న్యూఢిల్లీ : మొండిబకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన జారీచేసిన ఒక సర్క్యులర్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. ఈ పరిణామం మొండిబకాయిలుగా మారిన రుణాల భారంతో సతమతమవుతున్న విద్యుత్ సంస్థలుసహా పలు కంపెనీలకు ఊరటనిచ్చింది. అయితే, బ్యాంకులు తీసుకుంటున్న దివాలా చర్యలకు ఈ రూలింగ్ విఘాతం కలిగిస్తుందని కొందరు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాంటిదేమీ ఉండకపోవచ్చని మరికొందరి అంచనా. ముఖ్యాంశాలు చూస్తే....
- రుణాల పునఃచెల్లింపుల్లో విఫలమవుతున్న విద్యుత్, చక్కెర, షిప్పింగ్ ఇతర కంపెనీలపై నిర్ధిష్ట కాలపరిమితితో దివాలా చర్యలు తీసుకోవాలని బ్యాంకులకు 2018 ఫిబ్రవరి 12న ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేసింది. రుణ బకాయిల చెల్లింపుల్లో ఒకరోజు విఫలమైనా కఠిన దివాలా చర్యలు తీసుకునేందుకు ఈ సర్క్యులర్ వీలుకల్పించింది. రూ.2,000 కోట్ల పైబడ్డ మొండిబకాయిల అకౌంట్లు అన్నింటినీ బ్యాంకులు ఎన్‌సీఎల్‌టీకి రిఫర్ చేయాల్సి ఉంటుంది.
- దీనివల్ల రుణ ప్రణాళికలల్లో బ్యాంకులు, రుణదాతలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోడానికి వీలైంది.
- మొండిబకాయిలు ఉన్న కంపెనీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్లు దాఖలు చేయాలని ఈ సర్క్యులర్‌లో బ్యాంకులను ఇతర రుణదాతలకు ఆర్‌బీఐ సూచించింది. తొలుత రుణ పరిష్కార ప్రణాళికను 180 రోజుల్లో అమలు చేయాలని (2018 ఆగస్టు 27లోపు) లేదంటే, అటు తర్వాత 15 రోజుల లోపు ఎన్‌సీఎల్‌టీలో దివాలా ప్రొసీడింగ్స్ ప్రారంభించాలని పేర్కొంది.
- ఈ సర్క్యులర్ రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తూ, ఎస్సార్‌పవర్, జీఎంఆర్ ఎనర్జీ, కేఎస్‌కే ఎనర్జీ, రతన్ ఇండియా పవర్‌సహా 34 విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు అలాగే విద్యుత్ ఉత్పత్తిదారుల సంఘం (ఏపీపీ), ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐపీపీఏఐ)లు తొలుత హలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. వారి అభ్యర్థనలను పరిశీలించాలని అలహబాద్ హైకోర్టు ఆర్‌బీఐకి సూచించింది. దీనిని ఆర్‌బీఐ పరిశీలించకపోవడంతో విద్యుత్ సంస్థలు సుప్రీంను ఆశ్రయించాయి. కాగా మరికొన్ని కంపెనీలు అసలు దివాలా కోడ్‌కే చట్టబద్ధత లేదంటూ సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించాయి.
- బ్యాంకులు సైతం ‘వన్‌డే డిఫాల్ట్’ నిబంధనలను సడలించాలని ఆర్‌బీఐకి వినతిపత్రం సమర్పించాయి.
- విద్యుత్ కంపెనీలు కోర్టుల్లో వాదనలు వినిపిస్తూ, అందర్నీ ఒకే గాటన కడుతూ.. ఒకే సూత్రాన్ని వర్తింపచేసేలా ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ చేయడం తగదని పేర్కొన్నాయి. కంపెనీల పరిస్థితులను వేర్వేరుగా చూడాలని, బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతున్నాయన్న విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని విన్నవించాయి.
- విద్యుత్ రంగం రుణ బకాయిలు 2018 మార్చి నాటికి రూ.5.65 లక్షల కోట్లు. అయితే ఇంత రుణాలు పేరుకుపోవడానికి తామే కారణం కాదని విద్యుత్ సంస్థలు కోర్టుకు విన్నవించాయి. ఇంధన కొరత, బొగ్గు బ్లాకుల కేటాయింపుల రద్దు వంటివీ కారణమని పేర్కొన్నాయి.
- గత ఏడాది సెప్టెంబర్ 11న సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ, దివాలా చర్యల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని రూలింగ్ ఇచ్చింది.
- తాజాగా ఫిబ్రవరి 12 సర్క్యులర్‌ను కొట్టివేస్తూ జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ కీలక రూలింగ్ ఇచ్చింది. నియమ, నిబంధనల విషయానికి వస్తే, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, సెక్షన్ 35ఏఏ ప్రకారం, ఆర్‌బీఐ పరిధిని మించేలా ఈ సర్క్యులర్ ఉందని (ఆల్ట్రా వైరస్) సుప్రీం తన 84 పేజీల తీర్పులో పేర్కొంది. కేసుల వారీ ప్రాతిపదికన దివాలాకోడ్ (ఐబీసీ)కు మొండిబకాయిల సమస్యలను రిఫర్ చేయాలితప్ప, అన్ని సంస్థలనూ ఒకేగాటన కట్టడం కూడదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది.
- రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా ప్రకారం– సర్క్యులర్ వల్ల ప్రభావం పడే కంపెనీల బకాయిల విలువ దాదాపు రూ.3.8 లక్షల కోట్లు. ఇవి 70 అకౌంట్లకు చెందినవి. ఇందులో రూ. 2 లక్షల కోట్లు విద్యుత్ రంగం వాటా. రుణ గ్రహీత సంస్థలు 34. ఈ బకాయిలకు సంబంధించి మొత్తం 92 శాతం 2018 మార్చి నాటికి మొండిబకాయిలుగా ప్రకటించడం జరిగింది.
ఎన్‌సీఎల్‌టీకి వెళ్లే మా హక్కు పోలేదు: బ్యాంకులు
సుప్రీంకోర్టు రూలింగ్‌పై బ్యాంకుల వాదన భిన్నంగా ఉంది. మొండిబకాయిల సమస్యపై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లే తమ హక్కును సుప్రీంకోర్టు రూలింగ్ కాలరాయలేదని బ్యాంకులు పేర్కొంటున్నాయి. రుణ క్రమశిక్షణకు ఈ తీర్పు నీరుగార్చబోదని, సుప్రీంకోర్టు ఇంతక్రితమే సమర్ధించిన దివాలా కోడ్‌కింద తమ రుణ పరిష్కార ప్రణాళిక ప్రక్రియ కొనసాగుతుందని బ్యాంకింగ్ స్పష్టంచేసింది. వివిధ కంపెనీల మొండిబకాయిల సమస్యకు సంబంధించి తమ రుణ ప్రణాళిక పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దివాలా కోడ్ (ఐబీసీ) రాజ్యాంగ బద్ధతను గత తీర్పుల్లోనే సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా, ఇక దివాలా కేసులను వేర్వేరుగా పరిశీలించి ఎన్‌సీఎల్‌టీకి రిఫర్ చేయాల్సి ఉంటుందని మరికొందరు బ్యాంకర్లు పేర్కొన్నారు.
అన్ని కేసులు రద్దయినట్టే : నిపుణులు
సుప్రీంకోర్టు తీర్పుతో ఐబీసీ కింద రిఫర్ చేసిన అన్ని కేసులు లేదా ఎన్‌సీఎల్‌టీలో నమోదైన అన్ని కేసులు రద్దయినట్టేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రూ2,000 కోట్లు, ఆపై మొత్తాలకు సంబంధించిన రుణాల కేసుల్లో చెల్లింపుల్లో ఒక్క రోజు విఫలమైనా వాటిని ఎన్‌పీఏలుగా గుర్తించాలని ఆర్‌బీఐ నాటి ఉత్తర్వుల సారాంశం. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని కంపెనీలు అవి ఐబీసీ కింద సిఫారసు చేసినా లేదా పరిష్కార ప్రక్రియ కింద నమోదైనా గానీ, ఏ దశలో ఉన్నా దివాల కోసం ప్రతిపాదించనట్టే పరిగణించాల్సి ఉంటుంది’’ అని లక్ష్మికుమరన్ అండ్ ఏఎంసీ న్యాయ సంస్థ ఎగ్జిక్యూటివ్ పార్ట్‌నర్ పునీత్ త్యాగి తెలిపారు.
ఎన్‌సీఎల్‌టీకి వెళ్లే మా హక్కు పోలేదు: బ్యాంకులు
సుప్రీంకోర్టు రూలింగ్‌పై బ్యాంకుల వాదన భిన్నంగా ఉంది. మొండిబకాయిల సమస్యపై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లే తమ హక్కును సుప్రీంకోర్టు రూలింగ్ కాలరాయలేదని బ్యాంకులు పేర్కొంటున్నాయి. రుణ క్రమశిక్షణకు ఈ తీర్పు నీరుగార్చబోదని, సుప్రీంకోర్టు ఇంతక్రితమే సమర్ధించిన దివాలా కోడ్‌కింద తమ రుణ పరిష్కార ప్రణాళిక ప్రక్రియ కొనసాగుతుందని బ్యాంకింగ్ స్పష్టంచేసింది. వివిధ కంపెనీల మొండిబకాయిల సమస్యకు సంబంధించి తమ రుణ ప్రణాళిక పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. దివాలా కోడ్ (ఐబీసీ) రాజ్యాంగ బద్ధతను గత తీర్పుల్లోనే సుప్రీంకోర్టు సమర్థించిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా, ఇక దివాలా కేసులను వేర్వేరుగా పరిశీలించి ఎన్‌సీఎల్‌టీకి రిఫర్ చేయాల్సి ఉంటుందని మరికొందరు బ్యాంకర్లు పేర్కొన్నారు.
ఆర్‌బీఐ తదుపరి చర్యలు తీసుకుంటుంది : జైట్లీ
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై ఆర్‌బీఐ తగిన చర్యలను తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన ఒక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అంతక్రితం ఆర్థికశాఖ అధికారులు ఎవ్వరూ ఈ అంశంపై వ్యాఖ్యానించకపోవడం గమనార్హం.
మరో సర్క్యులర్ ఇవ్వొచ్చు...
ప్రస్తుతం పూర్తయిన లేదా పూర్తవుతున్న దివాలా ప్రక్రియలను తాజా సుప్రీం తీర్పు ప్రశ్నార్థకం చేసింది. అయితే దివాలా ప్రక్రియ దారులు పూర్తిగా మూసుకుపోయాయని చెప్పలేం. రుణ పునర్‌వ్యవస్థీకరణకు బ్యాంకులు, కంపెనీలు తగిన మార్గాలను అన్వేషించే అవకాశం ఉంటుంది.మొండిబకాయిల పునర్‌వ్యవస్థీకరణకు మరో సర్క్యులర్/మార్గదర్శకాలను ఆర్‌బీఐ జారీ చేయవచ్చు. – విశ్రవ్ ముఖర్జీ, జే సుగర్ అసోసియేట్స్ భాగస్వామి
బ్యాంకులే నిర్ణయం తీసుకుంటే!
న్యాయవ్యవస్థ ఎంత క్రియాశీలకంగా ఉందన్న విషయం తాజా పరిణామం సూచిస్తోంది. అయితే బ్యాంకులు తమంతట తాముగా దివాలా చర్యలకు శ్రీకారం చుడితే పరిస్థితి ఏమిటన్న విషయం ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది. ఇదే జరిగితే తాజా సర్క్యులర్ కొట్టివేత ప్రభావం స్వల్పంగానే ఉంటుంది. – సిరిల్ ష్రాప్, సైరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ మేనేజింగ్ పార్ట్‌నర్
దివాలా ప్రక్రియ మందగమనం
విద్యుత్ రంగంలో మొండి బకాయిల కంపెనీలపై దివాలా ప్రక్రియ ఇప్పటికే నెమ్మదిగా ఉంది. తాజా సుప్రీం రూలింగ్ ఈ ప్రక్రియను మరింత నెమ్మదిచేస్తుంది. – సవ్యసాచి మజుందార్, ఐసీఆర్‌ఏ సీనియర్ వైస్ ప్రెసిడెంట్
బ్యాంకులకు క్రెడిట్ నెగిటివ్
తాజా సుప్రీం తీర్పు భారత్ బ్యాంకులకు క్రెడిట్ నెగిటివ్. బడా రుణ గ్రహీతలకు సంబంధించి మొండి బకాయిల గుర్తింపు, ఈ సమస్య పరిష్కారం వంటి అంశాలపై ఆర్‌బీఐ సర్క్యులర్ స్పష్టమైన దిశానిర్దేశం చేసింది. అయితే తాజా పరిణామం ఈ చొరవలను నీరుగార్చింది. తాజా రూలింగ్‌తో బ్యాంకుల దివాలా చర్యల పురోగతి మందగించే అవకాశం ఉంది. – శ్రీకాంత్ వడ్లమాని, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్
Comments
Please login to add a commentAdd a comment