
సాక్షి, అమరావతి : హైకోర్టు తీర్పు అనంతర పరిణామాలను బేరీజు వేసుకుని, ఈ నెలలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు మొదలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే ఎన్నికల నిర్వహణను చేపట్టేలా.. రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ సోమవారం సాయంత్రం నుంచి కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ఖరారు చేసేందుకు హైకోర్టు 30 రోజులు గడువు ఇచ్చినప్పటికీ, ఒకటెండ్రు రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తి చేసి.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేయాలని అధికారులు భావిస్తున్నారు.
2018 ఆగస్టు నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు జరపని కారణంగా కేంద్రం నుంచి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు రూ.3,710 కోట్లు.. నగర, మున్సిపాలిటీలకు మరో రూ.1,400 కోట్ల మేర నిధులు నిలిచిపోయాయి. దీంతో మార్చి నెలాఖరులోగా ఆ నిధులను విడుదల చేసేలా ఎన్నికల నిర్వహణకు ఉన్న అవకాశాలపై పంచాయతీరాజ్ అధికారులతో సీఎంవో అధికారులు చర్చించారు. అంతకుముందు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ జెడ్పీ సీఈవోలు, డీపీవోలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి బ్యాలెట్ పేపర్ల ముద్రణ, రిజర్వేషన్ల ఖరారుపై చర్చించారు. కాగా, రిజర్వేషన్లు ఖరారు కాగానే రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి.. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment