కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆహార, ఆదాయ కొరత సమస్యల నుంచి బయటపడటానికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పేద కుటుంబాలకు.. ఐరాసకు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) కొత్త బతుకు బాట చూపింది. అందుబాటులో ఉన్న స్థలాల్లో మెరుగైన పద్ధతుల్లో సేంద్రియ కూరగాయల సాగు నేర్పించింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో వ్యవసాయక కుటుంబాల్లో పుట్టి పొట్ట చేతపట్టుకొని నగరాలకొచ్చి స్థిరపడిన పేదలకు స్వీడన్ నిధులతో ఎఫ్.ఎ.ఓ. అర్బన్ గార్డెనింగ్‌లో ఇచ్చిన శిక్షణ వారికి కొత్త భరోసా ఇస్తోంది. దీంతో 2.2 కోట్ల జనాభాతో కాంక్రీటు నివాసాలతో కిటకిటలాడే ఢాకా నగరం అంతటా కోవిడ్ కష్టకాలంలో సేంద్రియ కూరగాయ తోటలు వెలిశాయి. ఇవి పేదలకు సేంద్రియ ఆహారాన్ని రుచి చూపించాయి!
‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేసుకోవాలో, ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో శిక్షణకు హాజరైన తర్వాత నాకు తెలిసింది’ అని మజెదా బేగం ఆనందంగా చెబుతోంది. ఢాకాలో నివాసం ఉండే పేద కుటుంబాల్లో ఆమె కుటుంబం ఒకటి. భర్త, ఐదుగురు పిల్లలతో కలసి రెక్కల కష్టం మీద మజెదా బేగం కుటుంబాన్ని లాక్కొస్తుంటుంది. కోవిడ్ విరుచుకుపడే సమయానికి టీ స్టాల్ నడుపుకుంటూ, చిన్నా చితకా వస్తువులు అమ్ముతూ, మురికివాడలో జీవనం సాగించేవారు. టీ స్టాల్ ప్రారంభించిన తర్వాత జీవన పరిస్థితులు అంతకుముందుకన్నా మెరుగుపడినప్పటికీ, వచ్చే ఆదాయం కుటుంబానికి పూర్తిగా సరిపోయేది కాదు. ఐదుగురు పిల్లలకు మరింత మెరుగైన పోషకాహారాన్ని అందించడం ఎలాగూ సాధ్యపడదు. అయితే, ఆహార వ్యవసాయ సంస్థ తోడ్పాటు వల్ల మజెదా ఏర్పాటు చేసుకున్న అర్బన్ కిచెన్ గార్డెన్ ఈ కొరత తీర్చింది.
అసంఘటిత రంగంలో ఆహార, ఆర్థిక అభద్రత మధ్య జీవనం సాగించే అనేక మందిలాగే మజెదా కుటుంబాన్ని కూడా కోవిడ్ దారుణంగా దెబ్బ తీసింది. లాక్‌డౌన్ వల్ల జీవనాధారమైన టీ స్టాల్‌ను మూసివేయవలసి వచ్చినప్పుడు మజెదా చేతిలో డబ్బేమీ లేదు. పనులు దొరకడం కష్టమైపోయింది. పైగా, ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఆ విధంగా ఏడుగురితో కూడిన కుటుంబానికి ఆమే జీవనాధారమైంది. అయినా, ఆమె నిరాశ పడకుండా ధైర్యంగా నిలబడింది. వ్యవసాయం అంటే ఆమెకు బాల్యం నుంచి ఉన్న ఇష్టం ఇప్పుడు ఉపయోగపడింది.
ఇళ్లకు దగ్గర్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో సేంద్రియ కూరగాయలు పండించటం, కుటుంబం తినగా మిగిలిన కూరగాయలను అమ్మి ఆదాయం పొందటంలో పేద మహిళలకు ఎఫ్.ఎ.ఓ. శిక్షణ ఇచ్చింది. దీంతో, ఢాకా నగరం మధ్యలో ఇళ్ల వెనుక స్థలాలు, ఖాళీ స్థలాల్లో, నదీ తీర ప్రాంతాల్లో ఆర్గానిక్ కిచెన్ గార్డెన్లు వెలిశాయి. మజెదా కూడా కూరగాయల సాగు చేపట్టింది. ‘సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలో, చీడపీడల్ని ఎలా అదుపులో ఉంచాలో అంతకుముందు నాకు తెలీదు. కానీ ఇప్పుడు వాటిని ఎలా ఉపయోగించాలో, నా కుటుంబం కోసం సేంద్రియ కూరగాయలను ఎలా పండించాలో ఇప్పుడు తెలిసింది. ఇప్పటికైనా రైతును కావడం గొప్ప అదృష్టం’ అంటోంది మజెదా సంతృప్తితో.
పురుగుమందులు వాడకుండా తమ కళ్ల ముందే ఆమె పండించే కూరగాయలకు స్థానికంగా చాలా డిమాండ్ ఉంది. కూరగాయల తోట ద్వారా తన కుటుంబ అవసరాలు పోను నెలకు 1500 టాకాల (సుమారు రూ. 2 వేలు) ఆదాయం పొందుతోంది మజెదా. ఐదుగురు బిడ్డలున్నా ఎన్నడూ లేనిది ఇప్పుడు ఒక బిడ్డను ఆమె బడికి పంపగలుగుతోంది. కష్టకాలంలో తన కుటుంబానికి అండగా నిలవగలిగినందుకు తనకు చాలా గర్వంగా ఉందని మజెదా పట్టలేని సంతోషంతో చెబుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం–2022 సందర్భంగా ఎఫ్.ఎ.ఓ. ఆమెను ‘ఫుడ్ హీరో’గా గుర్తించి గౌరవించింది అందుకే! (క్లిక్ చేయండి: నేచర్ అర్బైన్.. అతిపెద్ద రూఫ్‌టాప్ పొలం!)
– పంతంగి రాంబాబు
prambabu.35@gmail.com
Comments
Please login to add a commentAdd a comment