సాక్షి, అమరావతి: కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని గ్రామాల్లో సైతం కరోనా నియంత్రణ విషయంలో ప్రజా చైతన్యం బాగా కనిపిస్తోంది. పాజిటివ్ కేసులు నమోదయ్యే గ్రామాల్లో స్థానికులు స్వచ్ఛందంగా తమ గ్రామంలో ఒకే చోట ఎక్కువ మంది గుమికూడకుండా ఆంక్షలు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఉదయం 11 వరకు మాత్రమే..
గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో రెండు నెలల వ్యవధిలో 69 పాజిటివ్ కేసులు నమోదు కావడం, ఆరుగురు మృత్యువాత పడటంతో గ్రామస్థులు కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొల్లిపర, తూములూరులో ఈ నెల 16వ తేదీ వరకు వ్యాపార దుకాణాలు, హోటళ్లు, టీస్టాళ్లు ఉదయం 11 గంటలకే మూసి వేస్తున్నారు. స్థానిక పెద్దల వినతి మేరకు తహసీల్దార్, ఎంపీడీవో, ఎస్‌ఐలతో కూడిన మండల కమిటీ దీనికి ఆమోదం తెలిపింది. దైనందిక కార్యక్రమాలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ మంది గుమికూడడానికి అవకాశం ఉన్న వ్యాపార, వాణిజ్య సముదాయాల విషయంలోనే ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు. తెనాలి మండలం పెదరావూరు, అంగలకుదురు, కటివరం గ్రామ పంచాయతీలలోనూ సోమవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు వ్యాపార, వాణిజ్య సముదాయాల కార్యకలాపాలను ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహించుకునేలా ఆంక్షలు అమలు చేసుకుంటున్నారు. భట్టిప్రోలు మండలంలోని నాలుగు గ్రామాల్లో కూడా ఇదే తరహా ఆంక్షలు విధించుకున్నారు.
పారిశుద్ధ్య కార్యక్రమాలు..
కరోనా కేసులు నమోదవుతున్న గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రత్యేకంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయడంతోపాటు బ్లీచింగ్ పౌడరును ప్రధాన రోడ్ల వెంట చల్లుతున్నారు.
గ్రామాల్లో కోవిడ్ కట్టుబాట్లు
Published Mon, Apr 12 2021 3:08 AM | Last Updated on Mon, Apr 12 2021 12:56 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment