మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా హోటళ్లలో ఆహార నాణ్యతాప్రమాణాలకు యజమానులు తిలోదకాలిస్తున్నారు. ఆహార నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లోపం, మొక్కుబడి తనిఖీలతో ప్రజలు ఆస్పత్రి పాలు కావాల్సి వస్తోంది. జిల్లాలో 5వేల వరకు ఆహార పదార్థాలు అందించే హోటళ్లు, మిఠాయి దుకాణాలు, రెస్టారెంట్లు, చాట్ కేంద్రాలు, బేకరీలు ఉన్నాయి. వీటన్నింటినీ తనిఖీ చేయాలంటే ఐదుగురు ఆహార నియంత్రణ అధికారులు ఉండాలి.
కానీ ప్రస్తుతం జిల్లాలో జిల్లా అధికారితోపాటు ఇద్దరు ఆహార నియంత్రణ అధికారులు, ఇద్దరు అటెండర్లు ఉన్నారు. సిబ్బంది కొరతను ఇటీవల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పట్లో సమస్య తీరేలా కనిపించడం లేదు. జిల్లా కార్యాలయంలో క్లర్క్, జూనియర్, సీనియర్ అసిస్టెంట్ల ఊసే లేదు. ఇక శాంపిళ్ల సేకరణ, కేసుల నమోదు ఏ మేరకు పకడ్బందీగా ఉంటాయో చెప్పనవసరం లేదు. 2012లో 50 కేసులు నమోదు కాగా, 2013లో ఇప్పటివరకు 20 కేసులు నమోదయ్యాయి. నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు.
హెచ్చరికలతో సరి..
హోటళ్లు, బేకరీలు ఇతర వాటిపై ఆహార నియంత్రణ అధికారులు తనిఖీలు చేస్తున్నా సంబంధిత యాజమాన్యాల తీరులో మార్పు రావడం లేదు. అపరిశుభ్రత వాతావరణంలో తయారు చేసి ఎలాంటి నాణ్యతాప్రమాణాలు లేని ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. తనిఖీల్లో భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చినా పూర్తి స్థాయిలో ఆయా ఆహార సంస్థలపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. హెచ్చరికలు చేస్తూ సరిపెడుతున్నారు. సేకరించిన ఆహార నమూనాలను ల్యాబ్‌లకు పంపించగా.. శుచిగా లేవని, ప్రజలకు వడ్డించడానికి పనికిరావని నివేదిక వచ్చినా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. చిన్న పాటి ఆహార విక్రయ వ్యాపారం చేసుకునే వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆహార పరిరక్షణ, ప్రమాణాల చట్టం-2006 ప్రకారం అధికారుల వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇవీ ప్రమాణాలు..
ఆహార పదార్థాలను సరఫరా చేసే సంస్థలో నాణ్యత, పరిశుభ్రత పాటించేందుకు కొన్ని ప్రమాణాలు పాటించాలని ఆహార నియంత్రణ చట్టం చెబుతోంది.
వంట కోసం ఉపయోగించే నూనెను ఒకసారి కంటే ఎక్కవ వాడరాదు.
వండిన ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోను ఫ్రిజ్‌లో నిల్వ చేయరాదు.
తాగునీటికి తప్పనిసరిగా ఫిల్టర్ నీరు, మినరల్ వాటర్ కానీ వాడాలి.
కుళ్లిన పదార్థాలను ఏ పరిస్థితుల్లోనూ వినియోగదారుడికి సరఫరా చేయరాదు.
కోడి మాంసం, మేక మాంసం ఒకే చోట పెట్టరాదు.
పదార్థాలను సరైన వాతావరణంలో పెట్టాలి.
వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
మురుగునీటి వ్యవస్థ చుట్టుపక్కల ఉండరాదు.
నిర్వాహకులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా చూడడానికి ఆహార నియంత్రణ అధికారులు సహాయ వైద్య అధికారులతో తనిఖీలు చేయాల్సి ఉంటుంది. వాస్తవాలను పరిశీలిస్తే ఇలాంటి నిబంధనలు పాటించే హోటళ్లు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. రోజూ పదార్థాలను రిఫ్రిజిరేటర్లలో నిల్వ ఉంచి యథేచ్ఛగా వడ్డిస్తున్నా అడిగే నాథుడూ లేడు.. పట్టించుకునే వారే లేరు.
ఆహారంలో నాణ్యతకు తిలోదకాలు !
Published Sat, Nov 16 2013 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 AM
Advertisement