ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్
సాక్షి, రేపల్లె (గుంటూరు) : నీకింత.. నాకంత.. అంటూ అభివృద్ధి పనుల మాటున ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పంచుకున్నారు. అడిగేది, అడ్డుకునేది ఎవరు అంటూ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అధికారులు, కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు పూర్తిచేసి నిధులు మిగుల్చుకున్నారు. ఆ తరువాత వాటాలేసుకుని ఆ నిధులను స్వాహా చేశారు. నిర్మించిన నెలల వ్యవధిలోనే రోడ్లు, డ్రెయిన్లు ధ్వంసం కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
అవినీతి గుట్టును రట్టుచేశారు. పట్టణంలో గత ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సుమారు రూ.22 కోట్లతో సీసీ రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. నెలలు గడవకముందే రోడ్లు గుంతల మయంగా మారడం, డ్రెయిన్లు కుప్పకూలడంతో పట్టణ ప్రజలు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్ అధికారులు విచారణలో అవినీతి గుట్టు రట్టుయింది.
పనుల నాణ్యతను తనిఖీచేసి నిర్ధారించాల్సిన థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అక్రమార్కులకు అండగా నిలిచారని నిగ్గుతేల్చారు.పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థను ఉన్నతాధికారులు బ్లాక్ లిస్ట్‌లో, పెట్టి సంబంధిత మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులపై చర్యలకు సిఫారసు చేసినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
ఎమ్మెల్యే అనగాని ఆధ్వర్యంలోనే..
రేపల్లె పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లేకపోవడం వెనుక స్థానిక ఎమ్మెల్యే అనగాని ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన అండతో పనులను చేపట్టిన కాంట్రాక్టు సంస్థ పనులను నాసిరకంగా పూర్తిచేసింది. నిర్మించి నెలలు కూడా గడవకముందే రోడ్లు గోతులమయంగా మారడం, డ్రెయిన్లు కుప్పకూలడం ఈ పనుల్లో అవి నీతిని పట్టిచూపుతున్నాయి. ఎమ్మెల్యే, కాంట్రాక్టర్, అధికారులు నిధులను పంచుకుని పనులు నాసిరకంగా చేయడం వల్లే రోడ్లు ధ్వంసం అయ్యాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే అనగాని పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యమని పట్టణ ప్రజలు విర్శి స్తున్నారు.
కల్వర్టుల్లో నిధుల స్వాహా
నిజాంపట్నం మండలం అడవులదీవి – కొత్తపాలెం రహదారి 5 కిలో మీటర్లు, మంత్రిపాలెం – అడవులదీవి రహదారి 3 కిలోమీటర్ల మేర విస్తరించారు. ఈ పనులను రూ.10 కోట్లతో నిర్వహించారు. అడవులదీవి – కొత్తపాలెం రోడ్డు నిర్మాణంలో తూములలో 8 కల్వర్టులు, ఒక చోట శ్లాబ్ కల్వర్టు నిర్మించాల్సి ఉంది. అయితే శ్లాబ్ కల్వర్టు స్థానంలో తూములతో సరిపెట్టారు.
మిగిలిన కల్వర్టుల నిర్మాణంలో నాణ్యతను గాలికి వదిలేశారు. రోడ్డు మధ్యలో కొత్త తూములు వేసి కల్వర్టులు నిర్మించాలన్నది నిబంధన. అయితే పాత తూములనే వినియోగించి కల్వర్టుల నిర్మాణం పూర్తిచేసి, నిధులు మిగుల్చుకుని పంచుకున్నారు. ఈ రోడ్ల విస్తరణ పనుల్లో స్థానిక ప్రజల వినతులను సైతం పట్టించుకోలేదు.
అధికార వర్గాల్లో గుబులు
2014 ఎన్నికల అనంతరం టీడీపీ అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కాంట్రాక్టర్ల నుంచి భారీ స్థాయిలో కమీషన్లు దండుకుని అభివృద్ధి పనుల్లో తీవ్ర అవినీతికి తావిచ్చారు. అదేమని కాంట్రాక్టర్లను ప్రశ్నించే పరిస్థితి అధికారులకు లేకుండా వారిపై ఒత్తిడితెచ్చారు. ఐదేళ్లు పూర్తికావడంతో ఉన్నతాధికారులు విచారణ నిర్వహిస్తూ తమపై చర్యలకు సిఫారసులు చేస్తుంటే తనకు సంబంధం లేదన్నట్లుగా ఎమ్మెల్యే అనగాని వ్యవహరిస్తున్నాడని పలువురు అధికారులు వాపోతున్నారు.
నిర్మాణంలోనే కూలిన శ్లాబ్
గూడవల్లి ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణ సమయంలో కుప్పకూలిన శ్లాబ్
చెరుకుపల్లి–నగరం, నగరం–రేపల్లె అభివృద్ధి పనుల్లోనూ అవినీతి పొంగిపొర్లింది. ఈ రోడ్లు కూడా నిర్మించిన నెలల వ్యవధిలోనే గోతులమయంగా మారాయి. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌కు బినామీగా వ్యవహరిస్తున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు కాంట్రాక్టర్ అవతారమెత్తి ఈ రోడ్ల నిర్మాణ పనులు దక్కించుకుని నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. గూడవల్లి ఐటీఐ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను దక్కించుకున్న మండల పరిషత్ ఉపాధ్యక్షుడు శ్లాబ్ వేసిన గంటల వ్యవధిలో కూలిపోంది. దీనిని బట్టే నాణ్యతా ప్రమాణాలు ఏ స్థాయిలో పాటించారో అర్థంచేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment