పదే పదే కాగుతున్న నూనెతో ఆరోగ్యానికి చేటు
ప్రజారోగ్యాన్ని పట్టించుకోని హోటళ్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు
కల్తీ నూనెతో ఆస్పత్రుల పాలవుతున్న జనం
చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు
పుట్టపర్తికి చెందిన 30 ఏళ్ల మహిళ తిన్న ఆహారం జీర్ణం కాలేదని ఆస్పత్రిలో చేరింది. కడుపు నొప్పితో పాటు ఆకలి మందగించినట్లు డాక్టర్లకు తెలిపింది. పలు వైద్య పరీక్షల అనంతరం కల్తీ ఆహారం తినడం కారణంగానే ఆరోగ్య సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్తీ నూనె, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలని డాక్టర్లు సూచించారని ఆమె తెలిపింది.
పెనుకొండలో ఓ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఐదు కుటుంబాలు విందులో పాల్గొనేందుకు హోటల్‌కు వెళ్లాయి. వాళ్లందరూ రకరకాల వంటకాలు తిన్నారు. చివరగా ఇంటికి చేరే సమయంలో దారిలో కనిపించిన స్ట్రీట్ ఫుడ్ కూడా రుచి చూశారు. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు. కానీ ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫుడ్ పాయిజనింగ్‌గా తేల్చారు.
సాక్షి, పుట్టపర్తి : నిత్యావసర సరుకుల ధరలతో పాటు వంటనూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ వాడకం మాత్రం తగ్గడంలేదు. మరోవైపు హోటళ్లలో తిండి ధరలు ఉన్నఫలంగా పెంచడం కుదరదు. దీంతో చాలా మంది కల్తీనూనె వాడటం మొదలుపెట్టారు. దీనికితోడు పొయ్యిపై నూనెను పదే పదే మరిగించేస్తున్నారు.
ఫలితంగా తాజా నూనె అయినప్పటికీ మరిగించడంతో రుచి మారుతోంది. ఆ నూనెలో తయారు చేసిన పదార్థాలను తింటున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో తరచూ వెలుగు చూస్తున్నాయి. రోడ్డు పక్కన తయారు చేసే ఆహార పదార్థాలు దుమ్ము, ధూళి రేణువులు చేరి అనారోగ్యానికి గురి చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
పట్టణాల్లోనే అధికం..
పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే హోటళ్లు అధికం. అందులో రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు ప్రతి వంద మీటర్లకు ఒకటి కనిపిస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి పలు పనులపై వచ్చే వాళ్లు గత్యంతరం లేక ఇక్కడే తినాల్సి వస్తోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలోని హోటళ్లలో ఎక్కువ మంది ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే నూనెను పదే పదే మరిగించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.
ఉదయం నుంచి రాత్రి దాకా..
మద్యం దుకాణాల సమీపంలోని చికెన్ కబాబ్ సెంటర్లలో ఎక్కువసార్లు మరిగించిన నూనెలో చేసిన పదార్థాలను తినడం కారణంగా మందుబాబులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మద్యం కంటే కల్తీ నూనె పదార్థాలు ఎక్కువగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయనే విషయం మత్తులో గమనించలేకపోతున్నారు. మటన్, చికెన్, కోడిగుడ్ల వంటకాల్లో ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు తెలిసింది.
ప్రైవేటు మద్యం దుకాణాలు రావడంతో ఒక్కో దుకాణం వద్ద పదుల కొద్దీ చికెన్ కబాబ్ సెంటర్లు వెలిశాయి. ఒకసారి పొయ్యి పెట్టిన నూనె సాయంత్రం వరకూ కాగుతూనే ఉంటోంది. ఫలితంగా ఆ ఆహారాన్ని తీసుకునే వారు ఫుడ్ పాయిజన్‌తో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
అటకెక్కిన తనిఖీలు..
పదే పదే మరిగించిన నూనెలో వంటకాలు చేయడం.. ఆ పదార్థాలు తిన్న వారు అనారోగ్యం బారిన పడటం.. సైకిల్ చక్రంలా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు లేకపోవడంతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తే కానీ తనిఖీలు చేయరని అంటున్నారు. మరి కొన్ని చోట్ల ఆర్నెల్లకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదని రికార్డులు చెబుతున్నాయి. పండుగ సమయంలో మాత్రమే అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు.
నూనె డబ్బాల్లో ఎంతమేరకు కల్తీ ఉందనే విషయం ఎవరూ బయటపెట్టడంలేదు. కబేళాలకు తరలించే పశువుల ఎముకల పిండి కూడా నూనెలో కలిపేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కల్తీ అని తేలితే కఠిన చర్యలు మా సిబ్బంది ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి.
అయితే ఎక్కడ కల్తీ జరుగుతోందో పక్కా సమాచారం ఇస్తే.. తనిఖీ ముమ్మరం చేస్తాం. శ్యాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపిస్తాం. కల్తీ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవు. ఇప్పటికే చాలా చోట్ల తనిఖీలు చేశాం. కల్తీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాం. ప్రజలు బయట ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. – రామచంద్ర, ఫుడ్ ఇన్‌స్పెక్టర్, పుట్టపర్తి
ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి
ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారంతోనే ఆరోగ్యం బాగుంటుంది. బయట ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. మసాలా, నూనె వంటలు తినడం తగ్గించాలి. నూనె వంటకాలతో కొవ్వు శాతం పెరగడంతో పాటు కల్తీ నూనె వంటకాలు తింటే వివిధ రోగాలు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ మంజువాణి, డీఎంహెచ్‌ఓ
రోగాలు ఇలా..
ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి.
నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిల్వ ద్వారా విష పదార్థాలు కూడా ఏర్పడతాయి. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment