మందుబాబులకు అడ్డాలుగా... 'కియోస్క్‌’లు!! | Kiosks set up For Providing Healthy Street Food Ready Made Become Unscrupulous Activities | Sakshi
Sakshi News home page

రిస్క్‌లో ‘కియోస్క్‌’లు!!

Dec 12 2021 11:42 AM | Updated on Dec 12 2021 1:40 PM

Kiosks set up For Providing Healthy Street Food Ready Made Become Unscrupulous Activities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆకలిగొన్నవారికి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్‌ఫుడ్‌ను రెడీమేడ్‌గా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కియోస్క్‌లు (డబ్బాలు) ప్రారంభానికి ముందే అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి.  ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోని మల్లేపల్లి నైస్‌ హాస్పిటల్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో చిరువ్యాపారులకు అవకాశం కల్పించేందుకు అక్కడ వెండింగ్‌ జోన్‌ ఏర్పాటు చేశారు. ఈ జోన్‌లో వివిధ రకాల స్ట్రీట్‌ఫుడ్‌తోపాటు కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్‌ తదితరమైనవి విక్రయించాలని భావించారు.  

  • దాదాపు రూ.85 లక్షల వ్యయంతో ఈ స్ట్రీట్‌ వెండింగ్‌జోన్‌ ఏర్పాటుకు సిద్ధమైన అధికారులు అక్కడ అవసరమైన కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిని ఉంచేందుకు లక్షల వ్యయంతో నిర్మించిన ఫుట్‌పాత్‌ను, మొక్కలను సైతం ధ్వంసం చేశారు.  
  • ఇంతా చేసి...వెండింగ్‌ జోన్‌ను ప్రారంభించడంలో మాత్రం విఫలమయ్యారు.  కియోస్క్‌లనైనా అందుబాటులోకి తెచ్చి లక్ష్యాన్ని అమలు చేశారా అంటే అదీ లేదు. 
  • కియోస్క్‌లను ఎవరికీ పట్టనట్లు వదిలివేయడంతో ఆ మార్గం పోకిరీలకు అడ్డాగా మారింది. రాత్రివేళల్లో వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఉదయాన్నే మద్యం సీసాలు వంటివి దర్శనమిస్తున్నాయి.  
  • రాత్రివేళల్లో కియోస్క్‌లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా  సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.  

వెరైటీలెన్నో.. 

  • వివిధ రకాల వెరైటీలు అందుబాటులో ఉండాలనే తలంపుతో 12 కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిల్లో దక్షిణభారత వంటకాలతోపాటు చైనీస్‌ వంటకాలు, షవర్మా, చాట్, పిజ్జా బర్గర్లు, కబాబ్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్, జ్యూస్, కాఫీ,కూల్‌డ్రింక్స్‌ అందుబాటులో ఉండాలని నిర్ణయించారు.  
  • తద్వారా చెత్తాచెదారాలతో ఉండే వీధి బాగుపడటంతోపాటు స్ట్రీట్‌వెండింగ్‌ జోన్‌ వల్ల చిరువ్యాపారులకు ఉపాధి, ప్రజలకు వెరైటీ ఆహారపదార్థాలు వినియోగంలోకి వస్తాయనుకున్నారు.  
  • కానీ..డబ్బాలను ఏర్పాటు చేశాక కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రజల సదుపాయం కోసం నిర్మించిన కాంక్రీటు బెంచీలు, టేబుళ్లపై, ఫుట్‌పాత్‌పై మట్టి, రాళ్లకుప్పలతో పరిస్థితులు పరమ దరిద్రంగా ఉన్నాయి. 
  • సంబంధిత అధికారి వివరణ కోసం ప్రయత్నించగా కార్యాలయంలో లేరు. ఫోన్‌లోనూ  అందుబాటులోకి రాలేదు. లక్షల రూపాలయ ధనం ఇలా దుర్వినియోగమవుతున్నా జోన్‌ ఉన్నతాధికారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు.  
  • ప్రతిరోజు ఉదయాన్నే పారిశుధ్య కార్యక్రమాల అమలు చర్యల పర్యవేక్షణకు వెళ్లే వైద్యాధికారులకు సైతం ఇవి కనిపించడం లేవు. జోన్లకే అధికారాలు వికేంద్రీకరించడంతో  ఏ జోన్‌లో ఏం పని జరుగుతోందో ప్రధాన కార్యాలయానికి తెలియడం లేదు.

(చదవండి: కరోనా చావులు.. కాకి లెక్కలు!)

(చదవండి: సింఘు నుంచి సొంతూళ్లకు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement