
సాక్షి, నిజామాబాద్: రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నా కొంతమంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు. భౌతిక దూరం, మాస్కు ధరించడం వంటి కనీస జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తద్వారా తమతో పాటు ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అంతేకాదు జాగ్రత్తలు పాటించమన్నందుకు ఇతరులపై దాడికి కూడా వెనుకాడటం లేదు. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో నిర్లక్ష్యం వద్దని చెప్పినందుకు మున్సిపల్ కార్మికులపై దాడికి యత్నించిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది.
స్థానిక గౌతంనగర్‌లో ఓ వ్యక్తి మాస్కు ధరించకుండానే చెత్త వేసేందుకు బయటకు వచ్చాడు. విషయాన్ని గమనించిన మున్సిపల్ సిబ్బంది మాస్కు పెట్టుకోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన సదరు వ్యక్తి.. ‘‘నేను మాస్కు పెట్టుకోకపోతే.. మీ కేంటి’’ అంటూ పార, ఇనుప రాడ్లతో వారిపై దాడికి యత్నించాడు. ఇందుకు అతడి కొడుకు కూడా జతయ్యాడు. కాగా తండ్రీకొడుకుల ప్రవర్తనపై మున్సిపల్ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment