disgrace
-
మందుబాబులకు అడ్డాలుగా... 'కియోస్క్’లు!!
సాక్షి, హైదరాబాద్: ఆకలిగొన్నవారికి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్‌ఫుడ్‌ను రెడీమేడ్‌గా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కియోస్క్‌లు (డబ్బాలు) ప్రారంభానికి ముందే అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మల్లేపల్లి నైస్ హాస్పిటల్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో చిరువ్యాపారులకు అవకాశం కల్పించేందుకు అక్కడ వెండింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ జోన్లో వివిధ రకాల స్ట్రీట్ఫుడ్తోపాటు కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తదితరమైనవి విక్రయించాలని భావించారు. దాదాపు రూ.85 లక్షల వ్యయంతో ఈ స్ట్రీట్ వెండింగ్‌జోన్ ఏర్పాటుకు సిద్ధమైన అధికారులు అక్కడ అవసరమైన కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిని ఉంచేందుకు లక్షల వ్యయంతో నిర్మించిన ఫుట్‌పాత్‌ను, మొక్కలను సైతం ధ్వంసం చేశారు. ఇంతా చేసి...వెండింగ్ జోన్‌ను ప్రారంభించడంలో మాత్రం విఫలమయ్యారు. కియోస్క్లనైనా అందుబాటులోకి తెచ్చి లక్ష్యాన్ని అమలు చేశారా అంటే అదీ లేదు. కియోస్క్‌లను ఎవరికీ పట్టనట్లు వదిలివేయడంతో ఆ మార్గం పోకిరీలకు అడ్డాగా మారింది. రాత్రివేళల్లో వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఉదయాన్నే మద్యం సీసాలు వంటివి దర్శనమిస్తున్నాయి. రాత్రివేళల్లో కియోస్క్‌లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వెరైటీలెన్నో.. వివిధ రకాల వెరైటీలు అందుబాటులో ఉండాలనే తలంపుతో 12 కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిల్లో దక్షిణభారత వంటకాలతోపాటు చైనీస్ వంటకాలు, షవర్మా, చాట్, పిజ్జా బర్గర్లు, కబాబ్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్, జ్యూస్, కాఫీ,కూల్‌డ్రింక్స్ అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. తద్వారా చెత్తాచెదారాలతో ఉండే వీధి బాగుపడటంతోపాటు స్ట్రీట్‌వెండింగ్ జోన్ వల్ల చిరువ్యాపారులకు ఉపాధి, ప్రజలకు వెరైటీ ఆహారపదార్థాలు వినియోగంలోకి వస్తాయనుకున్నారు. కానీ..డబ్బాలను ఏర్పాటు చేశాక కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రజల సదుపాయం కోసం నిర్మించిన కాంక్రీటు బెంచీలు, టేబుళ్లపై, ఫుట్‌పాత్‌పై మట్టి, రాళ్లకుప్పలతో పరిస్థితులు పరమ దరిద్రంగా ఉన్నాయి. సంబంధిత అధికారి వివరణ కోసం ప్రయత్నించగా కార్యాలయంలో లేరు. ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. లక్షల రూపాలయ ధనం ఇలా దుర్వినియోగమవుతున్నా జోన్ ఉన్నతాధికారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతిరోజు ఉదయాన్నే పారిశుధ్య కార్యక్రమాల అమలు చర్యల పర్యవేక్షణకు వెళ్లే వైద్యాధికారులకు సైతం ఇవి కనిపించడం లేవు. జోన్లకే అధికారాలు వికేంద్రీకరించడంతో ఏ జోన్లో ఏం పని జరుగుతోందో ప్రధాన కార్యాలయానికి తెలియడం లేదు. (చదవండి: కరోనా చావులు.. కాకి లెక్కలు!) (చదవండి: సింఘు నుంచి సొంతూళ్లకు..) -
శతాబ్ది ఉత్సవాల్లో తెలుగు పరిశ్రమకు అవమానం
ఇటీవల చెన్నైలో ముగిసిన భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల్లో తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర అవమానం జరిగిందని ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి మండిపడ్డారు. అసలు సీనియర్లెవరినీ ఈ ఉత్సవానికి పిలవలేదని, వెళ్లినవారికి కూడా తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన అన్నారు. దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి కార్యక్రమం మధ్యలోనే బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంబరాలు మంగళవారంతో ముగిశాయి. సోమవారం నాడు భారతీయ సినీ ప్రముఖుల్లోని 41 మందిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సత్కరించారు. చెన్నైకి చెందిన పరిశ్రమ సీనియర్లలో చాలామందిని కనీసం ఆహ్వానించలేదని, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, భువనచంద్ర లాంటివారిని కూడా పిలవలేదని మురారి చెప్పారు. తనను పిలుస్తారని చెప్పినా, ఎవరూ కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో వెళ్లకూడదని నిర్ణయించుకున్నానన్నారు. ఎవరినైనా సత్కరించాలనుకుంటే వారికి ముందుగా చెప్పాలని, చిట్టచివరి నిమిషంలో వచ్చి అవార్డు తీసుకోమని చెబితే కుదరదని అన్నారు. అసలు వాళ్లకు కనీస ప్లానింగ్ కూడా లేదని మండిపడ్డారు. నాలుగు రోజులకు కలిపి ఒక పాస్ ఇచ్చి ఉండాల్సిందని, అలా కాకుండా ప్రతిరోజూ పాస్ కోసం గుమ్మం దగ్గర కళాకారులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చిందని అన్నారు. కమిటీ వద్ద శాలువాలు, మెమొంటోలు అయిపోవడంతో తీసుకున్నవాళ్లు మళ్లీ వాటిని తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని తెలిసినట్లు కూడా మురారి చెప్పారు. సీనియర్ నటి కవిత, నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి లాంటి వాళ్లు కూడా ఇలాగే అభిప్రాయపడ్డారు. తాను 150కి పైగా చిత్రాల్లో నటించానని, అగ్రహీరోలు అందరి సరసన హీరోయిన్గా చేశానని, అలాంటి తనను కనీసం పిలవను కూడా పిలవలేదని కవిత అయితే కంటనీరు పెట్టారు. వందేళ్ల సినిమా సంబరాలంటే కళామతల్లికి ధన్యవాదాలు చెబుతారనుకున్నానని, తీరా వేదికమీద డాన్సులు, డ్రామాలు వేశారని, సినీ రంగాన్ని గౌరవించేది ఇలాగేనా అని నారాయణమూర్తి ఆవేశంగా ప్రశ్నించారు. అక్కడ కనీసం నిలబడాలని కూడా అనిపించలేదని, దాంతో తాను సగంలోనే తిరిగి వచ్చేశానని ఆయన చెప్పారు. మహేష్ బాబు, ప్రభాస్, మోహన్ బాబు, దాసరి నారాయణరావు.. ఇలా చాలామంది ప్రముఖులు అసలీ ఉత్సవాలకు హాజరు కాలేదు. అయితే, ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు చిన్నచిన్న పొరపాట్లు తప్పవని నిర్మాత, దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ చిల్లర కళ్యాణ్ అన్నారు.