అవినీతి ఊడలు | corruption happen in panchayat works | Sakshi
Sakshi News home page

అవినీతి ఊడలు

Published Sat, Aug 9 2014 4:14 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

corruption happen in panchayat works

ఖమ్మం జెడ్పీసెంటర్: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇంజనీరింగ్ విభాగంలో ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన పనులు జరుగుతుంటాయి. వీటిలో అత్యధికంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిర్వహించిన తనిఖీలే స్పష్టం చేస్తున్నాయి.

కాంట్రాక్టర్లు, కొందరు ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై అభివృద్ది పనుల్లో నాణ్యతకు గండి కొడుతున్నారని, దీనికితోడు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఇంజనీరింగ్ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

 గత ఏడాది ఖమ్మం సబ్ డివిజన్ పరిధిలో రూ.12 కోట్ల వ్యయంతో 394 పనులు చేపట్టగా వాటిలో 83 పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో సుమారు రూ.8 లక్షల అవినీతి జరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గత ఆగస్టు నుంచి ఈ ఏడాది జూన్ వరకు మొత్తం రూ. 2.71 కోట్ల విలువైన 101 పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేయగా, 32 పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించారు.

 దీంతో కాంట్రాక్టర్ల నుంచి రూ.2.42 లక్షలు రికవరీ చేయాలని అధికారులకు రిపోర్టు అందజేశారు. పంచాయతీ రాజ్ శాఖలో చేపట్టిన పలు అభివృద్ది పనుల్లో అత్యధికంగా సిమెంట్ రోడ్లు, తారురోడ్ల నుంచే రికవరీలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

 పనుల్లో నాణ్యత పరిశీలనకై...
  పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం పని చేస్తుంది. ఖమ్మం పీఆర్ సర్కిల్ పరిధిలో రెండు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఇందులో ఒకటి ఖమ్మం సబ్ డివిజన్, మరొకటి భద్రాచలం సబ్ డివిజన్‌లో ఉంటాయి. ఒక్కొక్క సబ్ డివిజన్‌లో పరిధిలో 23 మండలాలు ఉంటాయి. ఈ డివిజన్‌లో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించేందుకు ఒక డీఈ, నలుగురు జేఈలు ఉంటారు.

 పరిశీలించే పనులు...
 పంచాయతీరాజ్ శాఖ చేపట్టే పనుల పోగ్రెస్ రిపోర్టు ఆధారంగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. నెలకు సుమారు 35 పనులను వీరు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మట్టిరోడ్లు, తారు, సిమెంట్ రోడ్లు, భవనాలు, కల్వర్టులు, వంతెనలు, డ్రెయిన్ పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. ఆయా అభివృద్ది పనులకు సంబంధించి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో వాటి నాణ్యతను పరీక్షిస్తారు. నాబార్డు, ఏసీడీపీ, సీడీపీ, బీఆర్‌జీఎఫ్, ఎస్‌డీఎఫ్, ఆర్‌ఆర్‌ఎం నిధులతో చేపట్టే పనులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో గ్రామ పంచాయతీ, ఆర్వీఎం భవనాలు, ప్రహరీల నిర్మాణాలను పరిశీలిస్తారు.

  రిపోర్టు ఇలా..
 ఆయా  అభివృద్ధి పనులను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు  నాణ్యతను పరిశీలన తరువాత లోపాలపై చేపట్టాల్సిన చర్యలను సంబందింత అధికారులకు సూచిస్తారు. సక్రమంగా పని చేయని కాంట్రాక్టర్ నుంచి సొమ్ము రికవ రీకి సంబంధిత ఈఈలకు నివేదిక అందజేస్తారు. పనులలో ఉపయోగించిన వస్తువుల నాణ్యత ఆధారంగా నాణ్యత లోపం విలువను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేస్తారు. 20 శాతం నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్య తీసుకునే అవకాశం ఉంది.

 రాజకీయ ఒత్తిళ్లే కారణం...!
 జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ది పనులు రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అత్యధిక మంది కాంట్రాక్టర్లు ద్వితీయ స్థాయి  రాజకీయ నాయకులే ఉన్నారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో నాణ్యత పాటించని వారిలో అత్యధిక మంది రాజకీయ నేతల అనుచరులే ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో చేపట్టే పనుల నాణ్యతపై ప్రశ్నించేందుకు పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు సాహసించడం లేదు. ఫలితంగా లక్షలు వెచ్చించి చేపట్టిన పలు రకాల రోడ్లు కొద్దిరోజులకే మరమ్మతులకు గురవుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ అధికారులపై రాజకీయ ఒత్తిడులు వస్తున్నందుకే వారు సరైన తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.

 తనిఖీల్లో రాజీ లేదు :  నవీన్‌కుమార్, క్వాలిటీ కంట్రోల్ డీఈ
 క్వాలిటీ కంట్రోల్ విభాగం అప్రమత్తంగా పని చేస్తోంది. తనిఖీల విషయంలో రాజీ పడేది లేదు. మాకు నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి స్ధాయిలో చేపడుతున్నాం. నాణ్యత  లోపాలు ఉన్నట్లు తేలితే వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్టు అందజేసి చర్యలు తీసుకోవాలని నివేదికలు పంపుతున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement