ఊరూరా విత్తనాల ఏటీఎంలు! | Andhra Pradesh government to set up digital kiosks for farmers | Sakshi
Sakshi News home page

ఊరూరా విత్తనాల ఏటీఎంలు!

Published Tue, May 26 2020 5:35 AM | Last Updated on Tue, May 26 2020 6:38 AM

Andhra Pradesh government to set up digital kiosks for farmers - Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకుంటున్న చర్యల వల్ల వ్యవసాయ రంగ ముఖ చిత్రం మారుతోంది. 10,641 గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో అత్యాధునిక డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఈ నెల 30న  ప్రారంభం కానున్న ‘కియోస్క్‌’ల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. మార్కెటింగ్‌ సేవలు రైతులకు అందుతాయి. ‘ఏటీఎం’ల వంటి ఈ కియోస్క్‌ల ద్వారా ఉత్పాదకాలను రైతులకు అందిస్తున్నారు. ఇది దేశ చరిత్రలోనే తొట్ట తొలి ప్రయోగం.

2020 మే 30.. రెండు ప్రత్యేకతలు..
ఒకటి.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది.
రెండోది.. వ్యవసాయ రంగ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను (ఆర్‌బీకేలు) ఆయనే స్వయంగా ప్రారంభిస్తున్న రోజు.
దేశ చరిత్రలోనే ఇటువంటి ప్రయోగం తొలిసారి. వ్యవసాయం, అనుబంధ రంగాలకు చెందిన సమస్త వస్తువులు, సేవలు రైతు ఇంటి ముంగిటే దొరికేలా చేయడం ఈ కేంద్రాల విశిష్టత. పంట ఉత్పాదకత పెంపు మొదలు.. సాగు ఖర్చు తగ్గించడంలో కీలకమైన వ్యవసాయ పరికరాలు, సరైన సలహాలు, మేలైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, ఆక్వా ఫీడ్‌.. ఇలా ఒకటేమిటి.. చివరకు మార్కెటింగ్‌కు కూడా ఈ కేంద్రాలే మూల స్థానాలు. ఒక్క మాటలో చెప్పాలంటే వ్యవసాయ సమగ్ర కేంద్రాలు.

రైతు భరోసా కేంద్రాలు ‘హబ్‌ (గోదాము) అండ్‌ స్పోక్స్‌(రైతు భరోసా కేంద్రాలు)’ నమూనాలో నడుస్తాయి. ప్రతి జిల్లాలో 5 హబ్‌లు, ప్రతి గ్రామ సచివాలయంలో ఒక స్పోక్‌ (ఆర్‌బీకే) ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కేంద్రంలో అత్యాధునిక డిజిటల్‌ టచ్‌ స్క్రీన్‌ ‘కియోస్క్‌’లు ఉంటాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే.. రైతులకు తమ గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దగ్గర నుంచి మార్కెటింగ్‌ వరకు సమస్త సేవలు సులభంగా అందించే ‘ఏటీఎం’ల వంటివే ఈ ‘కియోస్క్‌’లు!
 
కియోస్క్‌లు ఎలా పని చేస్తాయంటే..
ఈ డిజిటల్‌ కియోస్క్‌ ఓ అత్యాధునిక ఏటీఎం లాంటిది. టచ్‌ స్క్రీన్, ఫ్రంట్‌ కెమేరా, ఆధార్‌తో అనుసంధానమైన ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్, మైక్రోఫోన్, స్పీకర్లు ఉంటాయి. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని– ధర్మల్‌ ప్రింటర్, ఆక్సిలరీ ఆడియో ఇన్‌పుట్, యూఎస్‌బీ చార్జింగ్‌ స్లాట్, ఏ–4 కలర్‌ ప్రింటర్, ఈ పాస్‌ మిషన్, ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డ్‌ రీడర్‌ నూ ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాకు ఐదు చొప్పున 65 ఆగ్రోస్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఒక్కో హబ్‌కు– దాని పరిథిలోని గ్రామాల రైతుల వివరాలను అనుసంధానం చేశారు.

కియోస్క్‌ను పరిశీలిస్తున్న ఏపీ వ్యవసాయ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌

టచ్‌ స్క్రీన్‌..
రైతు భరోసా కేంద్రంలోని డిజిటల్‌ కియోస్క్‌ ఎదుట రైతు నిలబడి స్క్రీన్‌ను వేలితో తాకి, ఫోన్‌ నంబరును ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. వివిధ కంపెనీలకు సంబంధించిన రకరకాల పంటల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా వంటి వాటి బొమ్మలు, వాటి ధరవరలు కియోస్క్‌ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. రైతు తాను కొనుగోలు చేయాలనుకుంటున్న వాటిని ఎంపిక చేసుకొని, ఎంత పరిమాణంలో కావాలో, ఎంత ధర అవుతున్నదో ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. అంతా ఓకే అనుకున్నాక క్లిక్‌ చేస్తే ఆర్డరు తయారవుతుంది. సమీపంలోని ఆగ్రోస్‌ కేంద్రానికి అంటే ‘హబ్‌’(గోదాము)కు తక్షణమే ఆ రైతు కొనుగోలు చేయదలచిన సరుకుల ఆర్డర్‌ వెళుతుంది. కియోస్క్‌ నుంచి ఆర్డరు వెళ్లిన తర్వాత ఆయా ఉత్పత్తులు గరిష్టంగా 48 నుంచి 72 గంటల్లోగా రైతులకు అందుతాయి. విత్తనాలను ఏపీ సీడ్స్‌ సంస్థ, మిగతా వాటిని ఆగ్రోస్‌ సెంటర్లు సరఫరా చేస్తాయి.

ఏమిటీ ‘హబ్, స్పోక్‌ మోడల్‌’?
ఆర్‌బీకేలోని అగ్రీ ఇన్‌పుట్‌ షాపు ఈ మోడల్‌లో పని చేస్తుంది. నిల్వ, ఇన్వెంటరీ, అమ్మకం, రాబడుల నిర్వహణ, సరకు రవాణా తదితరాలకు హాబ్‌లు గిడ్డంగులుగా ఉంటాయి. వర్చువల్‌ రిటైల్‌ స్టోర్లుగా స్పోక్స్‌ పని చేస్తాయి. రైతులు తమ ఆర్డర్లను ఇచ్చేందుకు ప్రతి ఆర్‌బీకేలో డిజిటల్‌ విధానంలో ఏర్పాటు చేసే కియోస్కే ఈ స్పోక్‌. ఈ కియోస్క్‌ మెషిన్‌ ఏటీఎం మాదిరిగా ఉంటుంది. దీని నుంచి రైతులు తమ వ్యవసాయానికి కావాల్సిన ఉత్పాదకాల(ఇన్‌పుట్స్‌)ను ఆర్డరు చేస్తే.. 48 నుంచి 72 గంటల (2–3 రోజుల)లోగా బట్వాడా చేస్తారు. కియోస్క్‌ ద్వారా విత్తనాలు తదితరాలను ఎంపిక చేసుకోవడం, ఆర్డర్‌ చేయడం వంటి విషయాలలో రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే, వీరికి తోడ్పడటానికి ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో ఉంటారు. గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్థక, మత్స్య శాఖల సహాయకులు రైతులకు సహాయపడతారు.

కియోస్క్‌ల ద్వారా సులువుగా సమస్త సమాచారం...
► మారుమూల గ్రామాల్లో కూడా డిజిటల్‌ కియోస్క్‌లు ఏర్పాటవుతున్నందున అక్కడి రైతులకు ఉత్పాదకాలతోపాటు సమగ్ర వ్యవసాయ సమాచారాన్ని సులువుగా అందించవచ్చు.
 

► వ్యవసాయ, అనుబంధ రంగాలకు అవసరమైన ఉత్పాదకాలను గ్రామ స్థాయిలోనే రైతులకు అందించవచ్చు.

► ఏయే వ్యవసాయోత్పత్తులకు మార్కెట్‌లో మున్ముందు మంచి ధర వచ్చే అవకాశం ఉంది (మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌)?, ప్రస్తుతం వివిధ మార్కెట్లలో ఏయే పంటలకు ఎంతెంత ధర పలుకుతోంది? ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? వంటి ముఖ్యమైన తాజా సమాచారాన్ని రైతులకు అందించవచ్చు.

► వాతావరణ సూచనలు, ఆయా ప్రాంతాల్లోని చీడ పీడల సమాచారాన్నీ అందించవచ్చు.

► భూ రికార్డులను అందుబాటులోకి తేవచ్చు.

► వివిధ పంటల సాగు సాంకేతిక మెళకువలను తెలియజెప్పే వీడియోలను ఈ కియోస్క్‌ల ద్వారా రైతులకు చూపవచ్చు.



రైతు భరోసా కేంద్రంలో ఏర్పాటైన కియోస్క్‌

– ఆకుల అమరయ్య, సాక్షి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement