వ్యర్థంపై యుద్ధం  | Recent Sanitation Programs That Have Yielded Good Results | Sakshi
Sakshi News home page

వ్యర్థంపై యుద్ధం 

Published Tue, Nov 24 2020 4:33 AM | Last Updated on Tue, Nov 24 2020 4:33 AM

Recent Sanitation Programs That Have Yielded Good Results - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి అంటువ్యాధులకు అవకాశం లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చి అంటువ్యాధుల వ్యాప్తి దాదాపు 90% తగ్గుముఖం పట్టినట్లు నిర్ధారణ కావడంతో ఈ తరహా కార్యక్రమాలు కొనసాగించేందుకు సిద్ధమవుతోంది.

డిసెంబర్‌ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ‘వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం’ పేరిట ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినం పురస్కరించుకుని డిసెంబర్‌ 21న ఈ కార్యక్రమ ముగింపుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలసి అన్ని గ్రామ సచివాలయ కార్యాలయాల వద్ద గ్రామస్తులతో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు ఒక కార్యాచరణను రూపొందించారు. 

90 శాతం మేర తగ్గిన అంటువ్యాధులు..
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకుముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలతో.. 90 శాతం మేర అంటు వ్యాధుల వ్యాప్తి తగ్గినట్టు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. గ్రామాల్లో ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం  క్లోరినేషన్‌ చేయడం, మురుగు కాల్వల్లో పూడికతీత,  బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటివి సత్ఫలితాలనిచ్చాయి.  

 వ్యర్థాలకు కారకులతో రోజుకొక సమావేశం.. 
గ్రామాల్లో పెద్దమొత్తంలో వ్యర్థాలు ఏర్పడడానికి కారణమయ్యే వారితో పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీ సిబ్బంది సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన కలిగిస్తారు. షాపు యజమానులు, తోపుడు బండ్లపై కూరగాయల విక్రయం వంటి వ్యాపారాలు చేసుకునేవారు, శ్రమశక్తి సంఘాలు, విద్యార్థులు, రైతులు తదితర కేటగిరీల వారీగా ఈ సమావేశాలు నిర్వహించి ఇష్టానుసారం వ్యర్థాలను వదిలివేయడం వల్ల  ఇతరులకు కలిగే ఇబ్బందులతో పాటు వాటి ద్వారా కలిగే దు్రష్పభావాలపై అవగాహన కలిగించనున్నట్లు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమ నిర్వహణకు నోడల్‌ అధికారిగా నియమితులైన దుర్గాప్రసాద్‌ తెలిపారు.  

తొలిరోజు జిల్లా స్థాయిలో.. 
డిసెంబర్‌ 2వ తేదీ తొలిరోజు అన్ని జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో డివిజనల్‌ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులతో సమావేశం నిర్వహించి వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం ఉద్దేశాలను వారికి వివరించి ఈ కార్యక్రమంపై అవగాహన కలిగిస్తారు. 3న మండల స్థాయిలో, 4న గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 7–19 వ తేదీ మధ్య.. గ్రామాల్లో రోజుకొక కేటగిరీకి చెందిన వ్యక్తులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించి అవగాహన కలిగిస్తారు. 21న చివరిరోజు సీఎం జన్మదినం సందర్భంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద గ్రామస్తులందరి సమక్షంలో ఈ కార్యక్రమ ఉద్దేశాలపై సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement