న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆపరేట్లను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అలాగే కాల్ అంతరాయాలు, అవుటేజ్ డేటాను రాష్ట్ర స్థాయిలో కూడా వెల్లడించాలని సూచించింది. ప్రస్తుతం లైసెన్స్ ఏరియా ప్రాతిపదికగా ఈ వివరాలను ఆపరేటర్లు ఇస్తున్నారు. టెల్కోలతో సమావేశం సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా ఈ విషయాలు తెలిపారు. అనధికారిక టెలీమార్కెటర్లు 10 అంకెల మొబైల్ నంబర్లతో పంపించే అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, సందేశాలను గుర్తించేందుకు .. బ్లాక్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాధనాన్ని ఉపయోగించాలని టెల్కోలకు సూచించినట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ సాధనం వచ్చే రెండు నెలల్లో మొత్తం పరిశ్రమ అమలు చేసే అవకాశం ఉంది. దీనితో అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, మెసేజీల బెడద తగ్గుతుందని వాఘేలా చెప్పారు. రాబోయే రోజుల్లో నాణ్యతా ప్రమాణాల నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి అనవసర హెడర్లు, మెసేజీ టెంప్లేట్లను తొలగించేలా చర్యలు తీసుకునేందుకు ఆయా రంగాల నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ శాఖలు మొదలైన వాటిని కోరనున్నట్లు వాఘేలా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment