సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింట పట్టణ స్థానిక సంస్థ (యూఎల్‌బీ)ల పరిధిలో సర్వే పనుల్ని జూన్ నాటికి పూర్తిచేయాలని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అధికారుల్ని ఆదేశించారు. దాదాపు 15 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 123 పురపాలక సంఘాల పరిధిలో చేపట్టిన ఈ సర్వేని పటిష్టంగా చేయాలని సూచించారు. రూ.120 కోట్లతో చేపట్టిన ఈ సర్వే వల్ల కోటిన్నరమంది ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు.
పట్టణ ప్రాంతాల్లో తలపెట్టిన సర్వే పనుల ప్రగతిపై ఆయన బుధవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చాక పట్టణ ప్రాంత ప్రజలకు మేలు చేకూరే విధంగా వారి భూములు, స్థలాలు, ఆస్తులను పటిష్టంగా సర్వేచేసి సరిహద్దులు ఏర్పాటుచేసి భూహక్కు పత్రాలు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు.
దేశంలో ఏ ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పథకాన్ని చేపట్టలేదని, గత వందేళ్లలో ఏ ప్రభుత్వం చేయని సాహసాన్ని సీఎం తలపెట్టారని పేర్కొన్నారు. ఈ సర్వే కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, పురపాలక శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే వార్డు సచివాలయాల నుంచి అవసరమైన సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, డ్రోన్ సర్వేని కూడా ప్రారంభించాలని చెప్పారు.
ఈ పథకం సమగ్ర సమాచారంతో ఎస్వోపీ తయారు చేయాలని ఆదేశించారు. సర్వేకు అవసరమైన సాంకేతిక పరికరాలైన రోవర్స్, ట్యాబ్, ప్రింటర్స్ వంటివాటిని తక్షణమే సమకూర్చుకోవాలని సూచించారు. ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు నమోదు చేయాలన్నారు. తద్వారా పథకం పురోగతిని సమీక్షించడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
నేటి నుంచి యూఎల్బీల్లో డ్రోన్లతో మ్యాపింగ్
సీడీఎంఏ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం సర్వే పనులు చేపడుతున్నామని మంత్రికి చెప్పారు. రాజమహేంద్రవరం, గుంటూరు, అనంతపురం, విశాఖపట్నం రీజియన్లుగా డ్రోన్ ఫ్లయింగ్ షెడ్యూల్ రూపొందించుకున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరం, అనంతపురం, గుంటూరు రీజియన్లలో గురువారం మ్యాపింగ్ పనులు ప్రారంభించనున్నట్టు చెప్పారు.
అర్బన్ సర్వేపై ఇప్పటికే 20 వేలమంది వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, అన్ని యూఎల్‌బీల్లో సర్వేకోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. ఇప్పటికే సీడీఎంఏలో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. దాదాపు 40 లక్షల ఆస్తులను సర్వేచేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించారు. ఈ సమావేశంలో అర్బన్ సర్వే ప్రత్యేకాధికారి సుబ్బారావు, డీటీసీపీ విద్యుల్లత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జూన్ నాటికి పట్టణ సర్వే పూర్తిచేయాలి
Published Thu, Nov 10 2022 4:32 AM | Last Updated on Thu, Nov 10 2022 4:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment