interruptions
-
సర్వీసుల నాణ్యత తక్షణం మెరుగుపర్చండి
న్యూఢిల్లీ: టెలికం సేవల నాణ్యతను మెరుగుపర్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆపరేట్లను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ ఆదేశించింది. అలాగే కాల్ అంతరాయాలు, అవుటేజ్ డేటాను రాష్ట్ర స్థాయిలో కూడా వెల్లడించాలని సూచించింది. ప్రస్తుతం లైసెన్స్ ఏరియా ప్రాతిపదికగా ఈ వివరాలను ఆపరేటర్లు ఇస్తున్నారు. టెల్కోలతో సమావేశం సందర్భంగా ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా ఈ విషయాలు తెలిపారు. అనధికారిక టెలీమార్కెటర్లు 10 అంకెల మొబైల్ నంబర్లతో పంపించే అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, సందేశాలను గుర్తించేందుకు .. బ్లాక్ చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సాధనాన్ని ఉపయోగించాలని టెల్కోలకు సూచించినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్న ఈ సాధనం వచ్చే రెండు నెలల్లో మొత్తం పరిశ్రమ అమలు చేసే అవకాశం ఉంది. దీనితో అవాంఛిత ప్రమోషనల్ కాల్స్, మెసేజీల బెడద తగ్గుతుందని వాఘేలా చెప్పారు. రాబోయే రోజుల్లో నాణ్యతా ప్రమాణాల నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు వివరించారు. అలాగే బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి అనవసర హెడర్లు, మెసేజీ టెంప్లేట్లను తొలగించేలా చర్యలు తీసుకునేందుకు ఆయా రంగాల నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ శాఖలు మొదలైన వాటిని కోరనున్నట్లు వాఘేలా చెప్పారు. -
కుమ్మక్కు ధోరణులతో పెను సవాళ్లు
న్యూఢిల్లీ: ధరల పెరుగుదల, సరఫరాపరమైన అంతరాయాలకు దారి తీసే గుత్తాధిపత్య విధానాలను అరికట్టడంపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కంపెనీలు కుమ్మక్కయ్యే ధోరణులను ఎదుర్కొనడం పెను సవాలుగా ఉండనుందని ఆమె తెలిపారు. దేశీయంగా డిమాండ్‌ను తీర్చడంతో పాటు ఎగుమతులు కూడా చేసేంత స్థాయిలో భారత్‌కు పుష్కలమైన సామర్థ్యాలు ఉన్నప్పటికీ ముడి వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని కొంత ఆందోళన వ్యక్తమవుతోందంటూ మంత్రి చెప్పారు. కరోనా మహమ్మారి, తూర్పు యూరప్‌లో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా కమోడిటీలు, ముడి వస్తువుల కొరత నెలకొందని, సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 13వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. ‘వివిధ దశల్లో అవాంతరాలు వస్తున్నాయి. ఇవి నిజంగానే కోవిడ్ లేదా యుద్ధం వల్ల తలెత్తినవా అనే అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. గుత్తాధిపత్యం లేదా రెండు సంస్థల ఆధిపత్యం వల్ల ధరలు పెరిగిపోవడం, సరఫరాపరమైన అంతరాయాలు కలగకుండా చూడాలి‘ అని మంత్రి సూచించారు. గత రెండేళ్లుగా సీసీఐ సవాళ్లను మరింత సానుకూలంగా అధిగమిస్తోందని ఆమె కితాబిచ్చారు. ‘సవాళ్లు చాలా సంక్లిష్టంగా మారుతున్నాయి. కాబట్టి, ఇలాంటి వాటిని పరిష్కరించడంలో వెనుకబడి పోకుండా సీసీఐ తన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకుంటూ ఉండాలి‘ అని పేర్కొన్నారు. -
మొరాయించిన గూగుల్ సేవలు
న్యూఢిల్లీ: జీమెయిల్‌తో సహా ఇతర గూగుల్ సేవల్లో సోమవారం సాయంత్రం 5.17 గంటలకు అంతరాయం ఏర్పడింది. గూగుల్ డాక్స్, క్యాలెండర్, డ్రైవ్, మీట్ వంటి వాటిలోకి లాగిన్ అయినవారికి స్క్రీన్‌పై టెంపరరీ ఎర్రర్ అంటూ మెసేజ్ దర్శనమిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. దాదాపు 45 నిమిషాలపాటు గూగుల్ సేవలు నిలిచిపోయాయి. ‘ఇంటర్నల్ స్టోరేజీ కోటా’లో సమస్యల వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు గూగుల్ సంస్థ అధికార ప్రతినిధి ప్రకటించారు. సాయంత్రం 6.02 గంటలకల్లా సేవలను పునరుద్ధరించగలిగామని తెలిపారు. అంతరాయం వల్ల ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల మంది ఇబ్బంది పడినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. గూగుల్ సేవలు నిలిచిపోవడం పట్ల సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. జీమెయిల్ డౌన్, యూట్యూబ్ డౌన్ అంటూ పలువురు నెటిజన్లు ట్విట్టర్లో షేర్ చేశారు. మరికొందరు ‘ఇది యుగాంతం’ అంటూ సరదాగా కామెంట్లు చేయడం విశేషం. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ షాక్
న్యూఢిల్లీ/ముంబై: గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా, కొత్త డిజిటల్ కార్యకలాపాలేమీ ప్రకటించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గురువారం అసాధారణ ఆదేశాలు ఇచ్చింది. సాంకేతిక సమస్యలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై బ్యాంకు బోర్డు దృష్టి పెట్టాలని సూచించింది. ‘డిజిటల్ 2.0 (ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది) కింద కొత్త డిజిటల్ వ్యాపార లావాదేవీలు, ఇతరత్రా ఐటీ యాప్‌ల ద్వారా ప్రతిపాదిత లావాదేవీలు, కొత్త క్రెడిట్ కార్డుల జారీ వంటివన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది. బ్యాంక్ నూతన సీఈవోగా ఇటీవలే (అక్టోబర్ చివర్లో) పగ్గాలు చేపట్టిన శశిధర్ జగదీశన్‌కు ఈ పరిస్థితిని చక్కదిద్దడం తొలి సవాలు కానుంది. దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అతి పెద్ద సంస్థ. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం 1.49 కోట్ల మంది క్రెడిట్ కార్డు యూజర్లు, 3.38 కోట్ల డెబిట్ కార్డు యూజర్లు ఉన్నారు. ప్రస్తుత యూజర్లకు యథాప్రకారం సర్వీసులు కొనసాగుతాయని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ ఆదేశాలు ఎప్పటివరకూ అమల్లో ఉంటాయన్న వివరాలు వెల్లడి కాలేదు. సాధారణంగా బ్యాంకుల సేవా లోపాలకు సంబంధించి జరిమానాల వంటి వాటితో సరిపెట్టే ఆర్బీఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం అసాధారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం.. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్ కొత్త సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్‌ను మెరుగుపర్చుకునేందుకు బయట నిపుణుల సహా యం కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఆదేశాల నేపథ్యంలో కొత్తగా మరిన్ని మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టడంలో జాప్యం జరగవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండేళ్ల నుంచీ .. 2018 డిసెంబర్లో బ్యాంక్ కొత్తగా ఆవిష్కరించిన మొబైల్ యాప్ కొద్ది గంటల్లోనే క్రాష్ అయ్యింది. భారీ ట్రాఫిక్‌ను సర్వర్లు హ్యాండిల్ చేయలేకపోవడం ఇందుకు కారణం. ఏడాది తర్వాత సరిగ్గా జీతాల సమయంలో ఆన్లైన్ సేవలన్నింటిలోనూ అంతరాయం కలిగింది. దీంతో ఈ సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఇక తాజాగా నవంబర్ 21న మరోసారి ఇలాంటి సమస్యలే తలెత్తాయి. తమ ప్రాథమిక డేటా సెంటర్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలే ఇందుకు కారణమంటూ సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ.. బ్యాంక్‌పై కస్టమర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ తాజా చర్యలు ప్రకటించింది. కొన్నాళ్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆన్లైన్ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో పాటు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సహా పలు బ్యాంకులు ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదుర్కొంటున్నాయి. దీనితో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,377 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 16,056 కోట్లు కరిగిపోయి రూ. 7,58,287 కోట్లకు తగ్గింది. బీఎస్ఈలో 7.36 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.89 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఎస్బీఐ యోనో యాప్ డౌన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఆన్లైన్ సర్వీసుల్లో కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తరహాలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. సిస్టమ్ వైఫల్యం కారణంగా తమ యోనో మొబైల్ యాప్ సర్వీసుల్లో అంతరాయం కలిగినట్లు ఎస్బీఐ గురువారం వెల్లడించింది. సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈలోగా లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్‌ను వినియోగించాలని కస్టమర్లను కోరింది. అటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) డిజిటల్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడింది. ఇటీవల విలీనం చేసుకున్న బ్యాంకుల ఐటీ ఇన్ఫ్రాను అనుసంధానం చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి. -
వైఎస్ జగన్ ప్రసంగానికి 14సార్లు అంతరాయం!
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బడ్జెట్ ప్రసంగానికి అధికారపక్ష మంత్రులు, సభ్యులు 14 సార్లు అంతరాయం కలిగించారు. కేటాయించిన సమయం కంటే ఎక్కువ సమయాన్ని వాడుకున్నారని, తాము పదేపదే చెప్పినా ప్రసంగాన్ని ముగించకపోవడం మీదే తప్పని స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం కూడా ఒకసారి ప్రస్తావించారు. కానీ, వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఏకంగా 52 నిమిషాల పాటు మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఆయనకు పదే పదే అడ్డు తగులుతూ వచ్చారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించినప్పటి నుంచి మధ్యాహ్నం ఆయన ప్రసంగాన్ని అర్ధంతరంగా ఆపేసేవరకు ప్రతిసారీ అడ్డం పడుతూనే ఉన్నారు. ఆ వివరాలు ఇవీ.. యనమల రామకృష్ణుడు ప్రారంభంలోనే 8 నిమిషాలపాటు, కె.అచ్చెన్నాయుడు 11.38గంటలకు 6 నిమిషాలు, మళ్లీ యనమల 11.50కి 3 నిమిషాలు, కాలువ శ్రీనివాసులు 12.10కి 4 నిమిషాలు, డి.నరేంద్రకుమార్ 12.05 సమయంలో 4 నిమిషాలు, కె.ఇ.కృష్ణమూర్తి 12.20 గంటలకు 3 నిమిషాలు, డి.నరేంద్రకుమార్ 12.25 సమయంలో 4 నిమిషాలు, యనమల మళ్లీ 12.31 గంటలకు 2 నిమిషాలు, పి.పుల్లారావు 12.38 సమయంలో 3 నిమిషాలు, రావెల కిశోర్‌బాబు 12.49 గంటలకు 5 నిమిషాలు, కె.కళావెంకట్రావు 12.59 సమయంలో 2 నిమిషాలు, కె.అచ్చెన్నాయుడు ఒంటిగంటకు 3 నిమిషాలు, దేవినేని ఉమా మహేశ్వరరావు 1.13 గంటలకు 3 నిమిషాలు, యనమల 1.16 సమయంలో 2 నిమిషాలు.. ఇలా మొత్తం 52 నిమిషాలు అడ్డం తగిలారు.