సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 లక్షలకు పైబడి విలువ చేసే ఇల్లు ఉండి కూడా పిల్లల పెద్ద చదువుల కోసమో, ఇంకే పెద్ద అవసరానికైనా ఆ ఇంటిని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందే అవకాశం లేక ఇబ్బందులు పడే లక్షలాది మధ్య తరగతి ప్రజల కష్టాలు తీరబోతున్నాయి. వైఎస్సార్ జగనన్న భూ హక్కు – భూ రక్ష కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్ల యజమానులందరికీ వారి ఆస్తి యాజమాన్య హక్కు పత్రాల (ప్రాపర్టీ కార్డులు)ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తోంది. ఈ పత్రాలను బ్యాంకుల్లో తనఖా పెట్టుకోవడానికి బ్యాంకులను సైతం ప్రభుత్వం తాజాగా ఒప్పించింది.
ఈ పత్రాల డిజైన్‌ను కూడా రుణాలు సులభంగా లభించేలా రూపొందించారు. ఈ హక్కు పత్రాలను అవసరమైన వారు నచ్చిన బ్యాంకులో తనఖా పెట్టుకొనేందుకు గతనెల 27న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో రాష్ట్ర బ్యాంకర్ల సమాఖ్య ఆమోదం తెలిపింది. ఈ సమాచారాన్ని రాష్ట్ర బ్యాంకర్ల సమాఖ్య కోఆర్డినేటర్ నాలుగు రోజుల క్రితం రాష్ట్ర పరిధిలోని అన్ని బ్యాంకుల కంట్రోలింగ్ అథారిటీలకు, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులకు పంపారు.
గ్రామాల్లో వారసత్వంగా వచ్చే ఈ ఇళ్లకు నిర్దిష్ట అధికారిక హక్కు పత్రాలు ఉండవు. అందువల్ల ప్రభుత్వం తాజాగా ఇచ్చే ప్రాపర్టీ కార్డులను తనఖా పెట్టుకునే సమయంలో ఆ ఆస్తి లింకు డాక్యుమెంట్ల కోసం ఒత్తిడి చేయవద్దని ఎస్‌ఎల్‌బీసీ కోరింది. సంబందిత ఆస్తికి రిజి్రస్టేషన్ శాఖ అధికారికంగా సూచించే మార్కెట్ విలువ ఆధారంగా తనఖా విలువ లెక్కగట్టుకోవచ్చని తెలిపింది.
తొలి దశలో లక్షన్నరకు పైగా హక్కు పత్రాలు
రాష్ట్రవ్యాప్తంగా 17,461 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామ కంఠాల పరిధిలోని ఇళ్లు, దొడ్లు, ఖాళీ స్థలాలన్నింటికీ వైఎస్సార్ జగనన్న భూ హక్కు– భూ రక్ష కార్యక్రమంతో ప్రభుత్వం యాజమాన్య హక్కు పత్రాలు ఇస్తోంది. దాదాపు 11,150 గ్రామాల పరిధిలోని గ్రామ కంఠాల ఇళ్ల సర్వే కూడా చేపట్టింది. 294 గ్రామాల్లో సర్వే దాదాపు పూర్తయింది. ఒక్కో ఆస్తికి (ఇల్లు లేదా దొడ్డి లేదా ఖాళీ స్థలం వారీగా) యాజమాన్య హక్కు పత్రాల నిర్ధారణ చేసే ఫైనల్ ఆర్‌వోఆర్ నోటిఫికేషన్ జారీ కూడా పూర్తయినట్టు పంచాయతీరాజ్ శాఖ అధికారులు తెలిపారు.
వీటిలో 262 గ్రామాల్లో శుక్రవారం నాటికి 1,22,943 ప్రాపర్టీ కార్డులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మిగిలిన 32 గ్రామాల్లో హక్కు పత్రాలు కూడా త్వరలో సిద్ధమవుతాయని వెల్లడించారు. మొత్తంగా 294 గ్రామాల్లో లక్షన్నర వరకు ప్రాపర్టీ కార్డులు సిద్ధమైనట్లేనని తెలిపారు. వీటిలో 42 గ్రామాల్లో యజమాన్య హక్కు పత్రం నమూనా కాపీని సంబంధిత యజమానులకు ఇప్పటికే అందజేసినట్టు చెప్పారు.
అక్టోబరు 2న పండుగలా పంపిణీ
అక్టోబరు 2న గాంధీ జయంతి రోజున 300 – 350 గ్రామాల పరిధిలోని అన్ని ఇళ్లు, దొడ్లు, ఖాళీ స్థలాల వారీగా యజమానులకు హక్కు పత్రాల పంపిణీని పండుగలా నిర్వహించేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా వీటిని పంపిణీ చేయాలని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నారు. ప్రాపర్టీ కార్డుల ముద్రణ టెండర్లకు కూడా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment