన్నత చదువు కోసం ఎక్కువ ఖర్చవుతుందనే విషయం అందరికీ తెలుసు, కావున కొన్ని సందర్భాల్లో దీనికోసం కొంతమంది బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు. మీరు తీసుకునే లోన్.. ఎంచుకున్న కోర్సుని బట్టి ఉండవచ్చు. అయితే బ్యాంకులు కొన్ని సందర్భాల్లో లోన్ చార్జీలను వెల్లడించదు. అలంటి సందర్భాల్లో వినియోగదారుడు లోన్ తిరిగి చెల్లించాల్సి వచ్చినప్పుడు కొంత ఇబ్బందికి లోనవుతాడు. నిజానికి నర్సింగ్ ప్రారంభం నుంచి ఉన్నత డిగ్రీ పొందే వరకు వివిధ సందర్భాల్లో విద్యార్థి లోన్స్ తీసుకోవచ్చు, ఇది చాలామందికి తెలియకపోవచ్చు. ఒక స్టూడెంట్ లోన్ తీసుకునేటప్పుడు దాని కోసం అదనపు ఖర్చులను భరించాల్సి వస్తుంది, అలాంటి వాటిని గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు: మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకు లోన్ ప్రాసెస్ చేయడానికి కొంత ప్రాసెసింగ్ ఫీజుని వసూలు చేస్తుంది. ఇది మీరు తీసుకునే లోన్ అమౌంట్ మొత్తంలో 1 నుంచి 2 శాతం వరకు ఉంటుంది. ప్రీ పేమెంట్ ఫీజు: మీరు లోన్ తీసుకున్నప్పుడు అనుకున్న సమయానికంటే ముందుగా లోన్ తిరిగి చెల్లించాల్సి వస్తే దాని కోసం బ్యాంకులు ప్రీ పేమెంట్ ఫీజుని వసూలు చేసేవి, కానీ ఇప్పుడు ఆర్బిఐ నోటిఫికేషన్ కారణంగా ఏ బ్యాంకులు ఇటువంటి ఫీజులను తీసుకోవడం లేదు. లేట్ పేమెంట్: మీరు ఏదైనా కారణం వల్ల గానీ, ఇతర సమస్య వల్ల గానీ చెల్లించాల్సిన గడువు తర్వాత లోన్ తిరిగి చెల్లించినప్పుడు లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా మీరు ఆలస్యం చేయడం వల్ల సిబిల్ స్కోర్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది భవిస్యత్తులో కొన్ని అవసరాల్లో ఉపయోగపడకపోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా నిర్దిష్ట సమయంలో లోన్ చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ రకంలో మార్పు: మీరు లోన్ తీసుకునే సమయంలో మీ వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. అయితే స్థిరమైన వడ్డీ రేటు నుంచి ప్లోటింగ్ వడ్డీ రేటుకు మారాలనుకున్నప్పుడు కూడా కొంత డబ్బు చెల్లించాల్సి వస్తుంది. లోన్ రద్దు చేసుకోవడం: మీరు లోన్ కావాలని అప్లై చేసుకుని తరువాత ఏదైనా కారణం వల్ల లోన్ వద్దనుకుంటే అప్పుడు బ్యాంకు మైనర్ క్యాన్సిలేషన్ కింద కొంత మొత్తం వసూలు చేస్తుంది. ఇది మీరు మంజూరైన లోన్ మొత్తంలో 1 శాతం వరకు ఉండవచ్చు. -
పంట రుణం రూ.1,500 కోట్లు
జిల్లాలోని రైతులకు ఈ ఏడాది రూ.1,500 కోట్ల పంట రుణాలు అందనున్నాయి. బ్యాంకర్లు ఈ మేరకు 2019–20 వ్యవసాయ రుణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఏటా జూన్ మాసంలో లీడ్ బ్యాంకు వ్యవసాయ రుణ ప్రణాళికను రూపొందిస్తుంది. ఇందుకు అనుగుణంగా ఆయా బ్యాంకులు రైతులకు ఖరీఫ్, రబీ రుణాలు పంపిణీ చేస్తాయి. లీడ్ బ్యాంకు అధికారుల సమాచారం మేరకు.. ఈ ఏడాది ఖరీఫ్, రబీలో రుణాల పంపిణీ కోసం లీడ్ బ్యాంకు రూ.1,500 కోట్లతో రుణ ప్రణాళిక రెడీ చేసినట్లు తెలిసింది. కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధ్యక్షతన 21న జిల్లా బ్యాంకర్ల సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో వ్యవసాయ రుణ ప్రణాళికను బ్యాంకర్లు ఆమోదించనున్నారు. బ్యాంకర్ల సమావేశం నిర్వహణ కోసం లీడ్ బ్యాంకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు వ్యవసాయ రుణ ప్రణాళిక ప్రతులను రెడీ చేస్తూనే మరోవైపు సమావేశానికి రాష్ట్రస్థాయి, జిల్లాలోని బ్యాంకు అధికారులు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. సాక్షి, వికారాబాద్: వ్యవసాయ రుణ ప్రణాళికను అనుసరించి రైతులకు రూ.1,500 కోట్ల మేర పంట రుణాలు అందజేయనున్నారు. ఖరీఫ్‌లో రూ.900 కోట్ల రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లు ప్లాన్ సిద్ధం చేశారు. ఖరీఫ్‌లో 1.12 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్న రైతులకు రూ.900 కోట్ల పంటరుణాలను బ్యాంకర్లు అందజేయనున్నారు. జిల్లాలో మొత్తం 14 బ్యాంకులు ఉండగా ఖరీఫ్‌లో అత్యధికంగా ఎస్బీఐ రైతులకు రూ.350 కోట్లకుపైగా రుణాలు అందజేయనుంది. ఆంధ్ర బ్యాంకు రూ.190 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.98 కోట్లు, గ్రామీణ వికాస్ బ్యాంకు రూ.21 కోట్లు, హెచ్‌డీసీసీబీ బ్యాంకు రూ.60 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.52 కోట్లు, కెనరా బ్యాంకు రూ.44 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.31 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.19 కోట్ల రుణాలను రైతులకు అందజేయనున్నాయి. గత ఏడాది రబీలో రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలని శుక్రవారం జరిగే బ్యాంకర్ల సమావేశంలో వ్యవసాయశాఖ బ్యాంకర్లను కోరనుంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది రబీలో సైతం బ్యాంకర్లు రూ.600 కోట్ల రుణాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికను రూపొందించారు. రబీలో సైతం ఎస్బీఐ బ్యాంకు అత్యధికంగా రూ.240 కోట్ల మేర రుణాలు ఇవ్వనుంది. అలాగే ఆంధ్రా బ్యాంకు రూ.120 కోట్లు, బరోడా బ్యాంకు రూ.20 కోట్లు, కెనరా బ్యాంకు రూ.29 కోట్లు, హెచ్డీఎఫ్సీ రూ.35 కోట్లు, హెచ్‌డీసీసీబీ బ్యాంకు రూ.40 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.65 కోట్లు రుణాలు ఇవ్వనున్నాయి. మిగతా మొత్తాన్ని ఇతర బ్యాంకులు రైతులకు రబీలో రుణంగా అందజేయనున్నాయి. ఇదిలా ఉంటే ప్రతిఏటా వ్యవసాయరుణ ప్రణాళికకు అనుగుణంగా రైతులకు రుణాలు అందజేయటం తో బ్యాంకులు విఫలం అవుతున్నాయి. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 50 శాతం మేర మాత్రం రైతులకు రుణాలు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఈ ఏడాది వందశాతం రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకర్లపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధ అవుతోంది. అయితే బ్యాంకర్లు ఏమేరకు ఖరీఫ్, రబీలో రుణాలు ఇస్తారో వేచి చూడాలి. -
ఆర్బీఐ ‘మొండి’ అస్త్రానికి సుప్రీం బ్రేక్!
న్యూఢిల్లీ : మొండిబకాయిల (ఎన్పీఏ) పరిష్కారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన జారీచేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఈ పరిణామం మొండిబకాయిలుగా మారిన రుణాల భారంతో సతమతమవుతున్న విద్యుత్ సంస్థలుసహా పలు కంపెనీలకు ఊరటనిచ్చింది. అయితే, బ్యాంకులు తీసుకుంటున్న దివాలా చర్యలకు ఈ రూలింగ్ విఘాతం కలిగిస్తుందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటిదేమీ ఉండకపోవచ్చని మరికొందరి అంచనా. ముఖ్యాంశాలు చూస్తే.... రుణాల పునఃచెల్లింపుల్లో విఫలమవుతున్న విద్యుత్, చక్కెర, షిప్పింగ్ ఇతర కంపెనీలపై నిర్ధిష్ట కాలపరిమితితో దివాలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు 2018 ఫిబ్రవరి 12న ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది. రుణ బకాయిల చెల్లింపుల్లో ఒకరోజు విఫలమైనా కఠిన దివాలా చర్యలు తీసుకునేందుకు ఈ సర్క్యులర్ వీలుకల్పించింది. రూ.2,000 కోట్ల పైబడ్డ మొండిబకాయిల అకౌంట్లు అన్నింటినీ బ్యాంకులు ఎన్సీఎల్టీకి రిఫర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రుణ ప్రణాళికలల్లో బ్యాంకులు, రుణదాతలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోడానికి వీలైంది. మొండిబకాయిలు ఉన్న కంపెనీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో పిటిషన్లు దాఖలు చేయాలని ఈ సర్క్యులర్‌లో బ్యాంకులను ఇతర రుణదాతలకు ఆర్బీఐ సూచించింది. తొలుత రుణ పరిష్కార ప్రణాళికను 180 రోజుల్లో అమలు చేయాలని (2018 ఆగస్టు 27లోపు) లేదంటే, అటు తర్వాత 15 రోజుల లోపు ఎన్సీఎల్టీలో దివాలా ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని పేర్కొంది. ఈ సర్క్యులర్ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ, ఎస్సార్పవర్, జీఎంఆర్ ఎనర్జీ, కేఎస్కే ఎనర్జీ, రతన్ ఇండియా పవర్సహా 34 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు అలాగే విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం (ఏపీపీ), ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపీపీఏఐ)లు తొలుత హలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. వారి అభ్యర్థనలను పరిశీలించాలని అలహబాద్ హైకోర్టు ఆర్బీఐకి సూచించింది. దీనిని ఆర్బీఐ పరిశీలించకపోవడంతో విద్యుత్ సంస్థలు సుప్రీంను ఆశ్రయించాయి. కాగా మరికొన్ని కంపెనీలు అసలు దివాలా కోడ్‌కే చట్టబద్ధత లేదంటూ సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించాయి. బ్యాంకులు సైతం ‘వన్డే డిఫాల్ట్’ నిబంధనలను సడలించాలని ఆర్బీఐకి వినతిపత్రం సమర్పించాయి. విద్యుత్ కంపెనీలు కోర్టుల్లో వాదనలు వినిపిస్తూ, అందర్నీ ఒకే గాటన కడుతూ.. ఒకే సూత్రాన్ని వర్తింపచేసేలా ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయడం తగదని పేర్కొన్నాయి. కంపెనీల పరిస్థితులను వేర్వేరుగా చూడాలని, బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతున్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని విన్నవించాయి. విద్యుత్ రంగం రుణ బకాయిలు 2018 మార్చి నాటికి రూ.5.65 లక్షల కోట్లు. అయితే ఇంత రుణాలు పేరుకుపోవడానికి తామే కారణం కాదని విద్యుత్ సంస్థలు కోర్టుకు విన్నవించాయి. ఇంధన కొరత, బొగ్గు బ్లాకుల కేటాయింపుల రద్దు వంటివీ కారణమని పేర్కొన్నాయి. గత ఏడాది సెప్టెంబర్ 11న సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ, దివాలా చర్యల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని రూలింగ్ ఇచ్చింది. తాజాగా ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను కొట్టివేస్తూ జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ కీలక రూలింగ్ ఇచ్చింది. నియమ, నిబంధనల విషయానికి వస్తే, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, సెక్షన్ 35ఏఏ ప్రకారం, ఆర్బీఐ పరిధిని మించేలా ఈ సర్క్యులర్ ఉందని (ఆల్ట్రా వైరస్) సుప్రీం తన 84 పేజీల తీర్పులో పేర్కొంది. కేసుల వారీ ప్రాతిపదికన దివాలాకోడ్ (ఐబీసీ)కు మొండిబకాయిల సమస్యలను రిఫర్ చేయాలితప్ప, అన్ని సంస్థలనూ ఒకేగాటన కట్టడం కూడదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా ప్రకారం– సర్క్యులర్ వల్ల ప్రభావం పడే కంపెనీల బకాయిల విలువ దాదాపు రూ.3.8 లక్షల కోట్లు. ఇవి 70 అకౌంట్లకు చెందినవి. ఇందులో రూ. 2 లక్షల కోట్లు విద్యుత్ రంగం వాటా. రుణ గ్రహీత సంస్థలు 34. ఈ బకాయిలకు సంబంధించి మొత్తం 92 శాతం 2018 మార్చి నాటికి మొండిబకాయిలుగా ప్రకటించడం జరిగింది. ఎన్సీఎల్టీకి వెళ్లే మా హక్కు పోలేదు: బ్యాంకులు సుప్రీంకోర్టు రూలింగ్‌పై బ్యాంకుల వాదన భిన్నంగా ఉంది. మొండిబకాయిల సమస్యపై ఎన్సీఎల్టీకి వెళ్లే తమ హక్కును సుప్రీంకోర్టు రూలింగ్ కాలరాయలేదని బ్యాంకులు పేర్కొంటున్నాయి. రుణ క్రమశిక్షణకు ఈ తీర్పు నీరుగార్చబోదని, సుప్రీంకోర్టు ఇంతక్రితమే సమర్ధించిన దివాలా కోడ్కింద తమ రుణ పరిష్కార ప్రణాళిక ప్రక్రియ కొనసాగుతుందని బ్యాంకింగ్ స్పష్టంచేసింది. వివిధ కంపెనీల మొండిబకాయిల సమస్యకు సంబంధించి తమ రుణ ప్రణాళిక పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దివాలా కోడ్ (ఐబీసీ) రాజ్యాంగ బద్ధతను గత తీర్పుల్లోనే సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా, ఇక దివాలా కేసులను వేర్వేరుగా పరిశీలించి ఎన్సీఎల్టీకి రిఫర్ చేయాల్సి ఉంటుందని మరికొందరు బ్యాంకర్లు పేర్కొన్నారు. అన్ని కేసులు రద్దయినట్టే : నిపుణులు సుప్రీంకోర్టు తీర్పుతో ఐబీసీ కింద రిఫర్ చేసిన అన్ని కేసులు లేదా ఎన్సీఎల్టీలో నమోదైన అన్ని కేసులు రద్దయినట్టేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రూ2,000 కోట్లు, ఆపై మొత్తాలకు సంబంధించిన రుణాల కేసుల్లో చెల్లింపుల్లో ఒక్క రోజు విఫలమైనా వాటిని ఎన్పీఏలుగా గుర్తించాలని ఆర్బీఐ నాటి ఉత్తర్వుల సారాంశం. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని కంపెనీలు అవి ఐబీసీ కింద సిఫారసు చేసినా లేదా పరిష్కార ప్రక్రియ కింద నమోదైనా గానీ, ఏ దశలో ఉన్నా దివాల కోసం ప్రతిపాదించనట్టే పరిగణించాల్సి ఉంటుంది’’ అని లక్ష్మికుమరన్ అండ్ ఏఎంసీ న్యాయ సంస్థ ఎగ్జిక్యూటివ్ పార్ట్నర్ పునీత్ త్యాగి తెలిపారు. ఎన్సీఎల్టీకి వెళ్లే మా హక్కు పోలేదు: బ్యాంకులు సుప్రీంకోర్టు రూలింగ్‌పై బ్యాంకుల వాదన భిన్నంగా ఉంది. మొండిబకాయిల సమస్యపై ఎన్సీఎల్టీకి వెళ్లే తమ హక్కును సుప్రీంకోర్టు రూలింగ్ కాలరాయలేదని బ్యాంకులు పేర్కొంటున్నాయి. రుణ క్రమశిక్షణకు ఈ తీర్పు నీరుగార్చబోదని, సుప్రీంకోర్టు ఇంతక్రితమే సమర్ధించిన దివాలా కోడ్కింద తమ రుణ పరిష్కార ప్రణాళిక ప్రక్రియ కొనసాగుతుందని బ్యాంకింగ్ స్పష్టంచేసింది. వివిధ కంపెనీల మొండిబకాయిల సమస్యకు సంబంధించి తమ రుణ ప్రణాళిక పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దివాలా కోడ్ (ఐబీసీ) రాజ్యాంగ బద్ధతను గత తీర్పుల్లోనే సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా, ఇక దివాలా కేసులను వేర్వేరుగా పరిశీలించి ఎన్సీఎల్టీకి రిఫర్ చేయాల్సి ఉంటుందని మరికొందరు బ్యాంకర్లు పేర్కొన్నారు. ఆర్బీఐ తదుపరి చర్యలు తీసుకుంటుంది : జైట్లీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై ఆర్బీఐ తగిన చర్యలను తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అంతక్రితం ఆర్థికశాఖ అధికారులు ఎవ్వరూ ఈ అంశంపై వ్యాఖ్యానించకపోవడం గమనార్హం. మరో సర్క్యులర్ ఇవ్వొచ్చు... ప్రస్తుతం పూర్తయిన లేదా పూర్తవుతున్న దివాలా ప్రక్రియలను తాజా సుప్రీం తీర్పు ప్రశ్నార్థకం చేసింది. అయితే దివాలా ప్రక్రియ దారులు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పలేం. రుణ పునర్వ్యవస్థీకరణకు బ్యాంకులు, కంపెనీలు తగిన మార్గాలను అన్వేషించే అవకాశం ఉంటుంది.మొండిబకాయిల పునర్వ్యవస్థీకరణకు మరో సర్క్యులర్/మార్గదర్శకాలను ఆర్బీఐ జారీ చేయవచ్చు. – విశ్రవ్ ముఖర్జీ, జే సుగర్ అసోసియేట్స్ భాగస్వామి బ్యాంకులే నిర్ణయం తీసుకుంటే! న్యాయవ్యవస్థ ఎంత క్రియాశీలకంగా ఉందన్న విషయం తాజా పరిణామం సూచిస్తోంది. అయితే బ్యాంకులు తమంతట తాముగా దివాలా చర్యలకు శ్రీకారం చుడితే పరిస్థితి ఏమిటన్న విషయం ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. ఇదే జరిగితే తాజా సర్క్యులర్ కొట్టివేత ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. – సిరిల్ ష్రాప్, సైరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ మేనేజింగ్ పార్ట్నర్ దివాలా ప్రక్రియ మందగమనం విద్యుత్ రంగంలో మొండి బకాయిల కంపెనీలపై దివాలా ప్రక్రియ ఇప్పటికే నెమ్మదిగా ఉంది. తాజా సుప్రీం రూలింగ్ ఈ ప్రక్రియను మరింత నెమ్మదిచేస్తుంది. – సవ్యసాచి మజుందార్, ఐసీఆర్ఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బ్యాంకులకు క్రెడిట్ నెగిటివ్ తాజా సుప్రీం తీర్పు భారత్ బ్యాంకులకు క్రెడిట్ నెగిటివ్. బడా రుణ గ్రహీతలకు సంబంధించి మొండి బకాయిల గుర్తింపు, ఈ సమస్య పరిష్కారం వంటి అంశాలపై ఆర్బీఐ సర్క్యులర్ స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. అయితే తాజా పరిణామం ఈ చొరవలను నీరుగార్చింది. తాజా రూలింగ్‌తో బ్యాంకుల దివాలా చర్యల పురోగతి మందగించే అవకాశం ఉంది. – శ్రీకాంత్ వడ్లమాని, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ -
లక్ష్యం మేరకు రుణాలు
మెదక్ అర్బన్: బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సమావేశంలో నిర్దేశించిన రుణాలను మంజూరు చేయాలని సూచిస్తున్నా బ్యాంకర్లు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి బ్యాంకు నెలలో కనీసం ఐదుగురు లబ్ధిదారులకు ముద్ర రుణాలను తప్పకుండా మంజూరు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు బ్యాంకు ఆ దిశగా మంజూరు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలను మంజూరు చేసినా ఇప్పటికీ కొన్ని శాఖల అధికారులు గ్రౌండింగ్ చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్నారు. గ్రౌండింగ్ అయిన వాటి రుణాలకు సంబంధించి త్వరగా యూసీలను అందజేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి ఆయా శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలన్నారు. అలాగే బ్యాంకుల వారీగా పెండింగ్‌లో ఉన్న ముద్ర, స్టాండప్, పీఎంఈజీపీతో పాటు కార్పొరేషన్ రుణాలకు సంబంధించి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామిక రంగంలో ఆసక్తి ఉన్న వారికి టీ ప్రైడ్, స్టాండప్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల ద్వారా రుణాలను మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాలను గ్రౌండింగ్ చేసేందుకు బ్యాంకర్ల సహకారం తప్పనిసరి అని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. దరఖాస్తులు అందిన వెంటనే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. నా బార్డు ద్వారా ప్రత్యేక రుణాలు.. 2019–20 సంవత్సరానికి గాను నాబార్డు ద్వారా రూ.2,091.94 కోట్లతో రూపొందించిన రుణ ప్రణాళికను కలెక్టర్ «ధర్మారెడ్డి ఆవిష్కరించారు. వ్యవసాయ ధీర్ఘకాలిక రుణాల కల్పన కింద డెయిరీ, మేకలు, గొర్రెలు, గేదెలు, వ్యవసాయ పనిముట్లు, భూమిని అభివృద్ధి చేసుకునేందుకు, గోడౌన్ల నిర్మాణాలకు రుణ సదుపాయాలను కల్పించనున్నట్లు నాబార్డు అధికారి తిమోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సీతారామరావు, ఎల్డీఎం నాగరాజు, జీఎం డీఐసీ రత్నాకర్, కార్పొరేషన్ అధికారులు దేవయ్య, సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్, డీడబ్ల్యూఓ జ్యోతిపద్మ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
మరో భారీ కుంభకోణం
న్యూఢిల్లీ/కాన్పూర్: వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ షాక్ నుంచి ఇంకా తేరుకోకముందే.. కాన్పూర్‌కు చెందిన వ్యాపార వేత్త విక్రమ్ కొఠారీ రూ. 800 కోట్ల మేర బ్యాంకుల్ని ముంచేసి విదేశాలకు పరారయ్యారన్న వార్త కలకలం రేపుతోంది. రొటొమ్యాక్ పెన్స్ కంపెనీ యజమాని కొఠారీ.. అలహాబాద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల నుంచి తీసుకున్న రూ. 800 కోట్ల రుణాల్ని ఎగ్గొటారని, ఈ రుణాల మంజూరులో బ్యాంకులు కూడా రాజీపడ్డాయని కథనాలు వెలువడ్డాయి. ఒక నివేదిక ప్రకారం ముంబైలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 485 కోట్లు, కోల్‌కతాలోని అలహాబాద్ బ్యాంకు నుంచి రూ. 352 కోట్లను కొఠారీ రుణంగా తీసుకున్నారని.. ఏడాది గడిచినా వడ్డీ గానీ రుణం గానీ కొఠారీ చెల్లించనట్లు తెలుస్తోంది. కాన్పూర్ నడిబొడ్డున ఉన్న కొఠారీ కంపెనీ ప్రధాన కార్యాలయం వారం నుంచి మూసేఉందని.. ఆయన జాడ కూడా తెలియడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాను పారిపోయానంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని కొఠారీ చెప్పినట్లు స్థానిక మీడియాలో వార్తలొచ్చాయి. ‘నేను కాన్పూర్ వాసిని.. ఇక్కడే ఉంటాను. వ్యాపార అవసరాల కోసం అవసరమైనప్పుడు విదేశాలకు వెళ్లి వస్తుంటా’ అని కొఠారీ పేర్కొన్నారు. మరోవైపు అలహాబాద్ బ్యాంకు మేనేజరు రాజేశ్ గుప్తా మాట్లాడుతూ.. కొఠారీ ఆస్తుల్ని అమ్మడం ద్వారా డబ్బును రాబట్టుకోగలమనే నమ్మకం ఉందన్నారు. గతేడాది బ్యాంక్ ఆఫ్ బరోడా.. రొటొమ్యాక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’(విల్‌పుల్ డిఫాల్టర్)గా ప్రకటించింది. తమను ‘విల్‌ఫుల్ డిఫాల్టర్’ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ ఆ కంపెనీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. రూ. 300 కోట్లకు పైగా ఆస్తుల్ని ఇచ్చేందుకు సిద్ధమైనా రోటొమ్యాక్‌ను ‘విల్‌ఫుల్ డిఫాల్టర్’గా తప్పుగా ప్రకటించారని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీబీ భోస్లే, జస్టిస్ యశ్వంత్ వర్మ ధర్మాసనం పేర్కొంది. రిజర్వ్ బ్యాంకు నిర్దేశించిన ప్రమాణాల మేరకు రొటొమ్యాక్‌ను విల్‌ఫుల్ డిఫాల్టర్‌గా ప్రకటిస్తూ ఫిబ్రవరి 27, 2017న ఆదేశాలు జారీ అయ్యాయి. -
'అప్పు'డే ఇవ్వనంటారా..
► అన్నదాతకు తప్పని రుణ అగచాట్లు ► రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు ► ఇంకా ప్రారంభానికి నోచుకోని రుణ ప్రక్రియ ► వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు ► జిల్లా రుణ లక్ష్యం రూ.2500 కోట్లు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అన్నదాతలకు అప్పుల తిప్పలు తప్పడం లేదు. వారం రోజులుగా చినుకులు పలకరిస్తుండడంతో దమ్ములకు సిద్ధమవుతు న్న రైతన్నకు రుణం విషయంలో మాత్రం దారుణ అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వారికి విత్తనం సిద్ధం చేసుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే చేతిలో డబ్బు లేకపోవడంతో దిగాలు పడుతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారు కనికరించడం లేదు. దీంతో పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వార్షిక ప్రణాళికలో ఖరీఫ్, రబీకి రూ.2500 కోట్లను రుణంగా ఇవ్వడానికి అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అందులో ఈ ఏడాది ఖరీఫ్ బ్యాంకర్లు మాత్రం ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ అధికారుల వాదన మాత్రం దీనికి భిన్నంగా ఉంది. జిల్లాలో ఇదీ పరిస్థితి.. జిల్లాలో 5.70 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో అధిక శాతం పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడి ఖర్చుల కోసం బ్యాంకుల పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇది వరకు మే నెలలో పంట రుణాలను బ్యాంకర్లు అందించేవారు. ఈ ఏడాది రుణాలు పంపిణీ చేసే ప్రక్రియ చాలా ప్రాంతాల్లో ప్రారంభించలేదు. రోజూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రేపుమాపు అంటూ బ్యాంకర్లు కాలం వెళ్లదీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ ప్రారంభం కావడంతో చేసేదేమీ లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అధిక వడ్డీకి అప్పులు తీసుకొని కొందరు రైతులు వరి, పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాంకర్లమో డబ్బులు లేవంటూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 2.51లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో వరి 2.12లక్షల హెక్టార్ల విస్తీర్ణం కాగా, పత్తి 9500 హెక్టార్లు, ఇరత పంటలు 13618 హెక్టార్ల్ల విస్తీర్ణంలో సాగు చేయనున్నారు. రుణ లక్ష్యం రూ.2500 కోట్లు జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా సాగు కోసం రూ.2500 కోట్లు రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. అందులో ఖరీఫ్‌కు గాను రూ.1580 కోట్లు, రబీకి రూ.920 కోట్లు లక్ష్యం కాగా... ఆయా బ్యాంకులకు సంబంధిం చిరుణ లక్ష్యాన్ని జిల్లా ఉన్నతాధికారులు అప్రూ వ్ చేయలేదని, పాత బకాయిలు చెల్లించడంలో సరైన స్పష్టత లేదంటూ లీడ్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారని రైతులంటున్నారు. ఆయా బ్యాంకులు రుణలక్ష్యం ప్రకటించక పోవడంతో బ్యాంకర్లు కూడా రుణాలిచ్చేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో గత ఏడాది 5.70 లక్షల మంది రైతులకు గానూ లక్ష్యం రూ. 2409కోట్లు కాగా ఇందులో 70 శాతం మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. కానీ అధికంగా ఇచ్చినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు. రైతులకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు రుణం ఇవ్వాల్సి ఉండగా బ్యాంకర్లు గత ఏడాది రూ.30 వేల నుంచి 70వేల రూపాయల వరకు మాత్రమే ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు. వడ్డీ వ్యాపారులే దిక్కు ఖరీఫ్ ప్రారంభం కానుండడంతో రైతులు పంటలకు విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో డబ్బుల్లేక రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అధికారులు రేపు, మాపంటూ తిప్పుతుండడంతో విసుగు చెందిన రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదనుగా చూసుకొని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు అప్పులిచ్చి పంట చేతికొచ్చే సమయానికి వారి పంటనంతటినీ కాజేస్తున్నారు. రుణాలందించేందుకు చర్యలు జిల్లాకు ఖరీఫ్ లక్ష్యం రూ.1580 కోట్లలో మే నెల వరకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చాం. గతంలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పద్ధతిగా ఎకరానికి రూ.20వేలు వరకు ఇచ్చారు. ప్రస్తుతం ఎకరానికి రూ.30వేలు ఇస్తున్నాం. ఈ ఏడాది రుణం తీసుకునేవారికి పాత బకాయి తీరిపోగా పెట్టుబడుల కోసం రూ.10వేలు వరకు చేతికి ఇస్తున్నాం. అంతేకాకుండా బ్యాంక్ సిబ్బందితో ప్రతి గ్రామంలో రుణాలపై అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తి చేస్తాం. సీజన్ మొదలవుతుంది కాబట్టి ఈ నెలలో రుణాలు ఇచ్చే ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపడతాం. – ఎల్.వెంకటేశ్వర్లు, జిల్లా లీడ్‌బ్యాంక్ మేనేజర్, శ్రీకాకుళం. పెట్టుబడులకు ఇబ్బందులు ఖరీఫ్‌లో పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. బ్యాంకర్ల చుట్టూ ఒకటికి పది సార్లు తిరుగుతున్నా రుణం దొరకడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకుంటేనే వ్యవసాయం సాధ్యం అవుతుంది. – కింతలి ఆదినారాయణ, రైతు, ఎస్ఎంపురం. పాత రుణాలు చెల్లించాల్సిందే.. గతంలో తీసుకున్న పాత రుణాలు చెల్లించకుంటే కొత్తగా రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. బ్యాంకుకు వెళితే చాలు ఎంత రుణం చెల్లించాల్సి ఉంది. ఎంత రుణ మాఫీ అయ్యింది, కొత్తగా ఇవ్వాలంటే పాత బకాయిలు చెల్లించాలంటూ చెబుతున్నారు. – పి.రమేష్, తలగాం, టెక్కలి మండలం