సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కి ప్రభుత్వం అప్పగించింది. గతంలో రెండు విడతలుగా సచివాలయ ఉద్యోగాలను పంచాయతీరాజ్‌శాఖ భర్తీచేసింది. ఇంకా వివిధ విభాగాల్లో మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను భర్తీచేసే బాధ్యతను ఇప్పుడు ప్రభుత్వం ఏపీపీఎస్సీకి అప్పగించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పంచాయతీరాజ్‌శాఖ నెలరోజుల కిందటే వివిధ శాఖాధిపతులకు తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో రెవెన్యూ శాఖ పరిధిలో పనిచేసే వీఆర్వో, విలేజి సర్వేయర్ గ్రేడ్–3 పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి పంపాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి మంగళవారం రాత్రి శాఖాధిపతులకు మెమో ఉత్తర్వులు జారీచేశారు.
ఈ మేరకు సీసీఎల్‌ఏ, సర్వే సెటిల్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా 15 వేలకుపైగా గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, వాటిలో పనిచేసేందుకు మొత్తం 19 విభాగాల్లో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసిన విషయం తెలిసిందే. పంచాయతీరాజ్‌శాఖ 2019 జూలైలోను, 2020 జనవరిలోను నోటిఫికేషన్లు ఇచ్చి రాతపరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీచేసింది. ఇంకా మిగిలిన దాదాపు 8,500 ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్లు, రాతపరీక్షల వివరాలతో మే నెల 30న ఏపీపీఎస్సీ కేలండర్ విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు.
‘సచివాలయ’ ఖాళీల భర్తీ బాధ్యత ఏపీపీఎస్సీకి..
Published Thu, Apr 22 2021 3:25 AM | Last Updated on Thu, Apr 22 2021 3:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment