రంగుపడుద్ది!
గోళ్లకు రకరకాల రంగులు వేసుకోవడం మగువలందరికీ ముచ్చటే. గోళ్లకు రంగులు వేసుకోవాలంటే, నెయిల్ పాలిష్ ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి, గోళ్లకు ఆ పాలిష్ పట్టించుకోవడం వరకు నానా తంటాలు పడుతుంటారు. కష్టపడి ఒక డిజైన్‌తో గోళ్లకు రంగులు వేసుకోగానే, అప్పటికే ఫ్యాషన్ ట్రెండ్ మారిపోతే నిరాశకు గురవుతుంటారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకే పోర్చుగల్ శాస్త్రవేత్తలు ఒక అద్భుత పరిష్కారాన్ని కనిపెట్టారు. ఈ ఫొటోలో ఏటీఎం మిషిన్ మాదిరిగా కనిపిస్తున్నదే ఆ పరిష్కారం. ఇది డిజిటల్ కియోస్క్. లిస్బన్‌లోని టెన్సేటర్ టెక్నాలజీ సెంటర్ శాస్త్రవేత్తలు దీనికి రూపకల్పన చేశారు.
ఇందులో పదివేలకు పైగా నెయిల్ పాలిష్ రంగులు, డిజైన్లు ఉంటాయి. వీటితో తృప్తిపడకుంటే, నెయిల్‌పాలిష్ వేసుకోదలచిన యూజర్లు తమకు నచ్చిన డిజైన్లను పెన్‌డ్రైవ్‌లలో వెంట తీసుకుపోవచ్చు. పెన్‌డ్రైవ్‌లను దీనిలోని యూఎస్‌బీ పోర్ట్ ద్వారా కనెక్ట్ చేసుకుని తమకు నచ్చిన డిజైన్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎంపిక పూర్తయ్యాక కియోస్క్ యంత్రంలో చేయి పట్టేందుకు అమర్చిన ఖాళీ జాగాలో చేతిని ఉంచితే చాలు. గోళ్లపై కోరుకున్న రంగులతో కూడిన డిజైన్లు క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి.