Street food vendors
-
పొయ్యిపై సల.. సల..ఆరోగ్యాలు విల విల!
పుట్టపర్తికి చెందిన 30 ఏళ్ల మహిళ తిన్న ఆహారం జీర్ణం కాలేదని ఆస్పత్రిలో చేరింది. కడుపు నొప్పితో పాటు ఆకలి మందగించినట్లు డాక్టర్లకు తెలిపింది. పలు వైద్య పరీక్షల అనంతరం కల్తీ ఆహారం తినడం కారణంగానే ఆరోగ్య సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్తీ నూనె, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలని డాక్టర్లు సూచించారని ఆమె తెలిపింది.పెనుకొండలో ఓ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఐదు కుటుంబాలు విందులో పాల్గొనేందుకు హోటల్‌కు వెళ్లాయి. వాళ్లందరూ రకరకాల వంటకాలు తిన్నారు. చివరగా ఇంటికి చేరే సమయంలో దారిలో కనిపించిన స్ట్రీట్ ఫుడ్ కూడా రుచి చూశారు. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు. కానీ ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫుడ్ పాయిజనింగ్‌గా తేల్చారు. సాక్షి, పుట్టపర్తి : నిత్యావసర సరుకుల ధరలతో పాటు వంటనూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ వాడకం మాత్రం తగ్గడంలేదు. మరోవైపు హోటళ్లలో తిండి ధరలు ఉన్నఫలంగా పెంచడం కుదరదు. దీంతో చాలా మంది కల్తీనూనె వాడటం మొదలుపెట్టారు. దీనికితోడు పొయ్యిపై నూనెను పదే పదే మరిగించేస్తున్నారు. ఫలితంగా తాజా నూనె అయినప్పటికీ మరిగించడంతో రుచి మారుతోంది. ఆ నూనెలో తయారు చేసిన పదార్థాలను తింటున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో తరచూ వెలుగు చూస్తున్నాయి. రోడ్డు పక్కన తయారు చేసే ఆహార పదార్థాలు దుమ్ము, ధూళి రేణువులు చేరి అనారోగ్యానికి గురి చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పట్టణాల్లోనే అధికం.. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే హోటళ్లు అధికం. అందులో రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు ప్రతి వంద మీటర్లకు ఒకటి కనిపిస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి పలు పనులపై వచ్చే వాళ్లు గత్యంతరం లేక ఇక్కడే తినాల్సి వస్తోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలోని హోటళ్లలో ఎక్కువ మంది ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే నూనెను పదే పదే మరిగించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా.. మద్యం దుకాణాల సమీపంలోని చికెన్ కబాబ్ సెంటర్లలో ఎక్కువసార్లు మరిగించిన నూనెలో చేసిన పదార్థాలను తినడం కారణంగా మందుబాబులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మద్యం కంటే కల్తీ నూనె పదార్థాలు ఎక్కువగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయనే విషయం మత్తులో గమనించలేకపోతున్నారు. మటన్, చికెన్, కోడిగుడ్ల వంటకాల్లో ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రైవేటు మద్యం దుకాణాలు రావడంతో ఒక్కో దుకాణం వద్ద పదుల కొద్దీ చికెన్ కబాబ్ సెంటర్లు వెలిశాయి. ఒకసారి పొయ్యి పెట్టిన నూనె సాయంత్రం వరకూ కాగుతూనే ఉంటోంది. ఫలితంగా ఆ ఆహారాన్ని తీసుకునే వారు ఫుడ్ పాయిజన్‌తో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అటకెక్కిన తనిఖీలు.. పదే పదే మరిగించిన నూనెలో వంటకాలు చేయడం.. ఆ పదార్థాలు తిన్న వారు అనారోగ్యం బారిన పడటం.. సైకిల్ చక్రంలా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు లేకపోవడంతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తే కానీ తనిఖీలు చేయరని అంటున్నారు. మరి కొన్ని చోట్ల ఆర్నెల్లకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదని రికార్డులు చెబుతున్నాయి. పండుగ సమయంలో మాత్రమే అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. నూనె డబ్బాల్లో ఎంతమేరకు కల్తీ ఉందనే విషయం ఎవరూ బయటపెట్టడంలేదు. కబేళాలకు తరలించే పశువుల ఎముకల పిండి కూడా నూనెలో కలిపేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కల్తీ అని తేలితే కఠిన చర్యలు మా సిబ్బంది ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ కల్తీ జరుగుతోందో పక్కా సమాచారం ఇస్తే.. తనిఖీ ముమ్మరం చేస్తాం. శ్యాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపిస్తాం. కల్తీ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవు. ఇప్పటికే చాలా చోట్ల తనిఖీలు చేశాం. కల్తీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాం. ప్రజలు బయట ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. – రామచంద్ర, ఫుడ్ ఇన్స్పెక్టర్, పుట్టపర్తి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారంతోనే ఆరోగ్యం బాగుంటుంది. బయట ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. మసాలా, నూనె వంటలు తినడం తగ్గించాలి. నూనె వంటకాలతో కొవ్వు శాతం పెరగడంతో పాటు కల్తీ నూనె వంటకాలు తింటే వివిధ రోగాలు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ మంజువాణి, డీఎంహెచ్ఓరోగాలు ఇలా.. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిల్వ ద్వారా విష పదార్థాలు కూడా ఏర్పడతాయి. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. -
బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఇండియాలోనే నెం1 ప్లేస్
స్ట్రీట్ఫుడ్స్కి ఇప్పుడు ప్రాధాన్యత బాగా పెరిగింది. వెరైటీ స్టైల్లో, రుచికరమైన టేస్ట్‌తో స్ట్రీట్‌ఫుడ్ బిజినెస్ బాగా ఫేమస్ అవుతుంది. ఇటీవలె Borzo గ్లోబల్ ఇంట్రా-సిటీ డెలివరీ సర్వీస్ స్ట్రీట్ ఫుడ్స్‌పై సర్వేను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఏయే ప్రాంతాల్లో ఏ స్ట్రీట్‌ఫుడ్ ఫేమస్, టాప్10 స్ట్రీట్ ఫుడ్స్ ఏంటన్నదానిపై ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. టాప్-10 స్ట్రీట్ ఫుడ్స్.. 1. బిర్యానీ 2. వడపావ్ 3. మోమోస్ 4. చోలేబతురే 5. సమోసా 6. పావ్‌భాజీ 7. మసాలా దోశ 8. టుండే కబాబ్ 9. పోహ జలేబి 10. కచోరి టాప్10 స్ట్రీట్ జ్యూస్‌లు, షేక్స్: 1. మ్యాంగో మిల్క్ షేక్ 2. కోల్డ్ కాఫీ 3. మోసంబి జ్యూస్ 4. ఫలూదా 5. లస్సీ 6. నిమ్మరసం 7. ఆపిల్ జ్యూస్ 8. బాదం షేక్ 9. కాలా ఖట్టా 10. చెరకు రసం -
మీరు తప్పకుండా టేస్ట్ చేయాల్సిన టాప్15 స్ట్రీట్‌ఫుడ్స్ ఇవే
మన దేశంలో స్ట్రీట్‌ఫుడ్‌కి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఎందుకంటే వీటిలో దొరికే రుచి పెద్దపెద్ద ఫైవ్‌స్టార్ హోటల్స్‌లోనూ లభించదు కాబట్టి. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆహార పద్ధతులు మారుతూ ఉంటాయి. ఇక మన దేశంలో ఎన్నో రకాల ప్రత్యేకమైన, విభిన్నమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్స్ వద్ద కనిపించే జససందోహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మధ్య బీటెక్ చాయ్వాలీ దగ్గర్నుంచి, గ్రాడ్యుయేట్ పానీపూరీ వరకు.. ఎంతోమంది యువత సైతం స్ట్రీట్ ఫుడ్ అమ్ముతూ తమకంటూ సొంత గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఏ వీధి చూసినా స్ట్రీట్‌ఫుడ్ వద్ద జనం కిటకిటలాడుతుంటారు. మరి మన దేశంలో తప్పకుండా రుచి చూడాల్సిన స్ట్రీట్‌ఫుడ్స్ ఏంటన్నది చూసేద్దామా.. ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్, అవి ఎక్కడ దొరుకుయన్నది ఓసారి పరిశీలిస్తే.. 1. ముంబైలోని జోగేశ్వరిలో- ఫరీద్ సీఖ్పరాట 2. అర్సలన్ బిర్యానీ- పార్క్ స్ట్రీట్, కోల్‌కతా 3. అంబర్ వడాపావ్- కల్యాణ్, ముంబై 4. బటర్ చికెన్- రాజీందర్ దా డాబా- సఫ్దర్‌జంగ్, ఢిల్లీ 5. మిసల్ పావ్ బేడ్కర్- మిసల్, ఫూణె 6. ప్యాజ్ కచోరి రావత్ మిస్తాన్ బాంఢర్- జైపూర్ 7. మూల్‌చంద్ పరాటా- లాజ్‌పత్ నగర్, ఢిల్లీ 8. షాదాబ్ బిర్యానీ- హైదరాబాద్ 9. సర్దార్ పావ్ భాజీ- ముంబై 10. సౌత్ ఇండియా బెస్ట్ ఉడిపి శ్రీ దర్శిని- ఎల్లిస్ బ్రిడ్జ్, అహ్మదాబాద్ 11. రసగంగా మీల్స్- బెల్లందూర్, బెంగళూరు 12. కొరియన్ వ్రాప్- బెంగళూరు 13. నటరాజ్దహీ భల్లే - చాందిని చౌక్, ఢిల్లీ 14. తండా కబాబ్- లక్నో 15. జోషి దహి వడ- ఇండోర్ ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో స్ట్రీట్‌ఫుడ్‌కి ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉందనే చెప్పాలి. అక్కడ చాట్, చట్పటా, పావ్‌బాజీ లాంటి ఎన్నో రెసిపిలు బాగా ఫేమస్. దేశంలో టాప్ 10 స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కడ దొరుకుతాయంటే.. ఢిల్లీ: రోహిణి, చాందిని చౌక్, రాజౌరు గార్డెన్, లాజ్పుట్ నగర్. ముంబై: మహమ్మద్ అలీ రోడ్, బాంద్రా, అంధేరీ, మలద్, ఘట్కోపర్ హైదరాబాద్: కూకట్పల్లి, ఓల్డ్‌సిటీ, టోలిచోకి పూణె: శివాజీ నగర్, జేఎమ్ రోడ్ -
డ్యాన్సింగ్ భేల్ పూరీ.. నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
'భేల్ పూరీ' భారతదేశంలో స్ట్రీట్ ఫుడ్ స్నాక్స్‌లో ప్రధానమైనది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ వంటకాన్ని తెగ ఇష్టపడతారు. ఒక్కో చోట ఒక్కో ప్రత్యేకత ఉంటుందీ భేల్ పూరీకి. తాజాగా దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఓ వీడియో ఫుడ్ లవర్స్‌ను ఆకర్షించింది. ఈ కొత్త వంటకం పేరే డ్యాన్సింగ్ భేల్ పూరీ. ఇందులో ఉపయోగించే 60 రకాల పదార్థాలు మాత్రమే కాదు అది చేసే విధానంలోనే కొత్తదనం ఉంటుంది. దీన్ని తయారు చేసేప్పుడు దుకాణదారుడి ఉత్సాహం, లయబద్దమైన డ్యాన్స్‌తో దీనికి మరింత రుచిని తెచ్చిపెడతాయి. ఈ వీడియోలో దుకాణదారుడు భేల్ పూరీని తయారు చేయడానికి సిద్ధపడినప్పుడు దానికి కావల్సిన అన్ని పదార్థాలను ఓ పాత్రలోకి తీసుకుంటాడు. అనంతరం ఓ ప్రత్యేకమైన విధానంలో లయబద్ధంగా డ్యాన్స్ చేస్తూ ఆ పదార్థాలన్నింటిని కలియబెడతాడు. కిందికి మీదికి తిప్పుతూ అతడు చేసే గారడి చూస్తే.. 'అరె..! భలే తిప్పుతున్నాడే' అనిపించక మానదు. చిటికెలోనే భేల్ పూరీని ప్లేట్లో వేసేస్తాడు. View this post on Instagram A post shared by Rajanmishra (@aapkabhai_foody) ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్స్ స్పందనలతో కామెంట్ బాక్స్ నిండిపోయింది. అతని ఎనర్జీ భేల్ పూరీకి మరింత టేస్టును తీసుకువచ్చిందని కొందరు కామెంట్ చేశారు. అతడు డ్యాన్స్ చేసే క్రమంలో చాలా ఫుడ్ కిందపడిపోతుందని మరికొంతమంది స్పందించారు. ఇదీ చదవండి: ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్టు.. మిన్నంటిన ఆందోళనలు -
మందుబాబులకు అడ్డాలుగా... 'కియోస్క్’లు!!
సాక్షి, హైదరాబాద్: ఆకలిగొన్నవారికి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్‌ఫుడ్‌ను రెడీమేడ్‌గా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కియోస్క్‌లు (డబ్బాలు) ప్రారంభానికి ముందే అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మల్లేపల్లి నైస్ హాస్పిటల్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో చిరువ్యాపారులకు అవకాశం కల్పించేందుకు అక్కడ వెండింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ జోన్లో వివిధ రకాల స్ట్రీట్ఫుడ్తోపాటు కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తదితరమైనవి విక్రయించాలని భావించారు. దాదాపు రూ.85 లక్షల వ్యయంతో ఈ స్ట్రీట్ వెండింగ్‌జోన్ ఏర్పాటుకు సిద్ధమైన అధికారులు అక్కడ అవసరమైన కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిని ఉంచేందుకు లక్షల వ్యయంతో నిర్మించిన ఫుట్‌పాత్‌ను, మొక్కలను సైతం ధ్వంసం చేశారు. ఇంతా చేసి...వెండింగ్ జోన్‌ను ప్రారంభించడంలో మాత్రం విఫలమయ్యారు. కియోస్క్లనైనా అందుబాటులోకి తెచ్చి లక్ష్యాన్ని అమలు చేశారా అంటే అదీ లేదు. కియోస్క్‌లను ఎవరికీ పట్టనట్లు వదిలివేయడంతో ఆ మార్గం పోకిరీలకు అడ్డాగా మారింది. రాత్రివేళల్లో వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఉదయాన్నే మద్యం సీసాలు వంటివి దర్శనమిస్తున్నాయి. రాత్రివేళల్లో కియోస్క్‌లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వెరైటీలెన్నో.. వివిధ రకాల వెరైటీలు అందుబాటులో ఉండాలనే తలంపుతో 12 కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిల్లో దక్షిణభారత వంటకాలతోపాటు చైనీస్ వంటకాలు, షవర్మా, చాట్, పిజ్జా బర్గర్లు, కబాబ్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్, జ్యూస్, కాఫీ,కూల్‌డ్రింక్స్ అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. తద్వారా చెత్తాచెదారాలతో ఉండే వీధి బాగుపడటంతోపాటు స్ట్రీట్‌వెండింగ్ జోన్ వల్ల చిరువ్యాపారులకు ఉపాధి, ప్రజలకు వెరైటీ ఆహారపదార్థాలు వినియోగంలోకి వస్తాయనుకున్నారు. కానీ..డబ్బాలను ఏర్పాటు చేశాక కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రజల సదుపాయం కోసం నిర్మించిన కాంక్రీటు బెంచీలు, టేబుళ్లపై, ఫుట్‌పాత్‌పై మట్టి, రాళ్లకుప్పలతో పరిస్థితులు పరమ దరిద్రంగా ఉన్నాయి. సంబంధిత అధికారి వివరణ కోసం ప్రయత్నించగా కార్యాలయంలో లేరు. ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. లక్షల రూపాలయ ధనం ఇలా దుర్వినియోగమవుతున్నా జోన్ ఉన్నతాధికారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతిరోజు ఉదయాన్నే పారిశుధ్య కార్యక్రమాల అమలు చర్యల పర్యవేక్షణకు వెళ్లే వైద్యాధికారులకు సైతం ఇవి కనిపించడం లేవు. జోన్లకే అధికారాలు వికేంద్రీకరించడంతో ఏ జోన్లో ఏం పని జరుగుతోందో ప్రధాన కార్యాలయానికి తెలియడం లేదు. (చదవండి: కరోనా చావులు.. కాకి లెక్కలు!) (చదవండి: సింఘు నుంచి సొంతూళ్లకు..) -
రోడ్డుపక్కన వంటలపై నిషేధం!
న్యూఢిల్లీ: స్ట్రీట్ ఫుడ్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్! ఢిల్లీలో రోడ్డు పక్కన ఆహార పదార్ధాలు, తినుబండారాలు వండటంపై ప్రభుత్వం నిషేధం విధించింది. రోడ్డుపక్కన టిఫిన్లు, ఫాస్ట్ ఫుడ్, చాట్ బండార్ వంటి ఆహార పదార్థాలు వండి.. అమ్ముకునే వీధి వ్యాపారాలకు ఈ నిర్ణయం శరాఘాతమే. దీనిపై వీధివ్యాపారుల అసోసియేషన్ శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిద్ కేజ్రీవాల్‌ను కలిసి తమ నిరసన తెలుపాలని భావిస్తున్నది. రోడ్డు పక్కన ఎలాంటి ఆహార పదార్థాలను వండరాదంటూ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్-2014 అమలులో భాగంగా కొత్త నిబంధనను ప్రభుత్వం ఈ నెల 6న జారీచేసింది. ఇందులోని కఠినమైన నిబంధనల పట్ల వీధి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన ఎలాంటి ఆహార పదార్థాలు సిద్ధం చేయరాదంటూ విధించిన నిషేధం వల్ల తమ జీవితాలు మరింత రోడ్డున పడుతాయని, తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నిబంధనల వల్ల ఢిల్లీలోని లక్షల మంది వీధి వ్యాపారుల జీవితం అగమ్యగోచరంగా మారుతుందని ఆ సంఘం నిరసన వ్యక్తం చేస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నిబంధనలు అమల్లోకి తెచ్చిన ఢిల్లీ ప్రభుత్వం దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయడం కష్టమేనని, అందుకు తగినంత సిబ్బంది ప్రస్తుతం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.