రీ సర్వేలో కీలకంగా సర్వేయర్ల సైన్యం  | Surveyors is crucial in lands re-survey Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రీ సర్వేలో కీలకంగా సర్వేయర్ల సైన్యం 

Published Mon, Dec 19 2022 5:49 AM | Last Updated on Mon, Dec 19 2022 5:49 AM

Surveyors is crucial in lands re-survey Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం రాష్ట్రంలో విజయవంతంగా నడుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన భూముల రీ సర్వేలో గ్రామ సర్వేయర్లు, వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలు ముఖ్య భూమిక పోషిస్తున్నారు.

ప్రభుత్వం చురుకైన యువకులకు అన్ని రకాల శిక్షణ ఇప్పించి, వారి ద్వారా ప్రాజెక్టును పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలు, 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులను రీ సర్వే చేసి యజమానులకు హక్కు పత్రాలు ఇస్తున్నారు.

దీనివల్ల లక్షల్లో పేరుకుపోయిన భూ వివాదాలు పరిష్కారమవుతాయి. అస్తవ్యస్తంగా ఉన్న భూమి రికార్డుల స్వచ్ఛీకరణ జరిగి డిజిటల్‌ రికార్డులు అందుబాటులోకి వస్తాయి. తొలి విడతగా 2 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయి 8 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు ఇచ్చారు. మిగతా ప్రాంతాల్లో కూడా రీసర్వే విజయవంతంగా జరుగుతోంది. 

గ్రామ సర్వేయర్లతో కొత్త తరం 
సమగ్ర రీ సర్వే కోసం వేలాది మంది సర్వేయర్లు అవసరం. ఈ కార్యక్రమం మొదలు పెట్టే నాటికి మండల సర్వేయర్లు మాత్రమే ఉండేవాళ్లు. అదీ కొన్ని మండలాల్లోనే ఉన్నారు. చాలా మండలాల్లో సర్వేయర్లు లేక ఇబ్బంది కలిగేది. ఆ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ సమగ్ర సర్వేకి అక్కరకు వచ్చింది. సచివాలయాల్లో 11,600 మందికిపైగా సర్వేయర్లు నియమితులయ్యారు.

పట్టణ ప్రాంతాల్లోని వార్డు సచివాలయాల్లో వార్డు ప్లానింగ్‌ సెక్రటరీలు 3,300 మందిని ప్రభుత్వం నియమించింది. మొత్తంగా ఈ 14,900 మందిని సమగ్ర సర్వేలో ప్రభుత్వం వినియోగిస్తోంది. వీరందరికీ శిక్షణ ఇచ్చింది ప్రతి రెవెన్యూ డివిజన్‌ నుంచి ఇద్దరు మండల సర్వేయర్లు, ముగ్గురు గ్రామ సర్వేయర్లను బృందాలుగా ఏర్పాటు చేసి మొత్తం 275 బృందాలకు తొలి దశలో శిక్షణ ఇచ్చింది.

వారిద్వారా వివిధ డివిజన్లలోని సర్వేయర్లు, ఇతర ఉద్యోగులకు శిక్షణ ఇప్పించింది. వారిలో 70 శాతం మంది సివిల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రులు కావడంతో సర్వే అంశాలను తేలిగ్గా ఆకళింపు చేసుకున్నారు. ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా కరోనా సమయంలోనూ ఏడాదిన్నరలో 11,187 మందికి శిక్షణ ఇచ్చింది. గ్రామ సర్వేయర్లకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్‌సీ) నిర్వహించిన మూడు రకాల డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో 94 శాతం మంది ఉత్తీర్ణులవడానికి ఈ శిక్షణ ఉపయోగపడింది. 

శిక్షణ ఇలా 
తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వే అకాడమీ ద్వారా సర్వే సెటిల్మెంట్‌ శాఖ వీరికి శిక్షణ ఇచ్చింది. ఒక ప్రణాళిక ప్రకారం భూ సర్వేకి సంబంధించి 50కి పైగా అంశాల్లో శిక్షణ ఇచ్చింది. సంప్రదాయ సర్వే విధానాలకు ఆధునిక టెక్నాలజీని జోడించి సిలబస్‌ రూపొందించింది.

కీలకమైన డ్రోన్‌ పైలట్‌ సర్వే, డ్రోన్‌ డెస్టినేషన్‌ సర్వే కోసం జిల్లాల్లో డ్రోన్‌ పైలట్, కో పైలట్‌లు గ్రామ సర్వేయర్లకు శిక్షణ ఇచ్చారు. వీరి ద్వారా మండలాల వారీగా మిగిలిన వారికి ఇవే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 679 మండలాల్లోనూ మండలానికో డ్రోన్‌ సర్వే ట్రైౖనర్‌ను నియమించారు. వీరి ద్వారానే ప్రస్తుతం డ్రోన్‌ సర్వే జరుగుతోంది. 

రీసర్వే విజయవంతంగా జరగడానికి గ్రామ సర్వేయర్లే కారణం 
సర్వే అకాడమీ ద్వారా ఆధునిక, సాంకేతిక అంశా­లపై శిక్షణ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకానికి అవసరమ­య్యే­లా సంప్రదాయ, ఆధునిక, క్షేత్ర స్థా­యి ప్రత్యక్ష సర్వే విధానాలపై శిక్షణ ఇచ్చాం. దీని ఫలితంగా రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది.  
– సీహెచ్‌వీఎస్‌ఎన్‌ కుమార్, వైస్‌ ప్రిన్సిపాల్, ఏపీ సర్వే అకాడమీ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement