బీసీలకు 4.. ఎస్సీలకు 2 | ZP Chairpersons reservation was finalized | Sakshi
Sakshi News home page

బీసీలకు 4.. ఎస్సీలకు 2

Jan 4 2020 4:41 AM | Updated on Jan 4 2020 5:00 AM

ZP Chairpersons reservation was finalized - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మండల, జిల్లాపరిషత్‌ ఎన్నికలకు సంబంధించి జిల్లాపరిషత్‌ చైర్మన్‌ పదవుల రిజర్వేషన్లను పంచాయతీ రాజ్‌ శాఖ శుక్రవారం ఖరారు చేసింది. ఈ మేరకు 13 జిల్లాల జెడ్పీ చైర్మన్‌ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆ ప్రకారం.. నాలుగు జిల్లా పరిషత్‌ (జెడ్పీ) చైర్మన్‌ పదవులు బీసీలకు, రెండు ఎస్సీలకు, ఒకటి ఎస్టీలకు రిజర్వు అయ్యాయి. మిగిలిన 6జెడ్పీ చైర్మన్‌ పదవులను జనరల్‌(అన్‌రిజర్వ్‌)కు కేటాయించారు. కాగా మొత్తం 13 జిల్లా పరిషత్‌లకుగాను ఆయా కేటగిరీల వారీగా 6 మహిళలకు రిజర్వు అయ్యాయి.

73వ రాజ్యాంగ సవరణ తర్వాత 1994లో ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం అమల్లోకి రాగా, అందులో పేర్కొన్న నిబంధనల మేరకు ఇప్పటి వరకు నాలుగు విడతలపాటు ‘స్థానిక’ ఎన్నికలు జరిగాయి. ఈ 4 విడతల ఎన్నికల్లోనూ నిబంధనల ప్రకారం రొటేషన్‌ పద్ధతిన జెడ్పీ చైర్మన్‌ పదవుల రిజర్వేషన్లను పంచాయతీరాజ్‌ శాఖ ఖరారు చేస్తూ వస్తోంది. అదే రొటేషన్‌ క్రమంలో ప్రస్తుతం ఐదో విడత ఎన్నికలకోసం ఆయా కేటగిరీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ పదవుల రిజర్వేషన్లకు సంబంధించి జిల్లాలవారీగా ఆయా జిల్లాల కలెక్టర్లు గురువారం గెజిట్‌ నోటిఫికేషన్లు జారీ చేయడం తెలిసిందే.

సర్పంచ్‌ రిజర్వేషన్ల ఖరారుపై వీడియో కాన్ఫరెన్స్‌
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం ఖరారు చేసే కసరత్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగా జిల్లా, మండల అధికారులకు సూచనలు చేసేందుకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది పంచాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజాశంకర్‌తో కలసి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాల్లో ఎక్కడికక్కడ ఆయా జిల్లాల జెడ్పీ చైర్మన్లు, డీపీవోలు, ఆర్డీవోలు, ఎంపీడీవోలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,057 గ్రామ పంచాయతీలకు సర్పంచ్‌ పదవులతోపాటు వాటి పరిధిలో ఉండే 1,33,726 వార్డు సభ్యుల పదవుల రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రక్రియను శని, ఆదివారాల్లోగా పూర్తి చేసి నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఈ సందర్భంగా అధికారులను గోపాలకృష్ణ ద్వివేది ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement