సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని గ్రామ కంఠాల పరిధిలో రూ.లక్షలు విలువ చేసే ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండి.. దానికి ఎలాంటి హక్కు పత్రాల్లేని యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం సాంత్వన చేకూరుస్తోంది. వాటికి కొత్తగా యాజమాన్య హక్కుతో కూడిన ఆస్తి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియకు శ్రీకారం చుడుతోంది. తొలి విడతగా 25 జిల్లాల పరిధిలోని 205 గ్రామాల్లో 80,581 మంది ఇళ్ల యజమానులకు వీటి జారీ ప్రక్రియ కొలిక్కి వచ్చిందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. వచ్చే నెలలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వీటి జారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష కార్యక్రమంలో భాగంగా సర్వే అనంతరం గ్రామ కంఠాల్లోని ఇళ్లకు సంబంధించి వాటి యజమానులకు స్థానిక తహసీల్దార్ ద్వారా ఈ ఆస్తి సర్టిఫికెట్ల జారీకి గత ఏడాదే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చట్టం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 2,078 గ్రామాల్లోని గ్రామకంఠాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది.
ఇందులో 987 గ్రామాల్లో డ్రోన్ సర్వే మ్యాప్‌ల ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్ ట్రూతింగ్) ప్రక్రియ కూడా ముగిసింది. ఒక్కో ఆస్తికి సంబంధించి సంబంధిత యజమాని ధృవీకరణ.. తదితర ప్రక్రియలన్నీ పూర్తయ్యాయి. ఇప్పటివరకు.. బాపట్ల జిల్లా మినహా మిగిలిన 25 జిల్లాల పరిధిలోని 205 గ్రామాల్లో నోటిఫికేషన్ల జారీకి కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
అలాగే, గ్రామాల్లోని ఇళ్ల యజమానుల వారీగా ఆర్‌ఓఆర్ నోటిఫికేషన్ జారీ ప్రక్రియ పురోగతిలో ఉందన్నారు. ఈ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ల జారీ పూర్తవుతుందని, ఆ వెంటనే తొలివిడతగా.. ఆయా గ్రామాల్లోని సంబంధిత యజమానులకు ప్రభుత్వం ఆస్తి సర్టిఫికెట్లను జారీచేస్తుందన్నారు.
డిసెంబరు నాటికి దశల వారీగా అందరికీ..
ఇక దశల వారీగా డిసెంబరు కల్లా రాష్ట్రవ్యాప్తంగా గ్రామకంఠాల్లో సర్వే ప్రక్రియను పూర్తిచేసి ఆ పరిధిలో ఉండే ఇళ్లు, ఇళ్ల స్థలాలకు ఆస్తి సర్టిఫికెట్లు ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక సిద్ధంచేసుకుంది. ఏ నెలలో ఎన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్న దానిపై జిల్లాల వారీగా నిర్ధారించి, అందుకనుగుణంగా పనిచేయాలని జిల్లాల అధికారులకు సమాచారమిచ్చారు.
పంచాయతీరాజ్ శాఖ ప్రణాళిక.. 80,581 మందికి ఆస్తి సర్టిఫికెట్లు
Published Mon, Feb 20 2023 4:45 AM | Last Updated on Mon, Feb 20 2023 9:58 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment