సాక్షి, అమరావతి: గ్రామ పొలిమేరల్లోకి కూడా కరోనా రాకుండా సర్పంచుల నేతృత్వంలో పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని, కొత్తగా ఎన్నికైన సర్పంచులందరూ బాధ్యతగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో చేపట్టనున్న కరోనా కట్టడి, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలపై జిల్లాల వారీగా సర్పంచులకు శిక్షణ కార్యక్రమాలను మంత్రి సోమవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. తొలి రోజు ఉదయం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలు, సాయంత్రం కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన మొత్తం 4,171 మంది సర్పంచులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి కార్యక్రమ ప్రారం¿ోపన్యాసం చేస్తూ.. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన గ్రామాలే మన లక్ష్యం కావాలని సర్పంచులకు దిశానిర్ధేశం చేశారు. జగనన్న స్వచ్ఛసంకల్పం అనేది మన ఇంటిని, మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవడం అనే అవగాహన ప్రజల్లో కల్పించడం ద్వారా కరోనా కట్టడికి ఉపయోగపడుతుందని వివరించారు. దానికి అధికారులతో పాటు గ్రామ సర్పంచ్‌లు, వార్డు సభ్యులు బాధ్యత తీసుకోవాలన్నారు.
పారిశుధ్య కార్మికులకు ప్రజలు సహకరించాలి..
కరోనా విజృంభిస్తున్న దశలో తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ, వారికి ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. గ్రామాల్లో వైరస్ వ్యాప్తి చెందకుండా హైపోక్లోరైట్ ద్రావణాలను ఎప్పటికప్పుడు పిచికారీ, బ్లీచింగ్ పౌడర్‌తో మురుగునీరు నిల్వ ఉండే ప్రదేశాలు, సైడ్ డ్రైన్‌ల వద్ద శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వివరించారు. చెరువుల పూడికతీతలపై కూడా ఉపాధి హామీ కింద పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చామని, ఈ ఏడాది మొత్తం 27 కోట్ల పనిదినాలను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, స్వచ్ఛాంధ్ర ఎండీ సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పొలిమేరల్లోకి కరోనాను రానివ్వొద్దు
Published Tue, May 18 2021 4:34 AM | Last Updated on Tue, May 18 2021 8:20 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment