సాక్షి, అమరావతి: రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీచేశారు. 2011 జనగణన వివరాల ప్రకారం ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రెండ్రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్ణయించిందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రిజర్వు స్థానాలు గుర్తించేది ఇలాగే..
►రిజర్వేషన్ల ఖరారులో ఎస్సీ, ఎస్టీలకు 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తారు. బీసీ రిజర్వేషన్లను ప్రస్తుతం ఆ కేటగిరికి చెందిన ఓటర్ల వివరాల ప్రకారం కేటాయింపులు జరుగుతాయని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు అంటున్నారు.
►జడ్పీ చైర్మన్, ఎంపీపీ, గ్రామ పంచాయతీ రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా.. జడ్పీటీసీ రిజర్వేషన్లు జిల్లా యూనిట్‌గాను.. ఎంపీటీసీ రిజర్వేషన్లు మండల యూనిట్‌గానూ.. వార్డు సభ్యుల రిజర్వేషన్లు గ్రామ పంచాయతీ యూనిట్‌గా తీసుకుంటారు. యూనిట్‌గా అంటే ఆ ప్రాంత పరిధిలో 2011 నాటి జనాభా లెక్కలు లేదా ఓటర్ల వివరాల మేరకు జరుగుతుంది.
►మండల పరిషత్ అధ్యక్ష పదవులకు అయితే.. రాష్ట్రంలో 660 మండల పరిషత్‌లు ఉండగా, ఏ జిల్లాకు ఎన్ని మండలాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీల కింద కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్ నిర్ణయించి, ఆయా జిల్లా కలెక్టర్లకు తెలియజేస్తారు. కలెక్టరు ఆ జిల్లాలో ఏ మండలం ఏ కేటగిరికి రిజర్వు చేసేది నిర్ణయిస్తారు.
►జడ్పీటీసీ పదవులకు అయితే.. ఆ జిల్లాలో ఉండే మొత్తం పదవులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన (ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6,77 శాతం, బీసీలకు 34 శాతం, మిగిలినవి జనరల్ కేటగిరి) మేరకు జిల్లా కలెక్టరే రిజర్వేషన్లు ఖరారు చేస్తారు.
►ఎంపీటీసీ పదవులకు అయితే.. జిల్లాలో ఉండే మొత్తం పదవులను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లా కలెక్టరు ఆ జిల్లాలో ఏ కేటగిరికి ఎన్ని పదువుల కేటాయించాలన్నది నిర్ణయిస్తే.. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఉన్న స్థానాలను ఏ కేటగిరికి ఎన్ని కేటాయించాలన్నది నిర్ణయిస్తారు.
►ఇక సర్పంచి పదవులను జిల్లాల వారీగా ఎన్ని కేటాయించాలన్నది పంచాయతీరాజ్ కమిషనర్, ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయిస్తారు. ఆర్డీవో స్థాయి అధికారి తమ పరిధిలో ఏఏ పంచాయతీలను ఏఏ కేటగిరికి కేటాయించేది నిర్ణయిస్తారు.
►చివరిగా.. వార్డు సభ్యుల రిజర్వేషన్లను గ్రామాల వారీగా ఏ కేటగిరికి ఎన్ని కేటాయించేది ఆర్డీవో అధికారి నిర్ణయిస్తే.. వార్డుల వారీగా ఏ వార్డును ఏ కేటగిరికి కేటాయించేది ఎంపీడీవో నిర్ణయిస్తారు.
పంచాయతీ ఎన్నికల్లో.. బీసీలకు 34% రిజర్వేషన్లు
Published Mon, Dec 30 2019 3:25 AM | Last Updated on Mon, Dec 30 2019 3:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment