కేంద్ర ప్రభుత్వం రసాయనిక వ్యవసాయం నుంచి, ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టడం ఆహ్వానించదగిన పరిణామం. ఇది మాత్రమే చాలదు. కేవలం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (జడ్.బి.ఎన్.ఎఫ్.) ఒక్కదాని పైనే దృష్టి కేంద్రీక రించడంలో అర్థం లేదు. ప్రకృతి వ్యవసాయం అనేది జపాన్‌కు చెందిన డా. మసనోబు ఫుకుఓకా వాడుకలోకి తెచ్చిన విషయం. దీనితోపాటు ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయం, బయోడైనమిక్ వ్యవసాయం వంటి అనేక రసాయనికేతర వ్యవసాయ పద్ధతులు అమల్లో ఉన్నాయి. మొత్తంగా కలిపి సమగ్ర సేంద్రియ వ్యవసాయ పద్ధతులపై ప్రభుత్వం దృష్టి సారిస్తే మరింత మేలు జరుగుతుంది.
కేవలం దేశీ ఆవులు, కేవలం జీవామృతం చాలు అనలేం. మన దేశంలో 85% భూముల్లో వర్షాధారంగానే వ్యవసాయం జరుగుతోంది. రైతుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. అనంతపురం వంటి కరువు పీడిత జిల్లాలో మేం దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. మెట్ట భూములు జీవాన్ని కోల్పోయాయి. మట్టిని సారవంతం చేసుకుంటేనే ఈ భూముల్లో వ్యవసాయాన్ని చేపట్టగలం. భూసారం, నీటి పారుదల బాగా ఉండే ప్రాంతాల్లో జీవామృతం సరిపోవచ్చు. కానీ మెట్ట ప్రాంతాల్లో విధిగా కంపోస్టు తయారు చేసుకోవాలి. అంటే రైతుకు పశువులు కావాలి. దేశీ ఆవు మంచిదే. 2 వేల దేశీ ఆవులు రైతులకు పంచాం. అయితే, ఇతర ఆవులైతే పాలు ఎక్కువ ఇస్తాయి కాబట్టి రైతుకు ఆసరాగా కూడా ఉంటుంది. పాలు తక్కువ ఇచ్చే ఆవులను చిన్న రైతు పెంచుకోవటం భారమే. వారికి ప్రభుత్వం అండగా ఉండాలి.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రభుత్వం ప్రోత్సహించడం మంచిదే. అయితే, జడ్.బి.ఎన్.ఎఫ్.కు మాత్రమే పరిమితం కావటం అరకొర ప్రయత్నమే అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేచర్ బేస్డ్ వ్యవసాయ పద్ధతుల్లో ఉన్న అనుభవాలను సైతం ఇముడ్చుకునే విధంగా ప్రభుత్వ విధానం సమగ్రంగా ఉంటే బాగుంటుంది. (చదవండి: ప్రకృతి సేద్యమే వెలుగు బాట)
- సి.కె. గంగూలి (బబ్లూ)
సహ వ్యవస్థాపకులు, టింబక్టు కలెక్టివ్, చెన్నేకొత్తపల్లి
Comments
Please login to add a commentAdd a comment