Department of Panchayati Raj
-
పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక.. 80,581 మందికి ఆస్తి సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ కంఠాల పరిధిలో రూ.లక్షలు విలువ చేసే ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండి.. దానికి ఎలాంటి హక్కు పత్రాల్లేని యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం సాంత్వన చేకూరుస్తోంది. వాటికి కొత్తగా యాజమాన్య హక్కుతో కూడిన ఆస్తి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. తొలి విడతగా 25 జిల్లాల పరిధిలోని 205 గ్రామాల్లో 80,581 మంది ఇళ్ల యజమానులకు వీటి జారీ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా వీటి జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష కార్యక్రమంలో భాగంగా సర్వే అనంతరం గ్రామ కంఠాల్లోని ఇళ్లకు సంబంధించి వాటి యజమానులకు స్థానిక తహసీల్దార్ ద్వారా ఈ ఆస్తి సర్టిఫికెట్ల జారీకి గత ఏడాదే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,078 గ్రామాల్లోని గ్రామకంఠాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. ఇందులో 987 గ్రామాల్లో డ్రోన్ సర్వే మ్యాప్‌ల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ ట్రూతింగ్) ప్రక్రియ కూడా ముగిసింది. ఒక్కో ఆస్తికి సంబంధించి సంబంధిత యజమాని ధృవీకరణ.. తదితర ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటివరకు.. బాపట్ల జిల్లా మినహా మిగిలిన 25 జిల్లాల పరిధిలోని 205 గ్రామాల్లో నోటిఫికేషన్ల జారీకి కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు తెలిపారు. అలాగే, గ్రామాల్లోని ఇళ్ల యజమానుల వారీగా ఆర్ఓఆర్ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ల జారీ పూర్తవుతుందని, ఆ వెంటనే తొలివిడతగా.. ఆయా గ్రామాల్లోని సంబంధిత యజమానులకు ప్రభుత్వం ఆస్తి సర్టిఫికెట్లను జారీచేస్తుందన్నారు. డిసెంబరు నాటికి దశల వారీగా అందరికీ.. ఇక దశల వారీగా డిసెంబరు కల్లా రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠాల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేసి ఆ పరిధిలో ఉండే ఇళ్లు, ఇళ్ల స్థలాలకు ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఏ నెలలో ఎన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్న దానిపై జిల్లాల వారీగా నిర్ధారించి, అందుకనుగుణంగా పనిచేయాలని జిల్లాల అధికారులకు సమాచారమిచ్చారు. -
అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు
సాక్షి, అమరావతి: తుపాను ప్రభావిత గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లోని 4,850 మంది పంచాయతీరాజ్ సిబ్బంది ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వీటిపై తగిన సూచనలు చేసేందుకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజాశంకర్ సోమవారం టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు బ్లీచింగ్ పౌడర్, సోడియం క్లోరైడ్ సిద్ధం చేశామని చెప్పారు. పూర్తిగా క్లోరినేషన్ చేసిన తర్వాతే తాగునీటి సరఫరా చేస్తున్నట్టు వివరించారు. -
‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్
సాక్షి, అమరావతి: సచివాలయాల వ్యవస్థ ఏర్పాటు తర్వాత మన రాష్ట్రంలో పైరవీలకు తావులేని పాలన నడుస్తోంది. ఫలితంగా గ్రామ పాలన వికసిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ‘స్థానిక పాలనా పరిస్థితుల’ ఆధారంగా ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే అవార్డులలో ఈ ఏడాది మన రాష్ట్రం ఏకంగా 17 అవార్డులను దక్కించుకుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ నిర్వహించే సమావేశంలో శనివారం ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. అవార్డుల పోటీలో దేశవ్యాప్తంగా 74 వేల గ్రామ పంచాయతీలు పోటీ పడినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించింది. చదవండి: తుపాన్లతో దెబ్బతిన్న రోడ్లకు వేగంగా మరమ్మతులు సీఎం సహాయ నిధికి రూ.1.33 కోట్ల విరాళం -
‘సచివాలయ’ ఖాళీల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి..
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రభుత్వం అప్పగించింది. గతంలో రెండు విడతలుగా సచివాలయ ఉద్యోగాలను పంచాయతీరాజ్‌శాఖ భర్తీచేసింది. ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను భర్తీచేసే బాధ్యతను ఇప్పుడు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంచాయతీరాజ్‌శాఖ నెలరోజుల కిందటే వివిధ శాఖాధిపతులకు తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేసే వీఆర్వో, విలేజి సర్వేయర్ గ్రేడ్–3 పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి పంపాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం రాత్రి శాఖాధిపతులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు సీసీఎల్ఏ, సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో పనిచేసేందుకు మొత్తం 19 విభాగాల్లో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్‌శాఖ 2019 జూలైలోను, 2020 జనవరిలోను నోటిఫికేషన్లు ఇచ్చి రాతపరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీచేసింది. ఇంకా మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్లు, రాతపరీక్షల వివరాలతో మే నెల 30న ఏపీపీఎస్సీ కేలండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు. -
వడివడిగా ‘వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్’ నిర్మాణం
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ (హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు) ఏర్పాటు చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సుమారు 7,400 పీహెచ్సీ సబ్‌సెంటర్లు ఉండేవి. అవి కూడా 90 శాతం అద్దె భవనాల్లో కునారిల్లుతుండేవి. వాటి సంఖ్యను 10,011కు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం 8,585 హెల్త్ క్లినిక్స్‌కు సొంత భవనాలను సమకూరుస్తోంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,692 కోట్లు కేటాయించింది. ఇప్పటికే 641 భవనాల నిర్మాణం పూర్తికాగా.. 803 భవనాలు స్లాబ్ దశ దాటాయి. మరో 4,031 భవనాలు పిల్లర్స్ దశకు రావాల్సి ఉంది. ఈ నెలాఖరు నాటికి 848 భవనాలను, జూన్ నాటికి మరో 4,531 భవనాలను, సెప్టెంబర్ నాటికి 3,206 భవనాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఇవి పూర్తయితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. -
వ్యర్థంపై యుద్ధం
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి అంటువ్యాధులకు అవకాశం లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చి అంటువ్యాధుల వ్యాప్తి దాదాపు 90% తగ్గుముఖం పట్టినట్లు నిర్ధారణ కావడంతో ఈ తరహా కార్యక్రమాలు కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ‘వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం’ పేరిట ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం పురస్కరించుకుని డిసెంబర్ 21న ఈ కార్యక్రమ ముగింపుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలసి అన్ని గ్రామ సచివాలయ కార్యాలయాల వద్ద గ్రామస్తులతో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఒక కార్యాచరణను రూపొందించారు. 90 శాతం మేర తగ్గిన అంటువ్యాధులు.. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకుముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలతో.. 90 శాతం మేర అంటు వ్యాధుల వ్యాప్తి తగ్గినట్టు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్ చేయడం, మురుగు కాల్వల్లో పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటివి సత్ఫలితాలనిచ్చాయి. వ్యర్థాలకు కారకులతో రోజుకొక సమావేశం.. గ్రామాల్లో పెద్దమొత్తంలో వ్యర్థాలు ఏర్పడడానికి కారణమయ్యే వారితో పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీ సిబ్బంది సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన కలిగిస్తారు. షాపు యజమానులు, తోపుడు బండ్లపై కూరగాయల విక్రయం వంటి వ్యాపారాలు చేసుకునేవారు, శ్రమశక్తి సంఘాలు, విద్యార్థులు, రైతులు తదితర కేటగిరీల వారీగా ఈ సమావేశాలు నిర్వహించి ఇష్టానుసారం వ్యర్థాలను వదిలివేయడం వల్ల ఇతరులకు కలిగే ఇబ్బందులతో పాటు వాటి ద్వారా కలిగే దు్రష్పభావాలపై అవగాహన కలిగించనున్నట్లు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమ నిర్వహణకు నోడల్ అధికారిగా నియమితులైన దుర్గాప్రసాద్ తెలిపారు. తొలిరోజు జిల్లా స్థాయిలో.. డిసెంబర్ 2వ తేదీ తొలిరోజు అన్ని జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులతో సమావేశం నిర్వహించి వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం ఉద్దేశాలను వారికి వివరించి ఈ కార్యక్రమంపై అవగాహన కలిగిస్తారు. 3న మండల స్థాయిలో, 4న గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 7–19 వ తేదీ మధ్య.. గ్రామాల్లో రోజుకొక కేటగిరీకి చెందిన వ్యక్తులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించి అవగాహన కలిగిస్తారు. 21న చివరిరోజు సీఎం జన్మదినం సందర్భంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద గ్రామస్తులందరి సమక్షంలో ఈ కార్యక్రమ ఉద్దేశాలపై సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానిస్తారు. -
30 కి.మీ. పరిధిలోనే పరీక్ష కేంద్రం
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 30 కి.మీ. దూరం మించకుండా పరీక్ష కేంద్రాలను కేటాయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మహిళా అభ్యర్థులతో పాటు మొత్తం 4.57 లక్షల మంది వరకు దరఖాస్తు చేసుకున్న కేటగిరి–1 ఉద్యోగాల అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని అధికారులు రాత పరీక్ష కేంద్రాలను ఎంపిక చేశారు. సెరికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు కేవలం 680 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడంతో జిల్లాకొక కేంద్రంలోనే ఆ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. రాతపరీక్ష కేంద్రాల ఎంపిక ఇప్పటికే దాదాపు పూర్తయినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. ఈనెల 20 – 26వ తేదీల మధ్య ఏడు రోజుల పాటు రెండు పూటలా 14 రకాల రాతపరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ► మొత్తం 16,208 ఉద్యోగాలకు 10,63,168 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి రోజు ఉదయం కేటగిరి –1 పోస్టులకు 2,228 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4.57 లక్షల మంది పరీక్ష రాయనున్నారు. తొలిరోజు మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.24 లక్షల మంది 1,067 కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారు. ► రెండో రోజు నుంచి ఒక్కొక్క రాతపరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మేరకు గరిష్టంగా 516, కనిష్టంగా 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► అభ్యర్థులు రవాణా ఇబ్బందులు పడకుండా రాత పరీక్షల సమయంలో అన్ని ప్రాంతాలకు బస్సులు నడపాలంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇప్పటికే లేఖ రాశారు. ► కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలోనూ కనీసం ఒక గదిని ఐసోలేషన్ కోసం కేటాయించి, అక్కడ ఇన్విజిలేటర్లకు పీపీఈ కిట్లను కూడా అందుబాటులో ఉంచుతారు. ► రాతపరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సి ఉందని, ఈ మేరకు హాల్‌టికెట్‌లో కూడా స్పష్టమైన సూచన చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. -
మండల, జిల్లా పరిషత్‌లకూ ఆర్థిక సంఘం నిధులు
సాక్షి, అమరావతి: ఐదేళ్లుగా నిధుల విడుదల నిలిచిపోవడంతో నీరసించిన మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్తులకు ఆర్థిక ఆసరా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్రం ఈ ఏడాది పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేసే నిధులలో 15 శాతం మండల పరిషత్‌లకు, మరో 15 శాతం జిల్లా పరిషత్‌లకు, 70 శాతం గ్రామ పంచాయతీలకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఏడాది రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థలకు రూ.2,625 కోట్లను కేంద్రం కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 660 మండల పరిషత్‌లకు రూ.393.75 కోట్లు అందనున్నాయి. 13 జిల్లా పరిషత్‌లకు మరో రూ.393.75 కోట్లు కేటాయిస్తారు. రాష్ట్రంలోని 13,371 గ్రామ పంచాయతీలకు రూ.1,837.5 కోట్లు జనాభా ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖ కేటాయించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2015 నుంచి నిలిచిన నిధులు.. 2015 ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపులు నిలిచిపోయాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా వంద శాతం నిధులు గ్రామ పంచాయతీలకే కేటాయించారు. మండల, జిల్లా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని కేంద్రం సూచించినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. దీంతో జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ ప్రెసిడెంట్లు అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మారారనే విమర్శలున్నాయి. మరోవైపు పంచాయతీలకు నిధులు సమృద్ధిగా అందుబాటులో ఉండటంతో సర్పంచులు అధికారం చలాయించారు. అయితే 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు నిధుల కేటాయింపుపై నిర్ణయాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు 70 : 15 : 15 నిష్పత్తిలో నిధులు కేటాయించేందుకు రాష్ట్రం అనుమతి తీసుకుంది. ఈసారి మరో మెలిక.. పంచాయతీరాజ్ సంస్థలకిచ్చే నిధులలో 50 శాతం బేసిక్ గ్రాంట్స్ రూపంలో, మిగిలిన 50 శాతం టైడ్ గ్రాంట్స్ రూపంలో విడుదల చేయనున్నట్టు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖలు రాసింది. బేసిక్ గ్రాంట్ నిధులను గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఓడీఎఫ్ కార్యక్రమాల అమలుకు వ్యయం ఆధారంగా టైడ్ గ్రాంట్స్‌ను రెండు విడతల్లో విడుదల చేయనున్నట్లు కేంద్రం లేఖలో స్పష్టం చేసింది. -
ఈ నెలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
సాక్షి, అమరావతి : హైకోర్టు తీర్పు అనంతర పరిణామాలను బేరీజు వేసుకుని, ఈ నెలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికల నిర్వహణను చేపట్టేలా.. రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ సోమవారం సాయంత్రం నుంచి కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఖరారు చేసేందుకు హైకోర్టు 30 రోజులు గడువు ఇచ్చినప్పటికీ, ఒకటెండ్రు రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని అధికారులు భావిస్తున్నారు. 2018 ఆగస్టు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరపని కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.3,710 కోట్లు.. నగర, మున్సిపాలిటీలకు మరో రూ.1,400 కోట్ల మేర నిధులు నిలిచిపోయాయి. దీంతో మార్చి నెలాఖరులోగా ఆ నిధులను విడుదల చేసేలా ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలపై పంచాయతీరాజ్ అధికారులతో సీఎంవో అధికారులు చర్చించారు. అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ, రిజర్వేషన్ల ఖరారుపై చర్చించారు. కాగా, రిజర్వేషన్లు ఖరారు కాగానే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి.. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. -
సచివాలయ ఉద్యోగాలకు రేపు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 15,971 పోస్టుల భర్తీకి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. పాత పద్ధతి, మార్గదర్శకాల ప్రకారమే భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలు ఉండగా, వాటిలో ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలను ఆయా శాఖల నుంచి పంచాయతీరాజ్ శాఖ బుధవారం తెప్పించుకుంది. వీటిలో అత్యధికంగా 6,916 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. గ్రామ ఉద్యాన అసిస్టెంట్ పోస్టులు 1,746, విలేజీ సర్వేయర్ పోస్టులు 1,234, పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు 1,122 చొప్పున ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది ఆగస్ట్–సెప్టెంబర్ మధ్య జరిగిన నియామక ప్రక్రియలో దాదాపు 15,971 పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోగా, ఆ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 3 వేలకు పైగా పోస్టులు అదనం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ సచివాలయాలకు అదనంగా మరో 300 నూతన సచివాలయాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో మరో 3 వేలకు పైగా సచివాలయ ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. వాటిని కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
పంచాయతీ ఎన్నికల్లో.. బీసీలకు 34% రిజర్వేషన్లు
సాక్షి, అమరావతి: రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. 2011 జనగణన వివరాల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రిజర్వు స్థానాలు గుర్తించేది ఇలాగే.. ►రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తారు. బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఆ కేటగిరికి చెందిన ఓటర్ల వివరాల ప్రకారం కేటాయింపులు జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు. ►జడ్పీ చైర్మన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా.. జడ్పీటీసీ రిజర్వేషన్లు జిల్లా యూనిట్‌గాను.. ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల యూనిట్‌గానూ.. వార్డు సభ్యుల రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ యూనిట్‌గా తీసుకుంటారు. యూనిట్‌గా అంటే ఆ ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కలు లేదా ఓటర్ల వివరాల మేరకు జరుగుతుంది. ►మండల పరిషత్ అధ్యక్ష పదవులకు అయితే.. రాష్ట్రంలో 660 మండల పరిషత్‌లు ఉండగా, ఏ జిల్లాకు ఎన్ని మండలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల కింద కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించి, ఆయా జిల్లా కలెక్టర్లకు తెలియజేస్తారు. కలెక్టరు ఆ జిల్లాలో ఏ మండలం ఏ కేటగిరికి రిజర్వు చేసేది నిర్ణయిస్తారు. ►జడ్పీటీసీ పదవులకు అయితే.. ఆ జిల్లాలో ఉండే మొత్తం పదవులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన (ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6,77 శాతం, బీసీలకు 34 శాతం, మిగిలినవి జనరల్ కేటగిరి) మేరకు జిల్లా కలెక్టరే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. ►ఎంపీటీసీ పదవులకు అయితే.. జిల్లాలో ఉండే మొత్తం పదవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఏ కేటగిరికి ఎన్ని పదువుల కేటాయించాలన్నది నిర్ణయిస్తే.. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఉన్న స్థానాలను ఏ కేటగిరికి ఎన్ని కేటాయించాలన్నది నిర్ణయిస్తారు. ►ఇక సర్పంచి పదవులను జిల్లాల వారీగా ఎన్ని కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఏఏ పంచాయతీలను ఏఏ కేటగిరికి కేటాయించేది నిర్ణయిస్తారు. ►చివరిగా.. వార్డు సభ్యుల రిజర్వేషన్లను గ్రామాల వారీగా ఏ కేటగిరికి ఎన్ని కేటాయించేది ఆర్డీవో అధికారి నిర్ణయిస్తే.. వార్డుల వారీగా ఏ వార్డును ఏ కేటగిరికి కేటాయించేది ఎంపీడీవో నిర్ణయిస్తారు. -
నేడు వెబ్సైట్లో షార్ట్‌లిస్టులు
సాక్షి, అమరావతి : ‘సచివాలయ’ పరీక్షల్లో పాసైన వారి వివరాలతో జిల్లాల వారీగా షార్ట్‌లిస్టు జాబితాలను ఆయా జిల్లా కలెక్టర్లు శనివారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వెయిటేజీ మార్కులతో కలిపి అభ్యర్థులకు రాత పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలు ఆయా జిల్లా కలెక్టర్లకు శుక్రవారం చేరాయి. జిల్లాల వారీగా పోస్టులు, రిజర్వేషన్ల మేరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ వాటిని పరిశీలించి ఉద్యోగాలకు అర్హులైన వారి వివరాలతో కూడిన షార్ట్‌లిస్టును శనివారం ఉ.11 గంటలకు వెబ్సైట్లో ఉంచనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. జాబితాలో పేరున్న వారికి జిల్లా సెలక్షన్ కమిటీ కాల్ లెటర్లను అభ్యర్థుల మెయిల్‌కు పంపిస్తారు. షార్ట్ లిస్టులో పేరున్న అభ్యర్థులు ఈనెల 21, 22 తేదీల్లో తమ ఒరిజినల్ సర్టిఫికెట్ల స్కాన్డ్ కాపీలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. మరోవైపు.. ఎంపికైన అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిమిత్తం ప్రతీ జిల్లాలో ఒక కేంద్రాన్ని ఏర్పాటుచేసుకోవాలని జిల్లా పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. 23, 24, 25 తేదీల్లో జరిగే సరిఫ్టికెట్ల వెరిఫికేషన్‌లో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారు. ఇందులో అన్ని ధృవీకరణ పత్రాలు చూపించిన అభ్యర్థులకు ఆ రోజు సాయంత్రానికి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే బాధ్యతను జిల్లా సెలక్షన్ కమిటీలకే అప్పగించారు. ఇవి అందుకున్న అభ్యర్థులు అక్టోబర్ 1, 2 తేదీల్లో జరిగే శిక్షణ కార్యక్రమానికి హాజరై, రెండో తేదీనే విధుల్లో చేరాలి. (చదవండి: ఫలితాల్లోనూ రికార్డ్) -
హరితహారం చెట్లపై హక్కు వారిదే!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్థలాల్లో హరితహారం కింద నాటిన ఉద్యాన చెట్లపై భూములు లేని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితర బడుగు వర్గాలకు హక్కు కల్పిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ స్థలాలు, సామాజిక భూములు తదితర చోట్ల అటవీకరణకు ప్రభుత్వం ఉపాధి హామీ పథకం అనుసంధానంతో హరితహారం కింద మొక్కలు నాటుతోంది. వీటిపై పట్టా ఇచ్చి.. వచ్చే పండ్లు, కలప తదితర ఫలాలను అనుభవించేందుకు ఈ అవకాశం కల్పించింది. ఈ పథకాన్ని ఉపాధిహామీ కింద అమలుచేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీచేసింది. ప్రభుత్వ భూముల పరిరక్షణతోపాటు పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అన్ని ప్రభుత్వ భూములను ఈ పథకం కింద నిర్ణీత వర్గాలకు చెందిన పేదలకు చెట్లపై పట్టా అందజేస్తారు. ఉపాధి హామీ పథకం ద్వారా లబ్ధిదారుల గుర్తింపు.. రోడ్లు, కాలువ పక్కన భూములు, ఇతర బీడు భూముల్లోని చెట్లపై సర్కార్ ఈ పథకం కింద లబ్ధిదారులకు పట్టా ఇవ్వనుంది. చెట్లపై పట్టా పొందాలంటే ఉపాధిహామీ పథకం కింద కనీసం 20 రోజులు గతేడాది లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పనిచేసి ఉండాలి. లబ్ధిదారులను ఉపాధిహామీ పథకం సిబ్బంది గుర్తిస్తారు. అందుబాటులో ఉన్న భూమిని గుర్తించి లబ్ధిదారులకు వాటిని కేటాయించే బాధ్యత తీసుకుంటారు. లబ్ధిదారులు, భూముల గుర్తింపును గ్రామసభలో పెట్టి ఆమోదం తీసుకోవాలి. అనంతరం భూములు, లబ్ధిదారుల జాబితా తయారుచేస్తారు. ప్రతి ఏడాది మే నెలలో ఈ ప్రక్రియ కింద లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ చేపడతారు. -
అవినీతి ఊడలు
ఖమ్మం జెడ్పీసెంటర్: పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. ఇంజనీరింగ్ విభాగంలో ప్రతి ఏటా కోట్లాది రూపాయల విలువైన పనులు జరుగుతుంటాయి. వీటిలో అత్యధికంగా నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని క్వాలిటీ కంట్రోల్ అధికారులు నిర్వహించిన తనిఖీలే స్పష్టం చేస్తున్నాయి. కాంట్రాక్టర్లు, కొందరు ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై అభివృద్ది పనుల్లో నాణ్యతకు గండి కొడుతున్నారని, దీనికితోడు రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఇంజనీరింగ్ అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది ఖమ్మం సబ్ డివిజన్ పరిధిలో రూ.12 కోట్ల వ్యయంతో 394 పనులు చేపట్టగా వాటిలో 83 పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో సుమారు రూ.8 లక్షల అవినీతి జరిగిందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. గత ఆగస్టు నుంచి ఈ ఏడాది జూన్ వరకు మొత్తం రూ. 2.71 కోట్ల విలువైన 101 పనులను క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీ చేయగా, 32 పనుల్లో నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో కాంట్రాక్టర్ల నుంచి రూ.2.42 లక్షలు రికవరీ చేయాలని అధికారులకు రిపోర్టు అందజేశారు. పంచాయతీ రాజ్ శాఖలో చేపట్టిన పలు అభివృద్ది పనుల్లో అత్యధికంగా సిమెంట్ రోడ్లు, తారురోడ్ల నుంచే రికవరీలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. పనుల్లో నాణ్యత పరిశీలనకై... పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే పలు అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా క్వాలిటీ కంట్రోల్ విభాగం పని చేస్తుంది. ఖమ్మం పీఆర్ సర్కిల్ పరిధిలో రెండు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు ఉంటాయి. ఇందులో ఒకటి ఖమ్మం సబ్ డివిజన్, మరొకటి భద్రాచలం సబ్ డివిజన్లో ఉంటాయి. ఒక్కొక్క సబ్ డివిజన్లో పరిధిలో 23 మండలాలు ఉంటాయి. ఈ డివిజన్లో చేపట్టిన అభివృద్ది పనులను పరిశీలించేందుకు ఒక డీఈ, నలుగురు జేఈలు ఉంటారు. పరిశీలించే పనులు... పంచాయతీరాజ్ శాఖ చేపట్టే పనుల పోగ్రెస్ రిపోర్టు ఆధారంగా క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారు. నెలకు సుమారు 35 పనులను వీరు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మట్టిరోడ్లు, తారు, సిమెంట్ రోడ్లు, భవనాలు, కల్వర్టులు, వంతెనలు, డ్రెయిన్ పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తారు. ఆయా అభివృద్ది పనులకు సంబంధించి నమూనాలను సేకరించి ప్రయోగశాలలో వాటి నాణ్యతను పరీక్షిస్తారు. నాబార్డు, ఏసీడీపీ, సీడీపీ, బీఆర్జీఎఫ్, ఎస్డీఎఫ్, ఆర్ఆర్ఎం నిధులతో చేపట్టే పనులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఎన్ఆర్ఈజీఎస్లో గ్రామ పంచాయతీ, ఆర్వీఎం భవనాలు, ప్రహరీల నిర్మాణాలను పరిశీలిస్తారు. రిపోర్టు ఇలా.. ఆయా అభివృద్ధి పనులను పరిశీలించిన క్వాలిటీ కంట్రోల్ అధికారులు నాణ్యతను పరిశీలన తరువాత లోపాలపై చేపట్టాల్సిన చర్యలను సంబందింత అధికారులకు సూచిస్తారు. సక్రమంగా పని చేయని కాంట్రాక్టర్ నుంచి సొమ్ము రికవ రీకి సంబంధిత ఈఈలకు నివేదిక అందజేస్తారు. పనులలో ఉపయోగించిన వస్తువుల నాణ్యత ఆధారంగా నాణ్యత లోపం విలువను కాంట్రాక్టర్ నుంచి రికవరీ చేస్తారు. 20 శాతం నాణ్యత లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై చర్య తీసుకునే అవకాశం ఉంది. రాజకీయ ఒత్తిళ్లే కారణం...! జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ది పనులు రాజకీయ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అత్యధిక మంది కాంట్రాక్టర్లు ద్వితీయ స్థాయి రాజకీయ నాయకులే ఉన్నారు. ఇటీవల చేపట్టిన తనిఖీల్లో నాణ్యత పాటించని వారిలో అత్యధిక మంది రాజకీయ నేతల అనుచరులే ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో చేపట్టే పనుల నాణ్యతపై ప్రశ్నించేందుకు పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు సాహసించడం లేదు. ఫలితంగా లక్షలు వెచ్చించి చేపట్టిన పలు రకాల రోడ్లు కొద్దిరోజులకే మరమ్మతులకు గురవుతున్నాయి. క్వాలిటీ కంట్రోల్ అధికారులపై రాజకీయ ఒత్తిడులు వస్తున్నందుకే వారు సరైన తనిఖీలు చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. తనిఖీల్లో రాజీ లేదు : నవీన్‌కుమార్, క్వాలిటీ కంట్రోల్ డీఈ క్వాలిటీ కంట్రోల్ విభాగం అప్రమత్తంగా పని చేస్తోంది. తనిఖీల విషయంలో రాజీ పడేది లేదు. మాకు నిర్ధేశించిన లక్ష్యాలు పూర్తి స్ధాయిలో చేపడుతున్నాం. నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలితే వెంటనే సంబంధిత అధికారులకు రిపోర్టు అందజేసి చర్యలు తీసుకోవాలని నివేదికలు పంపుతున్నాం.