సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను తిరిగి నిర్వహించేందుకు వీలుగా తాజా నోటిఫికేషన్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ)ను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను సవాలుచేస్తూ ఎన్నికల కమిషనర్ దాఖలు చేసిన అప్పీల్‌పై హైకోర్టులో గురువారం వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో తమ వాదనలు కూడా వినాలంటూ ఆ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు కొందరు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను అనుమతిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పుపై గురువారం ధర్మాసనం విచారణ జరిపింది. ఎస్‌ఈసీ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల ఎన్నికల నియమావళిని అమలుచేశాకే ఈ ఎన్నికలు నిర్వహించామని చెప్పారు. కోవిడ్‌వల్ల గతంలో ఎన్నికలు ఏ దశలో అయితే నిలిచిపోయాయో అక్కడి నుంచే కొనసాగించామన్నారు. దీనిని సింగిల్ జడ్జి సైతం సమర్థించారని వివరించారు. ఓట్ల లెక్కింపు ఒక్కటే మిగిలి ఉందని, బ్యాలెట్ బాక్సుల రక్షణ నిమిత్తం రోజుకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతోందని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
అడిగిందొకటి.. ఇచ్చింది మరొకటి...
అలాగే, పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు నుంచి ఎన్నికల నియమావళిని అమలుచేసేలా ఆదేశాలివ్వాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య పిటిషన్ దాఖలు చేయగా, ఎన్నికలను మొదటి నుంచి నిర్వహించేలా ఆదేశాలివ్వాలంటూ జనసేన పార్టీ మరో పిటిషన్ వేసిందన్నారు. కానీ, ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ను అమలుచేయాలని జనసేన కోరలేదన్నారు. అయితే.. సింగిల్ జడ్జి మాత్రం వర్ల రామయ్య పిటిషన్‌ను కొట్టేసి, జనసేన పిటిషన్‌లో మాత్రం ఎన్నికల తేదీకి నాలుగు వారాల ముందు నియమావళిని అమలుచేయాలంటూ తీర్పునిచ్చారని నిరంజన్‌రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే, ఎన్నికల కమిషనర్ గురించి సింగిల్ జడ్జి పలు వ్యాఖ్యలు చేశారని, వాటిని తీర్పు నుంచి తొలగించాలని కోరారు.
వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని సింగిల్ జడ్జి తీర్పును రద్దుచేయాలని నిరంజన్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. జనసేన తరఫున న్యాయవాది వి.వేణుగోపాలరావు వాదనలు వినిపించగా.. ఎన్నికల్లో పోటీచేసిన ఓ అభ్యర్థి తరఫున న్యాయవాది వీఆర్‌ఎన్ ప్రశాంత్ వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు లేవనెత్తని అనేక అంశాలపై సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని తెలిపారు. ఈ ఎన్నికల కోసం రూ.160 కోట్ల మేర ఖర్చయిందని.. అందువల్ల ఓట్ల లెక్కింపునకు అనుమతినివ్వాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం, తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తీర్పు వాయిదా
Published Fri, Aug 6 2021 3:46 AM | Last Updated on Fri, Aug 6 2021 7:38 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment