Sanitation programs
-
AP: ఉదారంగా వరద సాయం
సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను అత్యంత సమర్థంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. వరద బాధితులకు మానవీయ కోణంలో సహాయం అందించాలని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువగా మానవత్వంతో పని చేయాలనే విషయాన్ని అంతా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఒక రూపాయి అదనంగా ఖర్చు అయినా సరే బాధితులకు అండగా ఉండాలన్నారు. కలెక్టర్లు మాకు మంచి చేశారనే మాటే వినిపించాలని, మన వల్ల జిల్లాకు మంచి జరిగిందని, మంచి కలెక్టర్ అనిపించుకునేలా పని చేయాలని సూచించారు. ప్రధానంగా ఐదు జిల్లాల్లో కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబి రాల నుంచి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని, వ్యక్తులైతే రూ.1,000 చొప్పున అందచేయాలని ఆదేశించారు. కచ్చా ఇళ్లను నష్టపోయిన బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం అందించి ఆదుకోవాలని నిర్దేశించారు. శిబిరాల్లో తలదాచుకునే బాధితులకు మంచి సదుపాయాలను కల్పించడంతోపాటు ముంపు ప్రాంతాల్లో బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్ పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ, పునరావాస కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే... ఐదు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.60 అడుగులు ఉంది. శనివారం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇది రేపటికి (శనివారం) సుమారు 16 లక్షలకు చేరుకుని ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అంచనా. ప్రవాహం 17 లక్షల క్యూసెక్కులు ఉంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం రెండు, మూడు ప్రమాద హెచ్చరికల మధ్యలో అంటే 13 – 17 లక్షల క్యూసెక్కుల లోపే ప్రవాహం ఉంటుంది. గతేడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని చూశాం. శిబిరాల్లో మంచి సదుపాయాలు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల ఖాళీ చేశారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే పరిస్థితిని అంచనా వేసి మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో స్వయంగా అధికారులే ఉంటే ఎలాంటి సదుపాయాలను కోరుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కల్పించాలి. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కచ్చా ఇళ్లపై వర్గీకరణే వద్దు.. మరో ముఖ్యమైన అంశం.. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలి. కచ్చా ఇళ్ల బాధితులను సహాయ శిబిరాల నుంచి తిరిగి పంపించేటప్పుడు రూ.10 వేల చొప్పున సాయంగా అందించాలి. అది వారికి తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకునేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. లేదంటే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటారు. కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అనే వర్గీకరణే వద్దు. వారు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు ఇక వర్గీకరణ అనవసరం. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో ఉండాలని కలెక్టర్లను కోరుతున్నా. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్.. ముంపునకు గురైన ఇళ్లు, వరదనీరు ప్రవహించిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను అందించాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి. మొత్తంగా బాధితుల పట్ల మరింత ఉదారంగా, మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలి. సచివాలయాల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ రాష్ట్రంలో నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్ రూమ్స్‌కు సంబంధించి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఏర్పాటు చేయాలి. సచివాలయాల స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందితో పాటు వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి. ముంపు గ్రామాలు, లంకలపై ప్రత్యేక దృష్టి ముంపు బాధిత గ్రామాలు, లంకలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై మరోసారి సమీక్షించి సిద్ధంగా ఉండాలి. లంక గ్రామాలలో జనరేటర్లు లాంటి వాటిని కూడా సిద్ధం చేసుకోండి. తాగునీటి కొరత లేకుండా.. తాగునీటి కొరత లేకుండా, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధం చేసుకోండి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టండి. బ్లీచింగ్, ఫినాయిల్ లాంటివి సిద్ధంగా ఉంచాలి. ఆరోగ్య శిబిరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాలి. విలేజ్ క్లినిక్స్, పీహెచ్సీలలో సరిపడా మందులను ఉంచాలి. వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాము కాట్లు లాంటి ఘటనలు జరిగితే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి. వరద తగ్గాక పంట నష్టం నమోదు వరద నీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలవాలి. అత్యంత పారదర్శక పద్ధతిలో ఎన్యుమరేషన్ జరగాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యం, మంచి సదుపాయాలు ఉన్నచోటకు ముందే తరలించాలి. ప్రతి విషయంలోనూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న సందేశాన్ని అందించాలి. సమావేశంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి తానేటి వనిత, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి. సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ కె.విజయానంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఆర్ అండ్ బీ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ జి.లక్ష్మీషా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షణ్ పురస్కారాలు
సాక్షి, అమరావతి/ న్యూఢిల్లీ: రాష్ట్రంలోని పలు నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో అనుసరిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలకు స్వచ్ఛ భారత్ మిషన్ (అర్బన్) జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీల్లో పలు అవార్డులు సొంతమయ్యాయి. పలు యూఎల్బీలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. ప్రజాభిప్రాయమే ప్రాతిపదికగా ఈ ఏడాది మూడు దశల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే నిర్వహించి, అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో రాష్ట్రానికి చెందిన పలు పట్టణాలు, నగరాలు ఉత్తమ ఫలితాలను సాధించి అవార్డులను సొంతం చేసుకున్నాయి. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవçహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఢిల్లీలో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ్–2022 వేడుకలో రాష్ట్రానికి పలు అవార్డులు ప్రదానం చేశారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ పారిశుధ్య కార్మిక విధానాలు పాటిస్తున్నందుకు తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్‌కు ‘సఫాయిమిత్ర సురక్షా సెహెర్’ అవార్డు దక్కింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మిలు ఈ అవార్డులను అందుకున్నారు. జాతీయ టాప్–10లో మూడు యూఎల్బీలు ► స్వచ్ఛ సర్వేక్షణ్–2022లో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఏడో స్థానంలో నిలవగా, లక్ష కంటే ఎక్కువ జనాభా గల నగరాల్లో గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు టాప్–10 కేటగిరీలో స్థానం సంపాదించాయి. వీటితోపాటు కర్నూలు, నెల్లూరు, కడప, రాజమహేంద్రవరం యూఎల్బీలు (అర్బన్ లోకల్ బాడీస్) కూడా టాప్–100 కేటగిరీలో నిలిచాయి. ► సౌత్ జోన్లో 50 వేల నుంచి లక్ష జనాభా కేటగిరీలో టాప్–100 యూఎల్బీల్లో రాష్ట్రంలోని 21 నగరాలు నిలిచాయి. ఇందులో పుంగనూరు మున్సిపాలిటీ 3వ ర్యాంకు, పులివెందుల 9వ ర్యాంకు సాధించాయి. ► 25 – 50 వేల జనాభా విభాగంలో 8 యూఎల్బీలు టాప్ 100 ర్యాంకింగ్‌లో నిలిచాయి. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ‘స్వచ్ఛ రాష్ట్ర రాజధాని నగరం’గా నిలవగా, 10–40 లక్షల జనాభా కేటగిరీలో విశాఖపట్నం ‘క్లీన్ బిగ్ సిటీ’గా అవార్డు పొందింది. ► సౌత్ జోన్‌లోని 50 వేలు– లక్ష జనాభా కేటగిరీలో ‘ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ విభాగంలో పులివెందుల, 25–50 వేల జనాభా కేటగిరిలో సాలూరు అవార్డు సాధించగా, ప్రజాభిప్రాయం విభాగంలో పుంగనూరును మున్సిపాలిటీ అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఇదిలావుండగా, ఇండియన్ స్వచ్ఛతా లీగ్ విభాగంలో మిలియన్ ప్లస్ కేటగిరీలో విశాఖపట్నం ‘టాప్ ఇంపాక్ట్ క్రియేటర్’ అవార్డును సొంతం చేసుకోగా, ప్రత్యేక కేటగిరీలో శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్, పొదిలి యూఎల్బీలు అవార్డులను అందుకున్నాయి. చెత్త రహిత నగరాల్లో తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ కార్పొరేషన్లు ‘ఫైవ్ స్టార్’ రేటింగ్ సాధించాయి. సీఎం విప్లవాత్మక నిర్ణయాల వల్లే అవార్డులు గత మూడేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు మంచి ఫలితాలు ఇచ్చాయనడానికి ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద సంఖ్యలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు రావడమే నిదర్శనమని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఆయన ఢిల్లీలో ఈ అవార్డులను అధికారులతో కలిసి అందుకున్న అనంతరం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలోని 123 స్థానిక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 పోటీలో పాల్గొన్నాయి. ఇందులో ఏపీ మునుపెన్నడూ లేని విధంగా అవార్డులను గెలుచుకోవడం ఒక రికార్డు. గతంలో చంద్రబాబు సీఎంగా తన సొంత నియోజకవర్గం కుప్పంను అభివృద్ధి చేసుకోలేకపోవడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. అదే సమయంలో పులివెందుల దేశ స్థాయిలో అవార్డును కైవసం చేసుకోవడం గమనార్హం’ అన్నారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. అన్ని నగరాల అభివృద్ధికి పెద్దపీట ► చెత్త సేకరణ కోసం సుమారు 3 వేల వాహనాలను అందుబాటులోకి తెచ్చాం. 1.25 కోట్ల చెత్తబుట్టలను ఇంటింటికి పంపిణీ చేశాం. పారిశుధ్య కార్మికుల వేతనాలను గణనీయంగా పెంచాం. అధికారులు, కార్మికుల సమిష్టి కృషి.. సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల పనితీరు.. వీటన్నింటి వల్ల ఇన్ని అవార్డులు వచ్చాయి. ► పరిపాలనలో వికేంద్రీకరణ, అభివృద్ధి అనే ఒక ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్న కారణంగా కేవలం విజయవాడ మాత్రమే కాకుండా ఇన్ని నగరాలు అభివృద్ధి చెందుతూ దేశ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరుకున్నాయి. ► రాష్ట్రంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలను ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ హౌజింగ్, జగనన్న స్మార్ట్ టౌన్ షిప్‌లకు ఇప్పటికే శ్రీకారం చుట్టాం. అన్ని మున్సిపాలిటీల్లో దశల వారీగా ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గిస్తాం. ఆధ్యాత్మిక నగరానికి అరుదైన గౌరవం తిరుపతి తుడా: ఆధ్యాత్మిక నగరం తిరుపతికి అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక స్వచ్ఛ సిటీ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మున్సిపల్‌శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మీ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలిలు అవార్డు అందుకున్నారు. ఇంటింటా చెత్త సేకరణ, చెత్త తరలింపు, సెగ్రిగేషన్, ప్రాసెసింగ్ వంటి అంశాల్లో తిరుపతి నగరం మేటిగా నిలిచింది. బహిరంగ మరుగుదొడ్ల నిర్వహణ, సుందరీకరణ వంటి అంశాల్లోనూ సత్తా చాటింది. వ్యర్థపు నీటిని శుద్ధి చేయడం, వాటి ద్వారా ఆదాయం పొందడం, రైతులకు ఉచితంగా సరఫరా చేయడం వంటి అంశాల్లోనూ ఆదర్శంగా నిలవడంతో ఈ ఘనత దక్కింది. తొలిసారిగా 5 స్టార్ రేటింగ్‌కు పోటీపడిన తిరుపతి అన్ని అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచి.. ఆ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. గత కమిషనర్ పీఎస్ గిరీష, ఎమ్మెల్యే భూమనలు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయాలు నేడు సత్ఫలితాలను ఇచ్చాయి. -
గ్రామాల్లో కోవిడ్ కట్టుబాట్లు
సాక్షి, అమరావతి: కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని గ్రామాల్లో సైతం కరోనా నియంత్రణ విషయంలో ప్రజా చైతన్యం బాగా కనిపిస్తోంది. పాజిటివ్ కేసులు నమోదయ్యే గ్రామాల్లో స్థానికులు స్వచ్ఛందంగా తమ గ్రామంలో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఉదయం 11 వరకు మాత్రమే.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో రెండు నెలల వ్యవధిలో 69 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఆరుగురు మృత్యువాత పడటంతో గ్రామస్థులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొల్లిపర, తూములూరులో ఈ నెల 16వ తేదీ వరకు వ్యాపార దుకాణాలు, హోటళ్లు, టీస్టాళ్లు ఉదయం 11 గంటలకే మూసి వేస్తున్నారు. స్థానిక పెద్దల వినతి మేరకు తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్ఐలతో కూడిన మండల కమిటీ దీనికి ఆమోదం తెలిపింది. దైనందిక కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ మంది గుమికూడడానికి అవకాశం ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాల విషయంలోనే ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు. తెనాలి మండలం పెదరావూరు, అంగలకుదురు, కటివరం గ్రామ పంచాయతీలలోనూ సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాల కార్యకలాపాలను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేలా ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు. భట్టిప్రోలు మండలంలోని నాలుగు గ్రామాల్లో కూడా ఇదే తరహా ఆంక్షలు విధించుకున్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు.. కరోనా కేసులు నమోదవుతున్న గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయడంతోపాటు బ్లీచింగ్ పౌడరును ప్రధాన రోడ్ల వెంట చల్లుతున్నారు. -
వ్యర్థంపై యుద్ధం
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి అంటువ్యాధులకు అవకాశం లేకుండా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించనుంది. ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చి అంటువ్యాధుల వ్యాప్తి దాదాపు 90% తగ్గుముఖం పట్టినట్లు నిర్ధారణ కావడంతో ఈ తరహా కార్యక్రమాలు కొనసాగించేందుకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ‘వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం’ పేరిట ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం పురస్కరించుకుని డిసెంబర్ 21న ఈ కార్యక్రమ ముగింపుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలసి అన్ని గ్రామ సచివాలయ కార్యాలయాల వద్ద గ్రామస్తులతో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఒక కార్యాచరణను రూపొందించారు. 90 శాతం మేర తగ్గిన అంటువ్యాధులు.. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకుముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహించిన సంపూర్ణ పారిశుధ్య కార్యక్రమాలతో.. 90 శాతం మేర అంటు వ్యాధుల వ్యాప్తి తగ్గినట్టు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్ చేయడం, మురుగు కాల్వల్లో పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం వంటివి సత్ఫలితాలనిచ్చాయి. వ్యర్థాలకు కారకులతో రోజుకొక సమావేశం.. గ్రామాల్లో పెద్దమొత్తంలో వ్యర్థాలు ఏర్పడడానికి కారణమయ్యే వారితో పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీ సిబ్బంది సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన కలిగిస్తారు. షాపు యజమానులు, తోపుడు బండ్లపై కూరగాయల విక్రయం వంటి వ్యాపారాలు చేసుకునేవారు, శ్రమశక్తి సంఘాలు, విద్యార్థులు, రైతులు తదితర కేటగిరీల వారీగా ఈ సమావేశాలు నిర్వహించి ఇష్టానుసారం వ్యర్థాలను వదిలివేయడం వల్ల ఇతరులకు కలిగే ఇబ్బందులతో పాటు వాటి ద్వారా కలిగే దు్రష్పభావాలపై అవగాహన కలిగించనున్నట్లు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమ నిర్వహణకు నోడల్ అధికారిగా నియమితులైన దుర్గాప్రసాద్ తెలిపారు. తొలిరోజు జిల్లా స్థాయిలో.. డిసెంబర్ 2వ తేదీ తొలిరోజు అన్ని జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారుల ఆధ్వర్యంలో డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులతో సమావేశం నిర్వహించి వ్యర్థాలపై వ్యతిరేక పోరాటం ఉద్దేశాలను వారికి వివరించి ఈ కార్యక్రమంపై అవగాహన కలిగిస్తారు. 3న మండల స్థాయిలో, 4న గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే 7–19 వ తేదీ మధ్య.. గ్రామాల్లో రోజుకొక కేటగిరీకి చెందిన వ్యక్తులతో వేర్వేరు సమావేశాలు నిర్వహించి అవగాహన కలిగిస్తారు. 21న చివరిరోజు సీఎం జన్మదినం సందర్భంగా అన్ని గ్రామ సచివాలయాల వద్ద గ్రామస్తులందరి సమక్షంలో ఈ కార్యక్రమ ఉద్దేశాలపై సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలకు ఎక్కడికక్కడ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను కూడా ఆహ్వానిస్తారు. -
అంటువ్యాధులు పరార్
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలతో అంటువ్యాధులు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాదితో పోల్చితే జూన్, జూలై, ఆగస్టులో మలేరియా కేసులు సగానికి పైగా తగ్గగా డెంగీ, డయేరియా 10–20 శాతానికే పరిమితమైనట్లు పంచాయతీరాజ్ శాఖ పరిశీలనలో తేలింది. 13 వేల పంచాయతీల్లో పారిశుధ్య పనులు.. ► ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభంలోనూ, అంతకు ముందు వేసవిలోనూ రాష్ట్రంలోని 13,322 గ్రామ పంచాయతీల పరిధిలో పంచాయతీరాజ్ శాఖ సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టింది. ఓవర్ హెడ్ ట్యాంకు వద్ద మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు నిత్యం క్లోరినేషన్, పూడికతీత, బ్లీచింగ్ పౌడర్ చల్లడం లాంటి చర్యలు పెద్ద ఎత్తున చేపట్టారు. ► మండలానికి రెండు గ్రామాల చొప్పున 1,320 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా మనం – మన పరిశుభ్రత పేరుతో చెత్త సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నామమాత్రంగా డెంగీ కేసులు... ► గత ఏడాది జూన్, జూలై, ఆగస్టులో గ్రామీణ ప్రాంతాల్లో 1,163 మలేరియా కేసులు నమోదు కాగా ఈసారి ఇదే కాలంలో కేవలం 601 మాత్రమే నమోదైనట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. డెంగీ కేసులు గత ఏడాది మూడు నెలల్లో 944 కేసులు నమోదు కాగాఈసారి అదే వ్యవధిలో 24 మాత్రమే గుర్తించారు. ► గత ఏడాది 1,11,685 డయేరియా కేసులు మూడు నెలల్లో నమోదు కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో 20,355 మాత్రమే నమోదయ్యాయి. గతేడాది 9,528 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 355 కేసులే నమోదయ్యాయి. -
పడకేసిన పారిశుధ్యం
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఎడతెరిపిలేని వర్షాలతో గ్రామాలు తడిసి ముద్దవుతున్నాయి. మరోవైపు పారిశుధ్య కార్మికులు నెలరోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోయి గ్రామాలన్నీ కంపుకొడుతున్నాయి. ఎటు చూసినా పాత బొందలు, గుంతల్లో నీళ్లు నిలిచి దోమలకు నిలయాలుగా మారాయి. దోమకాటుతో గ్రామాలకు గ్రామాలే మంచం పడుతున్నాయి. విషజ్వరాల బారిన పడినవారు ఇంటికో బాధితుడు అన్నట్లు తయారైంది. ఇదిలా ఉంటే గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. వర్షాలు ఒక వైపు దంచికొడుతుంటే.. దోమ కాటుతో విషజ్వరాలు, మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ వంటి ప్రమాదకర వ్యాధులు సంభవిస్తున్నాయి. ప్రభుత్వం గ్రామాల్లో వైద్యసేవలకు ఉపక్రమించకపోవడంతో బతుకుజీవుడా అన్నట్లు ప్రజలు అల్లాడుతున్నారు. పరిస్థితి చేయిదాటినా ప్రభుత్వం ఇంతవరకు కళ్లు తెరవకపోవడంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వేలకు వేలు ఫీజులు చెల్లించి ఆర్థికంగా నష్టపోతున్నారు. పాలనా కొత్తదే.. ఆగష్టు 2తో గ్రామపంచాయితీల పాలకవర్గాల పాలన ముగియడంతో స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. వీరు పాలనకు కొత్త కావడం గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై అంతగా అనుభవం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పరిస్థితులు పూర్తిగా తారుమారు కావడంతో స్పెషలాఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. మురుగు, చెత్త నిల్వలు లేకుండా చూసేందుకు పారిశుధ్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇక చేసేదేమి లేక చేతులెత్తే పరిస్థితి వచ్చింది. తాగునీటికి క్లోరినేషన్ చేసి అందించడంతో పాటు ఎక్కడా మురుగునీరు కలువకుండా, లీకేజీల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు వేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై అవగాహన ఉన్న అధికారులు సైతం తక్కువగా ఉండడంతో పరిస్థితిలో మార్పు రావడం లేదు. దీంతో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. హెల్త్ ఎమర్జెన్సీపై దృష్టేది..? ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రామాల్లో జ్వరపీడితులు పెరుగుతున్నారు. విషజ్వరాల బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి వైద్య సేవలు అందించాల్సిన జిల్లా వైద్య యంత్రాంగం ఏమీ జరగనట్లుగానే ఎప్పటిలాగే వ్యవహరిస్తోంది. ఈ నెల రోజుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా వైద్య సేవలు పెంచలేకపోతోంది. గ్రామాల్లో ప్రత్యేక బృందాలతో వైద్య సేవలు అందించాల్సింది పోయి నెలకోసారి వైద్య సేవలు అందిస్తుండడంతో పల్లెలు రోగాల బారి నుంచి బయటపడలేకపోతున్నాయి. పట్టణాలకు దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మారుమూల గ్రామాల ప్రజలు ఆర్ఎంపీలను నమ్ముకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు వారి ఆర్థిక పరిస్థితులు కూడా కారణంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం, పారిశుధ్యంపై నేడు మంత్రి రాజేందర్ సమీక్ష.. గ్రామాల్లో నెలకొన్ని పరిస్థితులను చక్కదిద్దేందుకు రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం ఆరోగ్యం, పారిశుధ్యంపై నగరంలోని పద్మనాయక కళ్యాణమండపంలో ఉదయం 10 గంటలకు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల డీపీవోలు, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. పల్లెల్లో పారిశుధ్యం మెరుగుపరిచి, జ్వరపీడితులకు వైద్య సేవలు అందించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుధ్యం
- వ్యర్థాల నిర్వహణపై జాతీయ సదస్సులో మంత్రి కేటీఆర్ - పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి - చెత్త తరలింపు, నిర్వహణలో ప్రైవేట్ సహకారం అవసరం సాక్షి, హైదరాబాద్: వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజల, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతోనే అవి విజయవంతం అవుతాయని మునిసిపల్ మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఇంటి నుంచే శుభ్రత కార్యక్రమాలు అమలు కావాలని, ప్రజల వైఖరిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని దాదాపు మూడు, నాలుగు వేల పాఠశాలల్లో పెద్దసైజు చెత్త డబ్బాలు ఏర్పాటు చేసి చిన్నారులకు ప్రాథమిక విద్యస్థాయి నుంచే తడి, పొడిపై అవగాహన కల్పించాలని జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్లను ఆదేశించారు. శనివారం ఇక్కడి తాజ్ కృష్ణాలో ‘ఈ లీట్స్’సహకారంతో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వ్యర్థ పదార్థాల నిర్వహణపై జరిగిన జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రతి పౌరుడూ నా నగరం , నా ప్రాంతం అనుకొని ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉండాలని కోరారు. అమెరికా, సింగపూర్లలో ఉండి వచ్చినవారు ఇక్కడకు రాగానే ‘చల్తా హై’అనుకుంటూ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను చైతన్యపరచడంతోపాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తుందని చెప్పారు. చెత్తను వేరు చేయడం, తరలించడం, నిర్వహణ చేపట్టడంలో ప్రైవేటు సహకారం అవసరమని కేటీఆర్ అన్నారు. వ్యర్థాల నిర్వహణను మరింత వికేంద్రీకరిం చడంతోపాటు ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్లామర్‌లేని పని.. చెత్త నిర్వహణ అనేది అన్గ్లామరస్ అని మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. మునిసిపల్ అధికారులు కొత్త రోడ్లు, వంతెనలు వంటి వాటిపై చూపిన శ్రద్ధ నిర్వహణ పనులపై చూపడంలేదని పేర్కొన్నారు. పారిశుధ్య కార్మికుల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోని ఏ కార్పొరేషన్లో లేనివిధంగా జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, పువ్వాడ అజయ్‌కుమార్, మునిసిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న ఆపరేషన్ జీజీహెచ్
గుంటూరు రూరల్ : గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే సమీక్షించారు. ఆసుపత్రిలోని శుశ్రుత హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత మూడు రోజులుగా 45 మంది అధికారులు, 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చేసిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 72 గంటల్లో ఆసుపత్రి ప్రక్షాళన అనేది సాధ్యం కాదని తేలిందని, ఈ కార్యక్రమాలను ఈ నెలాఖరువరకూ కొనసాగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి వార్డులో రోగులకు, సిబ్బందికి కావల్సిన సౌకర్యాలు ఒకటికి రెండుసార్లు ఆయా విభాగాలను కేటాయించిన అధికారులు సరిచూసుకోవాలన్నారు. రోగులకు, వారి బంధువులకు రాత్రి సమయంలో బసలు కల్పించేందుకు అవసరమైన చర్యలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జీజీహెచ్ అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు, వ్యాపార వేత్తల నుంచి మంచి స్పందన లభించిందని, ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగు కాల్వలు, టాయ్‌లెట్స్‌ను విధిగా పరిశీలించాలన్నారు. ప్రతి వారంలో ఒకసారి మురుగు కాల్వల పూర్తిస్థాయి శుభ్రం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ సౌకర్యాలు, ప్రతి వార్డులో విద్యుత్ దీపాలు, ఫ్యానులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అత్యవసర విభాగాల్లో, ఐసీయూలలో ఉన్న ఏసీలు పూర్తి స్థాయి వినియోగంలోకి తేవాలని తెలిపారు. ఆసుపత్రిలోని ప్రతి చిన్న రంధ్రాన్ని సిమ్మెంట్ కాంక్రీట్‌తో పూడ్చి ఎటువంటి ప్రమాదం లేకండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ రాఘవ శర్మ తనవంతుగా ఆసుపత్రి అభివృద్దికి రూ.5 లక్షల విరాళంను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో జేసీ శ్రీధర్, డీఆర్వో నాగబాబు, ఇన్చార్జి సూపరింటెండెంట్ రాజునాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు. -
చెత్త పేరుకుపోకుండా ‘జీరో అవర్’
జీహెచ్ఎంసీ కొత్త విధానం క్లీన్‌సిటీ అమలులో భాగంగా చర్యలు.. సిటీబ్యూరో: నగరంలో పారిశుధ్యకార్యక్రమాలు మెరుగుపరచేందుకు ఇప్పటికే వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ తాజాగా చెత్త రవాణా కేంద్రాల్లో చెత్త గుట్టలుగా పేరుకుపోకుండా ఏరోజుకారోజే అక్కడి నుంచి చెత్తను జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల సమయాన్ని ‘జీరో అవర్’గా పరిగణిస్తూ, ఆ సమయానికల్లా రవాణా కేంద్రంలో చెత్త అనేది కనిపించ కుండా చేయాలని నిర్ణయించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను రవాణాకేంద్రాలకు తరలిస్తున్నప్పటికీ, అక్కడి నుంచి జవహర్‌నగర్ యార్డుకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. దాంతో రవాణాకేంద్రం పరిసరాల్లో చెత్త గుట్టలు పేరుకుపోయి పరిసరాల్లో దుర్గంధం వెలువడుతుండటంతో పాటు దోమల బెడద తీవ్రమవుతోంది. ఈ సమస్యల పరిష్కారంతోపాటు నగరాన్ని క్లీన్‌సిటీగా చేసేందుకు జీరోఅవర్ విధానాన్ని పాటిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. -
నిధులిస్తేనే స్వచ్ఛత!
పడకేసిన ‘జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్’ గ్రామాల్లో పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యపు నీడలు పంచాయతీలకు నిధులు విదల్చని కేంద్రం స్వచ్ఛ భారత్.. దేశవ్యాప్తంగా ఓ ఉద్యమంలా సాగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమం.. ఇంటి నుంచి మొదలై.. దేశాన్నంతా పరిశుభ్రంగా ఉంచాలనే తలంపుతో ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమానికి వెల్లువలా మద్దతు వస్తోంది. అయితే ఇది పట్టణాల్లో కాస్త ఫలితమిస్తున్నా పల్లె జనంలో చైతన్యం తేలేకపోతోంది. మురికి కూపాలుగా మారిన పల్లెల్లో శాశ్వత పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) పడకేసింది. ఈ మిషన్ ద్వారా పంచాయతీలకు అందాల్సిన రూ.10వేలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియని పరి స్థితి. ఆ నిధులొస్తేనే పారిశుద్ధ్య పనులు చేపట్టేది. జిల్లాలో 684 పంచాయతీలున్నాయి. పారిశుద్ధ్య నిధుల కింద జిల్లాకు రూ.68.4లక్షలు రావాల్సి ఉంది. ఈ నిధుల విడుదలలో అంతులేని జాప్యం కారణంగా పల్లెలన్నీ మురికికూపాలుగా మారాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పారిశుద్ధ్యం పనులు అటకెక్కాయి. పంచాయతీ ఖాతాల్లో పారిశుద్ధ్య పనులకు వెచ్చించేందుకు చిల్లిగవ్వ లేదు. దీంతో సర్పంచ్‌లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వైపు చూస్తున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10వేలు విడుదల చేస్తుంది. గ్రామ సర్పంచ్, ఆరోగ్య కార్యకర్తల ఉమ్మడి ఖాతాలో ఈ నిధులు జమ చేస్తారు. వీటితో గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపడతారు. జిల్లాలో 684 గ్రామ పంచాయతీలున్నాయి. పారిశుద్ధ్య నిధుల కింద జిల్లాకు రూ. 68.4లక్షలు రావాల్సి ఉంది. ఈమేరకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించింది. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నెలరోజుల్లో ఈ నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ 2014-15 వార్షిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెళ్లు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిధుల ఊసెత్తకపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు పడకేశాయి. వాస్తవానికి వర్షాకాలం మునుపే ఈ నిధుల విడుదలైతే.. వాటితో సీజన్ ప్రారంభానికి ముందే పారిశుద్ధ్య పనులు చేపట్టేవారు. కానీ నిధుల జాడ లేకపోవడంతో పనులు ముం దుకు సాగలేదు. ఫలితంగా పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. ఫలితంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కదలని యంత్రాంగం.. పరిశుభ్రమైన సమాజం కోసం తలపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై యువత, స్వచ్ఛంధ సంస్థలు హడావుడి చేస్తున్నా.. అధికారగణం నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. శాఖల మధ్య సమన్వయం కొరవడడంతో జిల్లాలో పారిశుద్ధ్య చైతన్య కార్యక్రమం ముందుకు సాగడంలేదు. కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటిసరఫరా విభాగం, పంచాయతీ శాఖలు పారిశుద్ధ్య పనుల్లో భాగస్వామ్యమైన దాఖలాలు లేవు. శానిటేషన్ నిధులు అందకపోవడంతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టలేదని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడగా.. తాగునీటి సమస్యల పరిష్కారంలో బిజీ అయ్యామంటూ ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరు పేర్కొనడం గమనార్హం. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’లో నిన్న స్మృతి ఇరానీ, నేడు రవిశంకర్ ప్రసాద్ సాక్షి, న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కింద చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. ఆర్కేపురంలోని కేంద్రీయ విద్యాలయ మైదానంలో గురువారం చెత్త ఎత్తివేయగా, మరో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ శుక్రవారం శాస్త్రిభవన్‌లో చీపురుపట్టారు. కేంద్ర టెలికం, న్యాయశాఖ మంత్రి శుక్రవారం శాస్త్రిభవన్ కాంపౌండ్‌లో పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. గదులు, బాత్ రూంలలోకి వెళ్లి పారిశుధ్య పరిస్థితిని పరిశీలించారు. మహాత్మాగాంధీ 150వ జయంతి నాటికి అంటే 2019 అక్టోబర్ రెండో నాటికి దేశాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, ఇందులోభాగంగా తమకు ఆదర్శమైన దీన్ దయాళ్ ఉపాధ్యాయ 98వజయంతిని పురస్కరించుకుని పారిశుధ్య కార్యక్రమాన్ని ప్రారంభించామని రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ కార్య్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన్పటికీ స్వచ్ఛ్ భారత్‌ను ప్రజా ఉద్యమంగా మార్చడంలో ఇదొక భాగమని, ఇదే అందుకు ఆరంభమని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చే నెల రెండో తేదీన తాను పాట్నా రైల్వే స్టేషన్లో స్వచ్ఛ్ భారత్ అభియాన్‌ను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. రెండున విధులకు ప్రభుత్వోద్యోగులు ప్రతి ఏడాదీ గాంధీ జయంతి రోజున హాయిగా కుటుంబసభ్యులతో కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వోద్యోగులకు ఈసారి ఆ అవకాశమే లేకుండాపోయిం ది. ఇందుకు కారణం అదే రోజున స్వచ్ఛ్ భారత్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిర్ణయించడమే. దీంతో వా రంతా కంగుతిన్నారు. గాంధీ జయంతి, దసరా, బక్రీద్లతో పాటు శని, ఆదివారాలను కలుపుకుని వరుసగా ఐదు రోజులు సెలవు దినాలు రావడంతో విహారయాత్రకు వెళ్లేందుకు వీరంతా రూపొందిం చుకున్న ప్రణాళికలు ఈ కార్యక్రమం కారణంగా తలకిందులయ్యాయి. ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కేంద్ర ప్రభత్వ కార్యాలయాలు గాంధీ జయంతి రోజున పనిచేయనున్నాయి. ఉద్యోగులు వచ్చే నెల రెండో తేదీన తమ తమ కార్యాలయాలకు హాజరై ‘స్వచ్ఛ్ భారత్ శపథం’ చేయాల్సి ఉంటుంది. ప్రతి మంత్రిత్వశాఖ పారి శుధ్య కార్యక్రమాన్ని చేపట్టాలని, ఉన్నతాధికారుల నేతృత్వంలో అన్ని ప్రభుత్వ కార్యాయాలలో గురువారం నుంచి వా రం రోజులపాటు పారిశుధ్య కార్యక్రమం చేపట్టాలంటూ కేబినెట్ కార్యదర్శి అజితసేథ్... కేంద్ర ప్ర భుత్వ కార్యదర్శులందరికీ ఆదేశాలు జారీ చేశారు. యాత్రను రద్దు చేసుకున్నా అక్టోబర్ రెండు నుంచి వరుసగా ఐదు రోజుల సెల వు దినాలను పురస్కరించుకుని కుటుంబసమేతం గా ఉత్తరాఖండ్‌లోని అల్మోడా పరిసర ప్రాంతాలను సందర్శించాలనుకున్నామని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని విమలా భల్లా చెప్పారు. అయితే రెండున సెల వు లేకపోవడంతోయాత్రను రద్దుచే సుకున్నామని అన్నారు. నవరాత్రుల ఆఖరి రోజుకూడా రెండో తేదీయే కావడంతో నవమి పూజకు ఏర్పాట్లు చేసుకున్నవారు కూడా పునరాలోచనలో పడిపోయారు. -
మమ అనిపించారు
* తూతూ మంత్రంగా పారిశుధ్య వారోత్సవాలు * నీటి ట్యాంకుల శుభ్రత దేవుడెరుగు * సిబ్బంది కొరతే కారణమంటున్న అధికారులు ఇందూరు: పల్లెలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను జిల్లా పంచాయతీ అధికారులు నామమాత్రంగా నిర్వహించి చేతు లు దులుపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 7నుంచి 12 వరకు పారిశుధ్య వారోత్సవాలను జరపడంలో అధికారులు విఫలమయ్యారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పట్టించుకోలేదు. తప్పదనుకున్న చోట పారిశుధ్య కార్యక్రమాలను ప్రారంభించిన రెం డో రోజే మరిచిపోయారు. దీంతో గ్రామా లలో పారిశుధ్యం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయిం ది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, శుభ్రం చేయని మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు మంచినీరు అందించే ట్యాంకుల శుభ్రత, పైపులైను లీకేజీలకు మరమ్మతులను చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఇలా అయితే వ్యాధులు రావా? వర్షాకాలం ప్రారంభంతోనే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఏడాది పారిశుధ్యవారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు చిత్తశుద్ధితో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తే అతిసారం, ఇతర అంటు వ్యాధు లు, విష జ్వరాలకు బ్రేకు వేసినట్లువుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నీటి ట్యాంకులను శుభ్రం చేయాలి. మురికి కాలువలలో చెత్తను తొలగించి గ్రామ శివారులో పడేయాలి. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని గ్రామాలలోనే కనిపించాయని అంటున్నారు. కనీసం అవగాహన సదస్సులు కూడా నిర్వహించకుండా అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి. కారణాలు ఇవేనా! జిల్లాలో మొత్తం 718 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందు లో కొన్ని గ్రామాలలో మాత్రమే సక్రమంగా పారిశుధ్య వారోత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారో తెలుసుకుంటే, పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూలై ఒకటి నుంచి పది వరకు రెగ్యులర్‌గా గ్రామసభల నిర్వహణ, 13వ తేదీ నుంచి నెలాఖరు వరకు ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమం ఉండటంతో, ఆ పనులలో నిమగ్నమై పారిశుధ్య వారోత్సవాలపై అంతగా శ్రద్ధ పెట్టలేకపోయామని పంచాయతీ అధికారులు పేర్కొం టున్నారు. మండల, గ్రామస్థాయిలో సిబ్బంది కొరత తీవ్రం గా ఉందని, మూడు కార్యక్రమాలు ఒకదాని తరువాత ఒకటి రావడంతో ప్రభావం పడిందని అంటున్నారు. ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక్కో కార్యదర్శి చొప్పున మొత్తం జిల్లాలో 718 మంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 198 మంది కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. ఒక్కో కార్యదర్శికి నాలుగేసి పంచాయతీలను అదనంగా కేటాయించారు. దీంతో పారిశుధ్య వారోత్సవాలను అనుకున్న సమయానికి నిర్వహించలేకపోయారు. ఇటు గ్రామసభల నిర్వహణతో ప్రణాళికల తయారీలో కూడా ఇబ్బందిగా మారింది. మ రోవైపు 36 మండలాలకు గాను 16 మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్చార్జి అధికారులే విధులు నిర్వహిస్తున్నారు. ఈఓపీఆర్డీ పోస్టులు కూడా 20 ఖాళీగా ఉన్నాయి. గ్రామాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కార్మికులు లేకపోవడంతో పారిశుధ్య పనులలో జాప్యం జరుగుతోంది.