బషీర్‌బాగ్ సీఆర్వో సెంటర్‌లో కియోస్క్ యంత్రాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే కార్యక్రమాలు పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచే ఉంటాయి. పర్యాటక ప్రాంతాలు సైతం రాష్ట్రంలో ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవల పర్యాటకులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు ఆకర్షితులవుతున్నారు. దీంతో వీరి సంఖ్య కూడా పెరుగుతోంది. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు నగరంతో పాటు తెలంగాణలోని ఇతర దర్శనీయ స్థలాలను తిలకించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరు ఇక్కడి పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకునేందుకు టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో నగరంలో నడుస్తున్న టీఎస్‌టీడీసీ సెంట్రల్ రిజర్వేషన్ సెంటర్లకు వెళితే ఎలాంటి సమాచారం లభించటంలేదు. దీనికి తోడు ఈ కేంద్రాల్లో ఉంటున్న కియోస్కో కేంద్రాలు మొరాయిస్తున్నాయి. దీంతో చేసేదేమీలేక పర్యాటక ప్రాంతాలను సందర్శించకుండానే వెనుదిరుగుతున్నారు.
పది కేంద్రాల్లోనూ కన్పించని మెటీరియల్
టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో బషీర్‌బాగ్, ట్యాంక్‌బండ్, పర్యాటక భవన్, కూకట్‌పల్లి, శిల్పారామం, దిల్‌సుఖ్‌నగర్, యాత్రీ నివాస్, ఎయిర్‌పోర్టు, కోల్‌కతా, చెన్నైలతో పాటు ఇటీవల నగరంలో హిమాయత్‌నగర్‌లోని టీఎస్‌టీడీసీ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో, సాలార్జంగ్ మ్యూజియం, మెహిదీపట్నంలలో నూతనంగా సీఆర్‌ఓ కేంద్రాలను ప్రారంభించారు. వీటికి టీఎస్‌టీడీసీలోని పబ్లిక్ రిలేషన్ అధికారులు ప్రచారం సామగ్రిని సరఫరా చేస్తారు. కానీ వారి దగ్గరే మెటీరియల్ లేకపోవటంతో చేతులెత్తేశారు.
మూడేళ్లుగా కరువైన సామగ్రి..
2014లో టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో బ్రోచర్స్, జిల్లా వైడ్ బ్రోచర్స్‌ను ముద్రించారు. వాటినే ఇంత వరకూ నడిపిస్తూ వస్తున్నారు. మూడేళ్లుగా ప్రచార బ్రోచర్స్ లేకపోవటంతో టీఎస్‌టీడీసీ పీఆర్వో కార్యాలయ అధికారులు పూర్వ (మొన్నటి వరకు) ఎండీగా ఉన్న క్రిస్టీనా ఛొంగ్తూకి పదిసార్లు నూతన బ్రోచర్స్ ప్రింటింగ్ కోసం ఫైల్ పెట్టారు. ఆమె పట్టించుకోకపోవటంతో ఆ సమస్య అలాగే ఉండిపోయింది. సీఆర్వో కేంద్రాల అధికారులు కూడా ఉన్నతాధికారులను అడిగి అడిగీ వదిలేశారు. ఇటీవల బషీర్‌బాగ్ సీఆర్వో కేంద్రానికి ఆకస్మిక తనిఖీకి వచ్చిన టీఎస్‌టీడీసీ చైర్మన్ భూపతిరెడ్డి దృష్టికి కూడా అక్కడి అధికారులు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేదు. ఇటీవల ఎండీగా వచ్చి మనోహర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను పర్యటిస్తూ మార్పులకు శ్రీకారం చుడుతున్నా.. ఆయన కూడా ప్రచార బోచర్స్‌పై దృష్టి సారించకపోవటం గమనార్హం. హిమాయత్ నగర్‌లోని టీఎస్‌టీడీసీ భవన్‌లో ఉన్న సీఆర్వో కేంద్ర స్టాండ్‌లోనే ప్రచార బ్రోచర్ కనిపంచడం లేదు. ఆ స్టాండ్‌లు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి.
మొరాయిస్తున్న కియోస్క్ యంత్రాలు..
నగరంలోని అన్ని టీఎస్‌టీడీసీ సీఆర్వో కేంద్రాల్లో కియోస్క్ యంత్రాలు ఉన్నాయి. వీటిలో టూరిస్టుల కోసం తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలపై సమగ్ర సమాచారం పొందుపరిచారు. కానీ ఆరునెలలుగా అవి పనిచేయటం లేదు. సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలూ లేవు. బుధవారం బషీర్‌బాగ్ సీఆర్వో కేంద్రంలోని కియోస్క్ యంత్రాలను ఆన్ చేసేందుకు అక్కడి సిబ్బంది ప్రత్నించినా ఫలితం శూన్యంగానే మారింది.
అధికారులు ఏమంటున్నారంటే..
ఈ విషయమై ట్యాంక్‌బండ్, యాత్రీ నివాస్ సీఆర్వో కేంద్రాల్లో పని చేసే అధికారులను ప్రశ్నించగా.. ఇక్కడికి వచ్చే పర్యాటకులు ట్రోచర్స్ అడుగుతున్నారని తెలిపారు. జిల్లా వైడ్ బ్రోచర్స్ లేవని చెప్పటంతో వెనుదిరిగిపోతున్నారని చెప్పారు. బ్రోచర్స్ విషయమై తమ ఎలాంటి సమాచారం లేదని టీఎస్‌టీడీసీ పీఆర్వో కార్యాలయ అధికారులు దాటేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment