Kiosk machine
-
ఇంటి వద్దకే ఎస్బీఐ బ్యాంకింగ్ సేవలు
ముంబై: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి చేర్చే దిశగా ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే, చేతిలో ఇమిడిపోయే మొబైల్ హ్యాండ్‌హెల్డ్ పరికరాల ద్వారా కూడా సేవలు అందించే విధానాన్ని ఆవిష్కరించింది. నేరుగా ఖాతాదారుల ఇంటి ముంగిట్లోకే కియోస్క్ బ్యాంకింగ్ సరీ్వసులను తీసుకెళ్లేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని బ్యాంక్ చైర్మన్ దినేశ్ ఖారా తెలిపారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఖాతాదారులు మొదలైన వారికి ఇంటి దగ్గరే బ్యాంకింగ్ సరీ్వసులు అందించడంలో కస్టమర్ సరీ్వస్ పాయింట్ ఏజెంట్లకు వీటితో వెసులుబాటు లభిస్తుందన్నారు. నగదు విత్‌డ్రాయల్, డిపాజిట్లు, ఫండ్ ట్రాన్స్ఫర్లు, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్స్ వంటి అయిదు రకాల సర్వీసులు ఈ విధానంలో అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు అకౌంటు తెరవడం వంటి ఇతర సేవలను కూడా చేర్చే యోచనలో ఎస్బీఐ ఉంది. -
వాటర్ ఏటీఎం.. ఎనీ టైం మూసుడే
సాక్షి, హైదరాబాద్: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకని మూడేళ్ల క్రితం నగరవ్యాప్తంగా 150 ప్రాంతాల్లో వాటర్ ఏటీఎంల పేరిట కియోస్క్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీలకు స్థలాలు కేటాయించిన జీహెచ్ఎంసీ.. అవి పనిచేయకున్నా.. పత్తాలేకుండా పోయినా పట్టించుకోలేదు. తిరిగి ఇప్పుడు మళ్లీ వేసవి రావడంతో 60 ప్రాంతాల్లో ఏర్పాట్లకు చర్యలు చేపట్టింది. ప్రైవేటు ఏజెన్సీలు శుద్ధమైన నీటిని 24 గంటల పాటు తక్కువ ధరకు అందజేయాలనే తలంపుతో గతంలో వీటిని ఏర్పాటు చేశారు. కొద్దిరోజులు మాత్రం పనిచేసిన ఇవి క్రమేపీ పనిచేయడం మానేశాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా తెరవలేదని చెబుతున్నారు. ఇప్పుడు తిరిగి మళ్లీ ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నారు. రోజుకు 5వేల నుంచి 10వేల లీటర్ల తాగునీటిని పంపిణీ చేసే, ఈ అంశంలో తగిన అనుభవమున్న సంస్థలను ఈసారి పిలుస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కియోస్క్ ఇన్స్టలేషన్, విద్యుత్ చార్జీలు, ట్రేడ్‌లైసెన్స్ తదితరాలన్నీ ఏజెన్సీ బాధ్యతే అని చెప్పారు. అంతేకాదు.. కేటాయించిన స్థలానికి లీజు ధర కూడా చెల్లించాల్సి ఉంటుందన్నారు. టెండరు దక్కించుకునే సంస్థలకు మూడేళ్ల వరకు సదరు స్థలాల్ని లీజుకిస్తామని, పనితీరును బట్టి అనంతరం పొడిగింపు ఉంటుందని తెలిపారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ, నిర్వహణ చేయని వాటిపై ఎలాంటి చర్యలు ఉండకపోవడంతో ఏర్పాట్లకు ఉత్సాహం చూపుతున్న సంస్థలు.. అనంతరం చేతులెత్తేస్తున్నాయి. దాని బదులు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోనే వాటర్బోర్డుతో ఒప్పందం కుదుర్చుకొని, కియోస్క్‌లలో పనిచేసే వారికి మాత్రం వేతనాలు చెల్లించడమో లేక మరో ప్రత్యామ్నాయమో చూపితే మేలనే అభిప్రాయాలున్నాయి. లేదా సీఎస్సార్ కింద నిర్వహణను కార్పొరేట్ సంస్థలకిచ్చినా ఉపయోగముంటుందని చెబుతున్నవారు కూడా ఉన్నారు. వాటర్ కియోస్క్‌లు, లూకేఫ్‌ల ఏర్పాటు పేరిట విలువైన స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు లీజు కివ్వడం అవి లీజుఅద్దెలు చెల్లించకున్నా, ఒప్పందానికనుగుణంగా పనులు చేయకున్నా చర్యలు లేకపోవడంతో ఇలాంటి విధానాల వల్ల ప్రభుత్వ స్థలాలు.. ముఖ్యంగా ఫుట్‌పాత్‌లు వంటివి సైతం అన్యాక్రాంతమై ఇతర వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జోన్‌కు 10 చొప్పున.. జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో జోన్‌కు పది చొప్పున మొత్తం 60 వాటర్ కియోస్క్‌ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమైనట్లు అధికారులు తెలిపారు. వాటి టెండరు పూర్తయి.. ఇన్స్టలేషన్.. తదితర కార్యక్రమాలు ముగిసి అందుబాటులోకి వచ్చేప్పటికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. ఈలోగా వేసవి ముగిసినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. టెండరు పొందే సంస్థలకు 300 చదరపు అడుగుల స్థలాన్ని జీహెచ్ఎంసీ కేటాయిస్తుంది. టెండరు ద్వారా కాంట్రాక్టు దక్కించుకునే సంస్థలు ప్రజలు శుద్ధమైన, చల్లని నీటిని దిగువ ధరలకు అందజేయాలి. (చదవండి: హైదరాబాద్ డాక్టర్‌కు బ్రిటిష్ అత్యున్నత అవార్డు) -
మందుబాబులకు అడ్డాలుగా... 'కియోస్క్’లు!!
సాక్షి, హైదరాబాద్: ఆకలిగొన్నవారికి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన స్ట్రీట్‌ఫుడ్‌ను రెడీమేడ్‌గా అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కియోస్క్‌లు (డబ్బాలు) ప్రారంభానికి ముందే అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలోని మల్లేపల్లి నైస్ హాస్పిటల్, ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో చిరువ్యాపారులకు అవకాశం కల్పించేందుకు అక్కడ వెండింగ్ జోన్ ఏర్పాటు చేశారు. ఈ జోన్లో వివిధ రకాల స్ట్రీట్ఫుడ్తోపాటు కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తదితరమైనవి విక్రయించాలని భావించారు. దాదాపు రూ.85 లక్షల వ్యయంతో ఈ స్ట్రీట్ వెండింగ్‌జోన్ ఏర్పాటుకు సిద్ధమైన అధికారులు అక్కడ అవసరమైన కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిని ఉంచేందుకు లక్షల వ్యయంతో నిర్మించిన ఫుట్‌పాత్‌ను, మొక్కలను సైతం ధ్వంసం చేశారు. ఇంతా చేసి...వెండింగ్ జోన్‌ను ప్రారంభించడంలో మాత్రం విఫలమయ్యారు. కియోస్క్లనైనా అందుబాటులోకి తెచ్చి లక్ష్యాన్ని అమలు చేశారా అంటే అదీ లేదు. కియోస్క్‌లను ఎవరికీ పట్టనట్లు వదిలివేయడంతో ఆ మార్గం పోకిరీలకు అడ్డాగా మారింది. రాత్రివేళల్లో వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఉదయాన్నే మద్యం సీసాలు వంటివి దర్శనమిస్తున్నాయి. రాత్రివేళల్లో కియోస్క్‌లను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. వెరైటీలెన్నో.. వివిధ రకాల వెరైటీలు అందుబాటులో ఉండాలనే తలంపుతో 12 కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటిల్లో దక్షిణభారత వంటకాలతోపాటు చైనీస్ వంటకాలు, షవర్మా, చాట్, పిజ్జా బర్గర్లు, కబాబ్స్, ఐస్‌క్రీమ్స్, స్వీట్స్, జ్యూస్, కాఫీ,కూల్‌డ్రింక్స్ అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. తద్వారా చెత్తాచెదారాలతో ఉండే వీధి బాగుపడటంతోపాటు స్ట్రీట్‌వెండింగ్ జోన్ వల్ల చిరువ్యాపారులకు ఉపాధి, ప్రజలకు వెరైటీ ఆహారపదార్థాలు వినియోగంలోకి వస్తాయనుకున్నారు. కానీ..డబ్బాలను ఏర్పాటు చేశాక కనీసం పట్టించుకోకపోవడంతో పరిస్థితులు దారుణంగా మారాయి. ప్రజల సదుపాయం కోసం నిర్మించిన కాంక్రీటు బెంచీలు, టేబుళ్లపై, ఫుట్‌పాత్‌పై మట్టి, రాళ్లకుప్పలతో పరిస్థితులు పరమ దరిద్రంగా ఉన్నాయి. సంబంధిత అధికారి వివరణ కోసం ప్రయత్నించగా కార్యాలయంలో లేరు. ఫోన్లోనూ అందుబాటులోకి రాలేదు. లక్షల రూపాలయ ధనం ఇలా దుర్వినియోగమవుతున్నా జోన్ ఉన్నతాధికారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతిరోజు ఉదయాన్నే పారిశుధ్య కార్యక్రమాల అమలు చర్యల పర్యవేక్షణకు వెళ్లే వైద్యాధికారులకు సైతం ఇవి కనిపించడం లేవు. జోన్లకే అధికారాలు వికేంద్రీకరించడంతో ఏ జోన్లో ఏం పని జరుగుతోందో ప్రధాన కార్యాలయానికి తెలియడం లేదు. (చదవండి: కరోనా చావులు.. కాకి లెక్కలు!) (చదవండి: సింఘు నుంచి సొంతూళ్లకు..) -
ఊరూరా విత్తనాల ఏటీఎంలు!
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యల వల్ల వ్యవసాయ రంగ ముఖ చిత్రం మారుతోంది. 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈ నెల 30న ప్రారంభం కానున్న ‘కియోస్క్’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. మార్కెటింగ్ సేవలు రైతులకు అందుతాయి. ‘ఏటీఎం’ల వంటి ఈ కియోస్క్‌ల ద్వారా ఉత్పాదకాలను రైతులకు అందిస్తున్నారు. ఇది దేశ చరిత్రలోనే తొట్ట తొలి ప్రయోగం. 2020 మే 30.. రెండు ప్రత్యేకతలు.. ఒకటి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది. రెండోది.. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను (ఆర్బీకేలు) ఆయనే స్వయంగా ప్రారంభిస్తున్న రోజు. దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు. రైతు భరోసా కేంద్రాలు ‘హబ్ (గోదాము) అండ్ స్పోక్స్(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జిల్లాలో 5 హబ్‌లు, ప్రతి గ్రామ సచివాలయంలో ఒక స్పోక్ (ఆర్బీకే) ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కేంద్రంలో అత్యాధునిక డిజిటల్ టచ్ స్క్రీన్ ‘కియోస్క్’లు ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. రైతులకు తమ గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు సమస్త సేవలు సులభంగా అందించే ‘ఏటీఎం’ల వంటివే ఈ ‘కియోస్క్’లు! కియోస్క్‌లు ఎలా పని చేస్తాయంటే.. ఈ డిజిటల్ కియోస్క్ ఓ అత్యాధునిక ఏటీఎం లాంటిది. టచ్ స్క్రీన్, ఫ్రంట్ కెమేరా, ఆధార్‌తో అనుసంధానమైన ఫింగర్ ప్రింట్ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని– ధర్మల్ ప్రింటర్, ఆక్సిలరీ ఆడియో ఇన్పుట్, యూఎస్బీ చార్జింగ్ స్లాట్, ఏ–4 కలర్ ప్రింటర్, ఈ పాస్ మిషన్, ఆర్ఎఫ్ఐడీ కార్డ్ రీడర్ నూ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు ఐదు చొప్పున 65 ఆగ్రోస్ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో హబ్‌కు– దాని పరిథిలోని గ్రామాల రైతుల వివరాలను అనుసంధానం చేశారు. కియోస్క్‌ను పరిశీలిస్తున్న ఏపీ వ్యవసాయ కమిషనర్ అరుణ్‌కుమార్ టచ్ స్క్రీన్.. రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్ కియోస్క్ ఎదుట రైతు నిలబడి స్క్రీన్‌ను వేలితో తాకి, ఫోన్ నంబరును ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వంటి వాటి బొమ్మలు, వాటి ధరవరలు కియోస్క్ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. రైతు తాను కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకొని, ఎంత పరిమాణంలో కావాలో, ఎంత ధర అవుతున్నదో ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక క్లిక్ చేస్తే ఆర్డరు తయారవుతుంది. సమీపంలోని ఆగ్రోస్ కేంద్రానికి అంటే ‘హబ్’(గోదాము)కు తక్షణమే ఆ రైతు కొనుగోలు చేయదలచిన సరుకుల ఆర్డర్ వెళుతుంది. కియోస్క్ నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా ఉత్పత్తులు గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లోగా రైతులకు అందుతాయి. విత్తనాలను ఏపీ సీడ్స్ సంస్థ, మిగతా వాటిని ఆగ్రోస్ సెంటర్లు సరఫరా చేస్తాయి. ఏమిటీ ‘హబ్, స్పోక్ మోడల్’? ఆర్బీకేలోని అగ్రీ ఇన్పుట్ షాపు ఈ మోడల్లో పని చేస్తుంది. నిల్వ, ఇన్వెంటరీ, అమ్మకం, రాబడుల నిర్వహణ, సరకు రవాణా తదితరాలకు హాబ్‌లు గిడ్డంగులుగా ఉంటాయి. వర్చువల్ రిటైల్ స్టోర్లుగా స్పోక్స్ పని చేస్తాయి. రైతులు తమ ఆర్డర్లను ఇచ్చేందుకు ప్రతి ఆర్బీకేలో డిజిటల్ విధానంలో ఏర్పాటు చేసే కియోస్కే ఈ స్పోక్. ఈ కియోస్క్ మెషిన్ ఏటీఎం మాదిరిగా ఉంటుంది. దీని నుంచి రైతులు తమ వ్యవసాయానికి కావాల్సిన ఉత్పాదకాల(ఇన్పుట్స్)ను ఆర్డరు చేస్తే.. 48 నుంచి 72 గంటల (2–3 రోజుల)లోగా బట్వాడా చేస్తారు. కియోస్క్ ద్వారా విత్తనాలు తదితరాలను ఎంపిక చేసుకోవడం, ఆర్డర్ చేయడం వంటి విషయాలలో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, వీరికి తోడ్పడటానికి ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటారు. గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్థక, మత్స్య శాఖల సహాయకులు రైతులకు సహాయపడతారు. కియోస్క్‌ల ద్వారా సులువుగా సమస్త సమాచారం... ► మారుమూల గ్రామాల్లో కూడా డిజిటల్ కియోస్క్‌లు ఏర్పాటవుతున్నందున అక్కడి రైతులకు ఉత్పాదకాలతోపాటు సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని సులువుగా అందించవచ్చు. ► వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉత్పాదకాలను గ్రామ స్థాయిలోనే రైతులకు అందించవచ్చు. ► ఏయే వ్యవసాయోత్పత్తులకు మార్కెట్లో మున్ముందు మంచి ధర వచ్చే అవకాశం ఉంది (మార్కెట్ ఇంటెలిజెన్స్)?, ప్రస్తుతం వివిధ మార్కెట్లలో ఏయే పంటలకు ఎంతెంత ధర పలుకుతోంది? ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వంటి ముఖ్యమైన తాజా సమాచారాన్ని రైతులకు అందించవచ్చు. ► వాతావరణ సూచనలు, ఆయా ప్రాంతాల్లోని చీడ పీడల సమాచారాన్నీ అందించవచ్చు. ► భూ రికార్డులను అందుబాటులోకి తేవచ్చు. ► వివిధ పంటల సాగు సాంకేతిక మెళకువలను తెలియజెప్పే వీడియోలను ఈ కియోస్క్‌ల ద్వారా రైతులకు చూపవచ్చు. రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటైన కియోస్క్ – ఆకుల అమరయ్య, సాక్షి -
కరోనా శాంపిల్స్ సేకరణకు కియోస్క్‌లు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/పలమనేరు (చిత్తూరు జిల్లా): కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్ బారిన పడకుండా శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో కియోస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వినియోగించడం ద్వారా కరోనా రోగులకు చికిత్స చేసే వైద్యులతోపాటు, అనుమానితుల నుంచి నమూనాలు సేకరించే వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరణ కోసం వాక్ ఇన్ కియోస్క్ (విస్క్)లను ఏర్పాటు చేయగా, చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యురాలు మమతారాణి కూడా దాదాపు ఇలాంటిదాన్నే సొంతంగా తయారు చేశారు. ► శ్రీకాకుళంలో రిమ్స్, జెమ్స్ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన కియోస్క్ రూమ్ నాలుగడుగుల వెడల్పు, పొడవు, ఎనిమిది అడుగుల ఎత్తులో అద్దాలతో ఉంటుంది. రూమ్ కౌంటర్ వద్ద రెండు రబ్బరు గ్లౌజులు ఉంటాయి. ► పలమనేరు ప్రభుత్వాస్పత్రిలోనూ ఫ్లైవుడ్‌తో, అద్దాలతో డాక్టర్ మమతారాణి ఇలాంటి కియోస్క్నే రూపొందించారు. ► రోగి బయట.. వైద్యుడు కియోస్క్ లోపల ఉంటారు. వైద్యుడు ఆ రబ్బరు గ్లౌజులు ధరించి అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తారు. ► తర్వాత నమూనాలను మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంచి పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపుతారు. ► సాధారణంగా అయితే గొంతులో నుంచి నమూనాలు సేకరించే సమయంలో రోగికి వాంతులు కావడంతోపాటు తుమ్ములు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులకు సులభంగా వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఈ కియోస్క్‌ల ద్వారా అలాంటి ప్రమాదం తప్పుతుంది. ► వైద్యులకు, అనుమానిత రోగులకు మధ్య పెద్ద గ్లాసు అడ్డుగా ఉంటుంది కాబట్టి వైరస్ వైద్యులకు అంటుకునే అవకాశం ఉండదు. ► నమూనా సేకరణ పూర్తయ్యాక ఆ రూమ్‌ను శానిటైజ్ చేసి, సోడియం హైపోక్లోరైడ్‌తో శుభ్రం చేస్తారు. ► ఇలాంటి కియోస్క్‌లు ప్రస్తుతం కేరళలోని ఎర్నాకుళం, తమిళనాడులోని తిరువూరుల్లో మాత్రమే ఉండగా మన రాష్ట్రంలో మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. -
హాయ్.. ఇది చాలా ఫాస్ట్ గురూ..!
‘ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది.. ట్రైన్ మరో 15 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ లోపు ప్లాట్‌ఫారమ్‌పై ఎక్కడో ప్లగ్ పాయింట్ వెదుక్కుని చార్జింగ్ పెడితే మహా అయితే 10 శాతం చార్జ్ అవుతుంది. ఇప్పుడా చింతే లేదు.. ఇకపై 100 శాతం చార్జింగ్‌ని కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో చేసుకోవచ్చు.’ రైలెక్కడానికి స్టేషన్‌కు చేరుకున్నారు. సేఫ్‌గా రీచ్ అయ్యానని ఇంటికి చెయ్యాలని ఫోన్ చేస్తే బ్యాలెన్స్ నిల్ అని వాయిస్ మెసేజ్. అరె అని బెంగ పడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగా.. దర్జాగా ఇంటికి కాల్ చేసుకోవచ్చు. ఇలా.. ఎన్నో సౌకర్యాల్ని సూపర్‌ఫాస్ట్‌గా అందించేందుకు దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సరికొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చేస్తోంది. అదే.. హాయ్. పూర్తిగా చెప్పాలంటే.. హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్. విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లోని మొదటి ప్లాట్ఫామ్లో గురువారం నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి వస్తున్న హాయ్ సేవల విశేషాలివీ.. సాక్షి, విశాఖపట్నం: హాయ్ .. (హెచ్‌ఐఐ..హ్యూమన్ ఇంటరాక్టివ్ ఇంటర్ఫేస్) అని పిలిచే ఈ స్మార్ట్ డిజిటల్ కియోస్‌్క, డిజిటల్ బిల్ బోర్డు కలిసి ఉండేలా సేవలందించే ఓ సిస్టమ్. ఒడిశాకు చెందిన నెక్సైటీ స్టార్టప్ కంపెనీకి చెందిన బృందం దీన్ని రూపొందించింది. రైల్వే స్టేషన్లో సగటు ప్రయాణికుడు పొందాల్సిన అన్ని సౌకర్యాలు హాయ్ ద్వారా అందనున్నాయి. ఒకటో నంబర్ ప్లాట్ఫామ్లో గురువారం నుంచి హాయ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎలా ఉంటుందీ హాయ్..? ►ఒక్కో హాయ్ కియోస్‌్కలో 50 ఇంచీల ఎల్ఈడీ స్క్రీన్లు వెర్టికల్ మోడ్‌లో ఉంటాయి. ముందు, వెనుక భాగాల్లో రెండు స్క్రీన్లు ఉంటాయి. ►ముందు భాగంలోనూ, వెనుక భాగంలోనూ 6 చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. ►కియోస్క్ కుడి వైపున 10 ఇంచీల ఇంటరాక్టివ్ టేబుల్ ఉంటుంది. ►అదే విధంగా రెండు యూఎస్బీ పోర్టులు, ల్యాప్‌టాప్ చార్జింగ్ కోసం ఒక త్రీ పిన్ ప్లగ్ ఇంటరాక్టివ్ టేబుల్ కింద ఉంటుంది. హాయ్ అందించే సేవలివీ.. ►హాయ్ కియోస్క్ ద్వారా ఫ్రీగా కాల్స్ చేసుకోవచ్చు. ►మొబైల్స్‌కు కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఫుల్ ఛార్జింగ్ పూర్తయ్యేలా సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం ఉంది. ► రైళ్ల రాకపోకల టైం టేబుల్, ట్రైన్ రన్నింగ్ స్టేటస్‌ను కియోస్క్‌లో ఉన్న ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా తెలుసుకోవచ్చు. ►అదే విధంగా గూగుల్ మ్యాప్, సిటీ మ్యాప్‌లు ఇంటరాక్టివ్ ట్యాబ్లెట్లో పొందుపరిచి ఉన్నాయి. ఏయే ప్రాంతాల్లో, ఏ సందర్శనీయ స్థలాలున్నాయి? ఎక్కడికైనా వెళ్లాలంటా ఆ ప్రాంతం ఎంత దూరంలో ఉంది .. ఇలా ఏ వివరాలైనా క్షణాల్లో తెలుసుకోవచ్చు. ►ఫ్రీ కాల్స్ సౌకర్యం ఉన్నందున ప్రాంక్ కా ల్స్, ఫేక్ కాల్స్‌తో పాటు బెదిరింపు కా ల్స్ చేసే ప్రమాదముంది. అందుకే, కా ల్స్ చేసే ప్రతి ఒక్కరి ముఖాన్ని స్కాన్ చేస్తుంది. ఎవరు, ఎక్కడికి కాల్ చేశారో వారి ఫోటో నిక్షిప్తమవుతుంది. ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని కాల్ చెయ్యాలని ప్రయతి్న స్తే ఫోన్ కాల్ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకోసం 33 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ►ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రజోపయోగమైన సమాచారంతో పాటు ప్రకటనలు కూడా ప్రదర్శించవచ్చు. దీని ద్వారా వాల్తేరు డివిజన్‌కు ఆదాయం కూడా రానుంది. ప్రయాణికుల సౌకర్యం కోసమే.. రైల్వే ప్రయాణికులు స్టేషన్లలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార మార్గాల్ని అన్వేíÙంచాలని నిర్ణయించుకున్నాం. ఆ ఆలోచనలకు ప్రతిరూపమే హాయ్. రైల్వే స్టేషన్‌కు వచ్చిన సగటు ప్రయాణికుడు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సాఫీగా ప్రయాణం సాగించేలా హాయ్ డిజిటల్ కియోస్్కని రూపొందించాం. తొలిసారిగా విశాఖలో సేవలు ప్రారంభిస్తున్నాం. మిగిలిన రైల్వేస్టేషన్లకు విస్తరించేందుకు కృషి చేస్తాం. – చిరంజీవి నాయక్, నెక్సైటీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ -
పర్యాటకమా.. ఏదీ నీ చిరునామా!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే కార్యక్రమాలు పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచే ఉంటాయి. పర్యాటక ప్రాంతాలు సైతం రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల పర్యాటకులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు ఆకర్షితులవుతున్నారు. దీంతో వీరి సంఖ్య కూడా పెరుగుతోంది. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు నగరంతో పాటు తెలంగాణలోని ఇతర దర్శనీయ స్థలాలను తిలకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరు ఇక్కడి పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నగరంలో నడుస్తున్న టీఎస్‌టీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్లకు వెళితే ఎలాంటి సమాచారం లభించటంలేదు. దీనికి తోడు ఈ కేంద్రాల్లో ఉంటున్న కియోస్కో కేంద్రాలు మొరాయిస్తున్నాయి. దీంతో చేసేదేమీలేక పర్యాటక ప్రాంతాలను సందర్శించకుండానే వెనుదిరుగుతున్నారు. పది కేంద్రాల్లోనూ కన్పించని మెటీరియల్ టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్, పర్యాటక భవన్, కూకట్పల్లి, శిల్పారామం, దిల్సుఖ్నగర్, యాత్రీ నివాస్, ఎయిర్‌పోర్టు, కోల్‌కతా, చెన్నైలతో పాటు ఇటీవల నగరంలో హిమాయత్‌నగర్‌లోని టీఎస్‌టీడీసీ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్లో, సాలార్జంగ్ మ్యూజియం, మెహిదీపట్నంలలో నూతనంగా సీఆర్ఓ కేంద్రాలను ప్రారంభించారు. వీటికి టీఎస్టీడీసీలోని పబ్లిక్ రిలేషన్ అధికారులు ప్రచారం సామగ్రిని సరఫరా చేస్తారు. కానీ వారి దగ్గరే మెటీరియల్ లేకపోవటంతో చేతులెత్తేశారు. మూడేళ్లుగా కరువైన సామగ్రి.. 2014లో టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో బ్రోచర్స్, జిల్లా వైడ్ బ్రోచర్స్‌ను ముద్రించారు. వాటినే ఇంత వరకూ నడిపిస్తూ వస్తున్నారు. మూడేళ్లుగా ప్రచార బ్రోచర్స్ లేకపోవటంతో టీఎస్‌టీడీసీ పీఆర్వో కార్యాలయ అధికారులు పూర్వ (మొన్నటి వరకు) ఎండీగా ఉన్న క్రిస్టీనా ఛొంగ్తూకి పదిసార్లు నూతన బ్రోచర్స్ ప్రింటింగ్ కోసం ఫైల్ పెట్టారు. ఆమె పట్టించుకోకపోవటంతో ఆ సమస్య అలాగే ఉండిపోయింది. సీఆర్వో కేంద్రాల అధికారులు కూడా ఉన్నతాధికారులను అడిగి అడిగీ వదిలేశారు. ఇటీవల బషీర్‌బాగ్ సీఆర్వో కేంద్రానికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన టీఎస్‌టీడీసీ చైర్మన్ భూపతిరెడ్డి దృష్టికి కూడా అక్కడి అధికారులు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేదు. ఇటీవల ఎండీగా వచ్చి మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను పర్యటిస్తూ మార్పులకు శ్రీకారం చుడుతున్నా.. ఆయన కూడా ప్రచార బోచర్స్పై దృష్టి సారించకపోవటం గమనార్హం. హిమాయత్ నగర్‌లోని టీఎస్‌టీడీసీ భవన్లో ఉన్న సీఆర్వో కేంద్ర స్టాండ్‌లోనే ప్రచార బ్రోచర్ కనిపంచడం లేదు. ఆ స్టాండ్లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. మొరాయిస్తున్న కియోస్క్ యంత్రాలు.. నగరంలోని అన్ని టీఎస్‌టీడీసీ సీఆర్వో కేంద్రాల్లో కియోస్క్ యంత్రాలు ఉన్నాయి. వీటిలో టూరిస్టుల కోసం తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై సమగ్ర సమాచారం పొందుపరిచారు. కానీ ఆరునెలలుగా అవి పనిచేయటం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలూ లేవు. బుధవారం బషీర్‌బాగ్ సీఆర్వో కేంద్రంలోని కియోస్క్ యంత్రాలను ఆన్ చేసేందుకు అక్కడి సిబ్బంది ప్రత్నించినా ఫలితం శూన్యంగానే మారింది. అధికారులు ఏమంటున్నారంటే.. ఈ విషయమై ట్యాంక్‌బండ్, యాత్రీ నివాస్ సీఆర్వో కేంద్రాల్లో పని చేసే అధికారులను ప్రశ్నించగా.. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ట్రోచర్స్ అడుగుతున్నారని తెలిపారు. జిల్లా వైడ్ బ్రోచర్స్ లేవని చెప్పటంతో వెనుదిరిగిపోతున్నారని చెప్పారు. బ్రోచర్స్ విషయమై తమ ఎలాంటి సమాచారం లేదని టీఎస్‌టీడీసీ పీఆర్వో కార్యాలయ అధికారులు దాటేస్తున్నారు. -
రంగుపడుద్ది!
గోళ్లకు రకరకాల రంగులు వేసుకోవడం మగువలందరికీ ముచ్చటే. గోళ్లకు రంగులు వేసుకోవాలంటే, నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి, గోళ్లకు ఆ పాలిష్ పట్టించుకోవడం వరకు నానా తంటాలు పడుతుంటారు. కష్టపడి ఒక డిజైన్‌తో గోళ్లకు రంగులు వేసుకోగానే, అప్పటికే ఫ్యాషన్ ట్రెండ్ మారిపోతే నిరాశకు గురవుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే పోర్చుగల్ శాస్త్రవేత్తలు ఒక అద్భుత పరిష్కారాన్ని కనిపెట్టారు. ఈ ఫొటోలో ఏటీఎం మిషిన్ మాదిరిగా కనిపిస్తున్నదే ఆ పరిష్కారం. ఇది డిజిటల్ కియోస్క్. లిస్బన్లోని టెన్సేటర్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు దీనికి రూపకల్పన చేశారు. ఇందులో పదివేలకు పైగా నెయిల్ పాలిష్ రంగులు, డిజైన్లు ఉంటాయి. వీటితో తృప్తిపడకుంటే, నెయిల్‌పాలిష్ వేసుకోదలచిన యూజర్లు తమకు నచ్చిన డిజైన్లను పెన్‌డ్రైవ్‌లలో వెంట తీసుకుపోవచ్చు. పెన్‌డ్రైవ్‌లను దీనిలోని యూఎస్బీ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకుని తమకు నచ్చిన డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక పూర్తయ్యాక కియోస్క్ యంత్రంలో చేయి పట్టేందుకు అమర్చిన ఖాళీ జాగాలో చేతిని ఉంచితే చాలు. గోళ్లపై కోరుకున్న రంగులతో కూడిన డిజైన్లు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి.