న్యూఢిల్లీ/ముంబై: గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిజిటల్ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయకుండా, కొత్త డిజిటల్ కార్యకలాపాలేమీ ప్రకటించకుండా తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ గురువారం అసాధారణ ఆదేశాలు ఇచ్చింది. సాంకేతిక సమస్యలను పరిశీలించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడంపై బ్యాంకు బోర్డు దృష్టి పెట్టాలని సూచించింది. ‘డిజిటల్ 2.0 (ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది) కింద కొత్త డిజిటల్ వ్యాపార లావాదేవీలు, ఇతరత్రా ఐటీ యాప్‌ల ద్వారా ప్రతిపాదిత లావాదేవీలు, కొత్త క్రెడిట్ కార్డుల జారీ వంటివన్నీ తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్‌బీఐ సూచించింది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది.
బ్యాంక్ నూతన సీఈవోగా ఇటీవలే (అక్టోబర్ చివర్లో) పగ్గాలు చేపట్టిన శశిధర్ జగదీశన్‌కు ఈ పరిస్థితిని చక్కదిద్దడం తొలి సవాలు కానుంది. దేశీయంగా క్రెడిట్ కార్డుల జారీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అతి పెద్ద సంస్థ. ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం 1.49 కోట్ల మంది క్రెడిట్ కార్డు యూజర్లు, 3.38 కోట్ల డెబిట్ కార్డు యూజర్లు ఉన్నారు. ప్రస్తుత యూజర్లకు యథాప్రకారం సర్వీసులు కొనసాగుతాయని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ ఆదేశాలు ఎప్పటివరకూ అమల్లో ఉంటాయన్న వివరాలు వెల్లడి కాలేదు. సాధారణంగా బ్యాంకుల సేవా లోపాలకు సంబంధించి జరిమానాల వంటి వాటితో సరిపెట్టే ఆర్‌బీఐ ఇలాంటి చర్యలు తీసుకోవడం అసాధారణమని పరిశ్రమవర్గాలు తెలిపాయి.
అసౌకర్యానికి చింతిస్తున్నాం..
కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్ కొత్త సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్‌ను మెరుగుపర్చుకునేందుకు బయట నిపుణుల సహా యం కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆర్‌బీఐ ఆదేశాల నేపథ్యంలో కొత్తగా మరిన్ని మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ప్రవేశపెట్టడంలో జాప్యం జరగవచ్చని ఆయన పేర్కొన్నారు.
రెండేళ్ల నుంచీ ..
2018 డిసెంబర్‌లో బ్యాంక్ కొత్తగా ఆవిష్కరించిన మొబైల్ యాప్ కొద్ది గంటల్లోనే క్రాష్ అయ్యింది. భారీ ట్రాఫిక్‌ను సర్వర్లు హ్యాండిల్ చేయలేకపోవడం ఇందుకు కారణం. ఏడాది తర్వాత సరిగ్గా జీతాల సమయంలో ఆన్‌లైన్ సేవలన్నింటిలోనూ అంతరాయం కలిగింది. దీంతో ఈ సమస్యలపై దృష్టి సారిస్తున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఇక తాజాగా నవంబర్ 21న మరోసారి ఇలాంటి సమస్యలే తలెత్తాయి. తమ ప్రాథమిక డేటా సెంటర్‌లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలే ఇందుకు కారణమంటూ సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ.. బ్యాంక్‌పై కస్టమర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఆర్‌బీఐ తాజా చర్యలు ప్రకటించింది. కొన్నాళ్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆన్‌లైన్ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదుర్కొంటున్నాయి. దీనితో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
గురువారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు 2 శాతం క్షీణించి రూ. 1,377 వద్ద క్లోజయ్యింది. కంపెనీ మార్కెట్ వేల్యుయేషన్ సుమారు రూ. 16,056 కోట్లు కరిగిపోయి రూ. 7,58,287 కోట్లకు తగ్గింది. బీఎస్‌ఈలో 7.36 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 1.89 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి.
ఎస్‌బీఐ యోనో యాప్ డౌన్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఆన్‌లైన్ సర్వీసుల్లో కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తరహాలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. సిస్టమ్ వైఫల్యం కారణంగా తమ యోనో మొబైల్ యాప్ సర్వీసుల్లో అంతరాయం కలిగినట్లు ఎస్‌బీఐ గురువారం వెల్లడించింది. సేవలను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఈలోగా లావాదేవీల కోసం నెట్ బ్యాంకింగ్, యోనో లైట్ యాప్‌ను వినియోగించాలని కస్టమర్లను కోరింది. అటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) డిజిటల్ సేవల్లో కూడా అంతరాయం ఏర్పడింది. ఇటీవల విలీనం చేసుకున్న బ్యాంకుల ఐటీ ఇన్‌ఫ్రాను అనుసంధానం చేసే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని బ్యాంకు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment