ఇక ‘జైవిక్‌ భారత్‌’ | FSSAI launches genuine organic products logo | Sakshi
Sakshi News home page

ఇక ‘జైవిక్‌ భారత్‌’

Published Tue, Jul 10 2018 3:34 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM

FSSAI launches genuine organic products logo - Sakshi

మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తులు

సేంద్రియ (ఆర్గానిక్‌) వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా క్రమబద్ధీకరించే ప్రక్రియకు తొలి అడుగు పడింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని భారతీయ ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ.) ఏడాది క్రితం ప్రకటించిన నిబంధనావళి ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 2017 డిసెంబర్‌ 29న గజెట్‌లో ప్రకటితమైన ఈ నియమావళి.. ఈ ఏడాది జూలై నుంచి చట్టబద్ధంగా అమల్లోకి వచ్చింది.

నిబంధనలు పాటించడంలో విఫలమైన సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం అవకాశం కల్పిస్తోంది. కఠినమైన సర్టిఫికేషన్‌ నిబంధనల కారణంగా సేంద్రియ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సేంద్రియ వ్యవసాయం, సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయి. సేంద్రియ మార్కెట్‌ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న అంశాలపై ‘సాగుబడి’ ఫోకస్‌..

మన దేశంలో రైతులు అనాదిగా సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయాన్ని ప్రభుత్వం వ్యాప్తిలోకి తెచ్చిన తర్వాత.. ఇప్పటికీ చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే అనుసరిస్తున్నారు. అయితే, వీరంతా అసంఘటితంగానే ఎవరికి వారు అనువంశిక సేంద్రియ సేద్యాన్ని ఒక జీవన విధానంగా, అవిచ్ఛిన్న వ్యవసాయక సంస్కృతిగా కొనసాగిస్తున్నారు. ఈ దశలో కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు చిన్న, సన్నకారు రైతులతో ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయాన్ని చేయిస్తున్నాయి.

సేంద్రియ వ్యవసాయ సర్టిఫికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి. రైతులే స్వచ్ఛందంగా తమకు తామే పరస్పరం తనిఖీలు చేసుకుంటూ.. సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇచ్చుకునే వ్యవస్థను ‘పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం (పీజీఎస్‌) ఆర్గానిక్‌ కౌన్సిల్‌’ పేరిట 2011లో ఏర్పాటు చేశాయి. ఇందులో ప్రభుత్వ ప్రమేయం లేదు. ఈ నేపథ్యంలో ఏటా 20–25% విస్తరిస్తున్న సేంద్రియ వ్యవసాయాన్ని క్రమబద్దీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుము బిగించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ‘పి.జి.ఎస్‌. ఇండియా’ సంస్థను ఏర్పాటు చేసింది.

దేశంలో హోల్‌సేల్‌/రిటైల్‌ మార్కెట్‌లో ప్యాక్‌ చేసి వ్యాపారులు అమ్మే సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు విధిగా ప్యాకింగ్, లేబెలింగ్‌ నిబంధనలు వర్తింపజేయడానికి రంగం సిద్ధమైంది. పిజిఎస్‌ ఇండియా అనేది కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖకు చెందిన జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం(ఎన్‌.సి.ఓ.ఎఫ్‌.), ఘజియాబాద్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సేంద్రియ ధ్రువీకరణ వ్యవస్థ.   వార్షిక టర్నోవర్‌ రూ. 12 లక్షల కన్నా తక్కువగా ఉండే రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు లేబిలింగ్‌ నిబంధనల నుంచి మినహాయింపు ఉంది. అయితే, అంతకుమించి వ్యాపారం చేసే రైతు కంపెనీలకు ప్యాకింగ్, లేబిలింగ్‌ ఖర్చు కిలోకు రూ. 10ల మేరకు పెరుగుతుందని చెబుతున్నారు. దీంతో, సేంద్రియ ఉత్పత్తుల ధరలు ఆ మేరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.  


పీజీఎస్‌ ఆర్గానిక్‌ కౌన్సిల్‌ అస్తిత్వానికి ముప్పు!
ప్రభుత్వ హయాంలో ‘పిజిఎస్‌ ఇండియా’ ఏర్పాటు కావడంతో.. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న ‘పీజిఎస్‌ ఆర్గానిక్‌ కౌన్సిల్‌’కు అస్తిత్వ సమస్య ఏర్పడింది. సేంద్రియ ఉత్పత్తులపై జూలై 1 నుంచి ‘జైవిక్‌ భారత్‌’ లోగోను విధిగా ముద్రించాలని, సేంద్రియ నాణ్యతా ప్రమాణాలకు చట్టబద్ధంగా కట్టుబడి ఉండాలని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌. ఎస్‌. ఎస్‌.ఎ.ఐ.) నిర్దేశించిన నేపథ్యంలో ‘పీజీఎస్‌ ఆర్గానిక్‌ కౌన్సిల్‌’ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనాదిగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రారంభించిన నెట్‌వర్క్‌.

డెక్కన్‌ డవలప్‌మెంట్‌ సొసైటీ(పస్తాపూర్, సంగారెడ్డి జిల్లా), టింబక్టు కలెక్టివ్‌(చెన్నేకొత్తపల్తి, అనంతపురం జిల్లా) వంటి సంస్థలు ‘పీజీఎస్‌ ఆర్గానిక్‌ కౌన్సిల్‌’ను ఏర్పాటు చేసి నిర్వహించడంలో కీలకపాత్రను పోషిస్తున్నాయి. ‘పీజీఎస్‌ ఇండియా’ను సమాంతర ప్రభుత్వ వ్యవస్థగా ఏర్పాటు చేసినప్పటికీ.. సేంద్రియ రైతుల హక్కులను పరిరక్షిస్తున్న ‘పీజిఎస్‌ ఆర్గానిక్‌ కౌన్సిల్‌’కున్న గుర్తింపు రద్దు చేయవద్దని డీడీఎస్‌ వంటి స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే, దీనిలో సభ్యులైన సేంద్రియ రైతులు కూడా ‘పిజిఎస్‌ ఇండియా’లో సభ్యులుగా చేరడం ద్వారా ఖర్చు లేకుండానే ప్రభుత్వ వ్యవస్థ పరిధిలోకి రావచ్చని ఎన్‌.సి.ఓ.ఎఫ్‌. చెబుతోంది.

రూ. 12 లక్షల టర్నోవర్‌ వరకు మినహాయింపు!
సేంద్రియ ఉత్పత్తులను దళారులు లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్మే సేంద్రియ/ప్రకృతి వ్యవసాయదారులకు, రూ. 12 లక్షల కన్నా తక్కువ టర్నోవర్‌ ఉండే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, రైతుల సహకార సంఘాలకు మాత్రం లేబిలింగ్‌ నిబంధనలు వర్తించవు. అయితే, వీరి వద్ద నుంచి కొని విక్రయించే రిటైల్‌ దుకాణదారులు, సూపర్‌ మార్కెట్‌ వ్యాపారులు(ఫుడ్‌ బిజినెస్‌ ఆపరేటర్లు) మాత్రం ఈ నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయడానికి, శిక్ష విధించడానికి కూడా అవకాశాలున్నాయి.

కాబట్టి, వీరి ఉత్పత్తులను రిటైల్‌ డీలర్ల నుంచి కొనుగోలు చేసే సేంద్రియ ఆహార వినియోగదారులపై భారం మరింత పడనుంది. సేంద్రియ ఆహారోత్పత్తులను దేశంలో అమ్మకానికి ‘పీజిఎస్‌ ఇండియా’ సర్టిఫికేషన్‌ పొందితే చాలు. స్థానిక వ్యవసాయ అధికారుల ద్వారా, రీజినల్‌ కౌన్సిళ్ల ద్వారా రైతులు పీజీఎస్‌ ఇండియా సర్టిఫికేషన్‌ పొందే వీలుంది. అయితే, విదేశాలకు ఎగుమతి అయ్యే సేంద్రియ ఆహారోత్పత్తులకు జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం (ఎన్‌.పి.ఓ.పి.) నిబంధనల ప్రకారం థర్డ్‌ పార్టీ సేంద్రియ ధ్రువీకరణ పత్రం పొందాల్సి ఉంటుంది.

ఇప్పుడు దేశీయంగా అమ్మే సేంద్రియ ఉత్పత్తులకు కూడా కంపెనీలు ఎన్‌.పి.ఓ.పి. ధ్రువీకరణ పొందవచ్చు. ఎన్‌.పి.ఓ.పి. ధ్రువీకరణ వ్యవస్థ 2001 నుంచి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అనుబంధంగా.. ‘అపెడా’ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. అయితే, ఈ సర్టిఫికేషన్‌ ప్రక్రియ క్లిష్టమైనది. అంతేకాక, అత్యంత ఖరీదైనది.   సేంద్రియ ఆహారోత్పత్తులను వినియోగదారులకు నేరుగా అమ్మే చిన్న, సన్నకారు రైతులు లేదా ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌.పి.ఓ.లు) ఎటువంటి ధ్రువీకరణనూ విధిగా పొందాలన్న నిబంధనేదీ లేదు.   

ఎన్‌.పి.ఓ.పి./ పి.జి.ఎస్‌. ఇండియా సర్టిఫికేషన్‌ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చి అనేక ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఐచ్ఛికంగానే ఉన్నాయి. అయితే, ‘జూలై నుంచి సేంద్రియ ఆహారోత్పత్తులను అమ్మే ఏ కంపెనీ అయినా ఇప్పుడు మేం ప్రకటించిన ప్రమాణాలను విధిగా పాటించకపోతే ప్రాసిక్యూట్‌ చేస్తాం’ అని ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. హెచ్చరిస్తోంది. కొత్త నియమావళి ప్రకారం.. మన దేశంలోని దుకాణాల్లో/ షాపింగ్‌ మాల్స్‌లో అమ్మకానికి పెట్టే సేంద్రియ ఉత్పత్తులేవైనా సరే విధిగా అందుబాటులో ఉన్న రెండు ధ్రువీకరణ వ్యవస్థల్లో (ఎన్‌.పి.ఓ.పి./ పి.జి.ఎస్‌. ఇండియా) ఏదో ఒక దాని నుంచి ధ్రువీకరణ పొందాల్సి ఉంటుంది.


దేశవ్యాప్తంగా సేంద్రియ ఆహారోత్పత్తి, అమ్మకం, పంపిణీలతోపాటు విదేశాల నుంచి సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుమతికి కూడా ఈ నియమావళి వర్తిస్తుంది. సేంద్రియ ఆహారోత్పత్తుల ప్యాకెట్లపై ఆయా ఉత్పత్తుల సేంద్రియ స్థితిగతులకు సంబంధించి పూర్తి వివరాలను పొందుపరచాలి. ఎన్‌.పి.ఓ.పి. ప్రకారం థర్డ్‌ పార్టీ సర్టిఫికేషన్‌ లోగో లేదా పి.జి.ఎస్‌. ఇండియా ధ్రువీకరణ లోగోలలో ఏదో ఒకదానితో పాటుగా.. ‘జైవిక్‌ భారత్‌’ లోగోను కూడా తప్పనిసరిగా ముద్రించాలని సరికొత్త నిబంధనావళి నిర్దేశిస్తోంది. అయితే, వివిధ వర్గాల విజ్ఞప్తి మేరకు జైవిక్‌ భారత్‌ లోగోను సేంద్రియ ఉత్పత్తుల ప్యాకెట్‌పై నాన్‌–డిటాచబుల్‌ స్టిక్కర్‌ రూపంలో విధిగా ముద్రించాలన్న నిబంధనకు వచ్చే సెప్టెంబర్‌ 30 వరకు సడలింపు ఇచ్చినట్టు ఎఫ్‌.ఎస్‌.ఎస్‌.ఎ.ఐ. తాజాగా ప్రకటించింది. జైవిక్‌ భారత్‌ లోగోకు సంబంధించిన పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు.

టర్నోవర్‌ పరిమితి పెంచాలి!
సేంద్రియ ఉత్పత్తుల మార్కెట్‌ క్రమబద్ధీ్దకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సహజాహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ తరఫున మేం స్వాగతిస్తున్నాం. చిన్న, సన్నకారు రైతులందరూ పీజీఎస్‌ ఇండియా సర్టిఫికేషన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేయాలి. రైతులు మరో 2, 3 ఏళ్ల పాటు గడువు అవసరం ఉంది. రైతు ఉత్పత్తిదారుల కంపెనీలకు రూ. 12 లక్షల టర్నోవర్‌ వరకు నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నారు. ఈ పరిమితిని రూ. కోట్లకు పెంచాలి. ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న రైతుల కంపెనీలకు ప్రభుత్వ తోడ్పాటు మరికొంత కాలం ప్రోత్సాహం అవసరం.

తాజా నిబంధనల వల్ల ప్యాకింగ్‌ ఖర్చు కిలోకు రూ. 10 మేరకు పెరుగుతుంది. దీని వల్ల చిన్న రిటైలర్లు దెబ్బతింటారు. ఒకే ఊళ్లో ఒకటో, రెండో దుకాణాలు పెట్టుకొని సేంద్రియ ఉత్పత్తులను అమ్మే రిటైలర్లకు రూ. 50 లక్షల టర్నోవర్‌ వరకు మినహాయింపు ఇవ్వాలి. లేబుల్‌ ముద్రించే బాధ్యత కేవలం సేంద్రియ రైతులకే పరిమితం చేయకూడదు. రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వాడే రైతుల ఉత్పత్తులపై కూడా ‘ఇవి రసాయనాలు వాడి పండించినవి’ అని లేబుల్‌ వేసేలా నిబంధనలు పెట్టాలి. అప్పుడు ప్రజల్లోనూ సేంద్రియ ఉత్పత్తులపై చైతన్యం ఇనుమడిస్తుంది.


– డా. జీ వీ రామాంజనేయులు
(90006 99702), సహజాహారం రైతు ఉత్పత్తిదారుల కంపెనీ, సికింద్రాబాద్‌


రైతుల హక్కును లాక్కోవద్దు!
జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయాన్ని జీవన విధానంగా అనుసరిస్తున్న చిన్న, సన్నకారు రైతులే కలసి దేశవ్యాప్తంగా 21 స్వచ్ఛంద సంస్థల నేతృత్వంలో ‘పీజీఎస్‌ ఆర్గానిక్‌ కౌన్సిల్‌’ను పదేళ్ల క్రితం ఏర్పాటు చేసుకొని స్వతంత్రంగా నిర్వహించుకుంటున్నారు. 14 రాష్ట్రాల్లో కనీసం 10 వేల మంది రైతులు సేంద్రియ సర్టిఫికేషన్‌ సదుపాయం ఖర్చులేకుండా పొందారు. ఇప్పుడు ప్రభుత్వం ‘పీజీఎస్‌ ఇండియా’ను ఏర్పాటు చేసి సర్టిఫికేషన్‌ హక్కును లాగేసుకోవటం అన్యాయం. ప్రజాస్వామిక స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను పెట్టుకోవచ్చు. మేం ప్రమాణాలు పాటించకపోతే కేసులు పెట్టి జైలులో పెట్టండి. అంతే కానీ సేంద్రియ సర్టిఫికేషన్‌ ఇచ్చే హక్కును మాత్రం పీజీఎస్‌ ఆర్గానిక్‌ కౌన్సిల్‌ నుంచి లాగేసుకోవటం సమంజసం కాదు. రైతుల హక్కును కాలరాయాలనుకోవడం తగదు.


– పీ వీ సతీష్, పీజీఎస్‌ ఆర్గానిక్‌ కౌన్సిల్‌ వ్యవస్థాపక సభ్యులు, డీడీఎస్, పస్తాపూర్‌
(వివరాలకు.. జయశ్రీ: 94402 66012)

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement