'అప్పు'డే ఇవ్వనంటారా.. | Farmers around banks for loans | Sakshi
Sakshi News home page

'అప్పు'డే ఇవ్వనంటారా..

Published Mon, Jun 12 2017 7:31 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

'అప్పు'డే ఇవ్వనంటారా.. - Sakshi

'అప్పు'డే ఇవ్వనంటారా..

► అన్నదాతకు తప్పని రుణ అగచాట్లు
► రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు
► ఇంకా ప్రారంభానికి నోచుకోని రుణ ప్రక్రియ
► వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు
► జిల్లా రుణ లక్ష్యం రూ.2500 కోట్లు  


శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అన్నదాతలకు అప్పుల తిప్పలు తప్పడం లేదు. వారం రోజులుగా చినుకులు పలకరిస్తుండడంతో దమ్ములకు సిద్ధమవుతు న్న రైతన్నకు రుణం విషయంలో మాత్రం దారుణ అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం వారికి విత్తనం సిద్ధం చేసుకునేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే చేతిలో డబ్బు లేకపోవడంతో దిగాలు పడుతున్నారు. పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా వారు కనికరించడం లేదు. దీంతో పెట్టుబడి ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వార్షిక ప్రణాళికలో ఖరీఫ్, రబీకి రూ.2500 కోట్లను రుణంగా ఇవ్వడానికి అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. అందులో ఈ ఏడాది ఖరీఫ్‌ బ్యాంకర్లు మాత్రం ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ అధికారుల వాదన మాత్రం దీనికి భిన్నంగా ఉంది.

జిల్లాలో ఇదీ పరిస్థితి..
జిల్లాలో 5.70 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో అధిక శాతం పంటల సాగుకు అవసరమయ్యే పెట్టుబడి ఖర్చుల కోసం బ్యాంకుల పైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఇది వరకు మే నెలలో పంట రుణాలను బ్యాంకర్లు అందించేవారు. ఈ ఏడాది రుణాలు పంపిణీ చేసే ప్రక్రియ చాలా ప్రాంతాల్లో ప్రారంభించలేదు. రోజూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా రేపుమాపు అంటూ బ్యాంకర్లు కాలం వెళ్లదీస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభం కావడంతో చేసేదేమీ లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

అధిక వడ్డీకి అప్పులు తీసుకొని కొందరు రైతులు వరి, పత్తి విత్తనాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బ్యాంకర్లమో డబ్బులు లేవంటూ రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 2.51లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇందులో వరి 2.12లక్షల హెక్టార్ల విస్తీర్ణం కాగా, పత్తి 9500 హెక్టార్లు, ఇరత పంటలు 13618 హెక్టార్ల్ల విస్తీర్ణంలో సాగు చేయనున్నారు.

రుణ లక్ష్యం రూ.2500 కోట్లు
జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా సాగు కోసం రూ.2500 కోట్లు రుణాలు ఇవ్వాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించారు. అందులో ఖరీఫ్‌కు గాను రూ.1580 కోట్లు, రబీకి రూ.920 కోట్లు లక్ష్యం కాగా... ఆయా బ్యాంకులకు సంబంధిం చిరుణ లక్ష్యాన్ని జిల్లా ఉన్నతాధికారులు అప్రూ వ్‌ చేయలేదని, పాత బకాయిలు చెల్లించడంలో సరైన స్పష్టత లేదంటూ లీడ్‌ బ్యాంక్‌ అధికారులు చెబుతున్నారని రైతులంటున్నారు. ఆయా బ్యాంకులు రుణలక్ష్యం ప్రకటించక పోవడంతో బ్యాంకర్లు కూడా రుణాలిచ్చేందుకు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో గత ఏడాది 5.70 లక్షల మంది రైతులకు గానూ లక్ష్యం రూ. 2409కోట్లు కాగా ఇందులో 70 శాతం మాత్రమే రుణాలు పంపిణీ చేశారు. కానీ అధికంగా ఇచ్చినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు. రైతులకు గరిష్టంగా లక్ష రూపాయల వరకు రుణం ఇవ్వాల్సి ఉండగా బ్యాంకర్లు గత ఏడాది రూ.30 వేల నుంచి 70వేల రూపాయల వరకు మాత్రమే ఇచ్చారని రైతులు ఆరోపిస్తున్నారు.

వడ్డీ వ్యాపారులే దిక్కు
ఖరీఫ్‌ ప్రారంభం కానుండడంతో రైతులు పంటలకు విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి ఖర్చుల కోసం చేతిలో డబ్బుల్లేక రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకు అధికారులు రేపు, మాపంటూ తిప్పుతుండడంతో విసుగు చెందిన రైతులు ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయిస్తున్నారు. దీన్ని అదనుగా చూసుకొని వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు అప్పులిచ్చి పంట చేతికొచ్చే సమయానికి వారి పంటనంతటినీ కాజేస్తున్నారు.

రుణాలందించేందుకు చర్యలు
జిల్లాకు ఖరీఫ్‌ లక్ష్యం రూ.1580 కోట్లలో మే నెల వరకు రూ.300 కోట్ల రుణాలు ఇచ్చాం. గతంలో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పద్ధతిగా ఎకరానికి రూ.20వేలు వరకు ఇచ్చారు. ప్రస్తుతం ఎకరానికి రూ.30వేలు ఇస్తున్నాం. ఈ ఏడాది రుణం తీసుకునేవారికి పాత బకాయి తీరిపోగా పెట్టుబడుల కోసం రూ.10వేలు వరకు చేతికి ఇస్తున్నాం. అంతేకాకుండా బ్యాంక్‌ సిబ్బందితో ప్రతి గ్రామంలో రుణాలపై అవగాహన కల్పించి లక్ష్యాలను పూర్తి చేస్తాం. సీజన్‌ మొదలవుతుంది కాబట్టి ఈ నెలలో రుణాలు ఇచ్చే ప్రక్రియ మరింత వేగవంతం చేసేందుకు చర్యలు చేపడతాం.   – ఎల్‌.వెంకటేశ్వర్లు, జిల్లా లీడ్‌బ్యాంక్‌ మేనేజర్, శ్రీకాకుళం.

పెట్టుబడులకు ఇబ్బందులు
ఖరీఫ్‌లో పెట్టుబడులు బాగా పెరుగుతున్నాయి. బ్యాంకర్ల చుట్టూ ఒకటికి పది సార్లు తిరుగుతున్నా రుణం దొరకడం లేదు. దీంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకుంటేనే వ్యవసాయం సాధ్యం అవుతుంది. – కింతలి ఆదినారాయణ, రైతు, ఎస్‌ఎంపురం.

పాత రుణాలు చెల్లించాల్సిందే..
గతంలో తీసుకున్న పాత రుణాలు చెల్లించకుంటే కొత్తగా రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. బ్యాంకుకు వెళితే చాలు ఎంత రుణం చెల్లించాల్సి ఉంది. ఎంత రుణ మాఫీ అయ్యింది, కొత్తగా ఇవ్వాలంటే పాత బకాయిలు చెల్లించాలంటూ చెబుతున్నారు.  – పి.రమేష్, తలగాం, టెక్కలి మండలం  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement