న్యూఢిల్లీ: కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని హడలెత్తించిన సమయంలోనూ విధులు నిర్వర్తించిన ఫ్రంట్‌లైన్ వర్కర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. లాక్‌డౌన్ సమయంలో ప్రతిఒక్కరూ ఇళ్లకు పరిమితమైనా డాక్టర్లు, వైద్య సిబ్బంది, శానిటేషన్ వర్కర్లు, పోలీసులు మాత్రం తమ విధులను విడవలేదు. భయాందోళనలు పక్కనపెట్టి ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించిన ఈ ఫ్రంట్‌లైన్ వర్కర్లలో కొంతమంది ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. అటువంటి వారిలో ఢిల్లీలోని విజయ్ పార్క్ ప్రాంతానికి చెందిన తారావతి ఒకరు.
30 ఏళ్లుగా ఈస్ట్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న 56 ఏళ్ల తారావతి కోవిడ్ బారిన పడి మృతి చెందారు. తారావతి మృతిచెంది రోజులు గడుస్తున్నా.. ఆ వైరస్ ఆమెకు ఎక్కడ..? ఎలా..? సోకిందో ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులకు తెలియడం లేదు. 'జూన్ 10వ తేదీన మా అమ్మకు కొద్దిపాటి జ్వరం వచ్చింది. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తెచ్చుకుంది. ఆ మందులు ఉపయోగిస్తుండగానే కొన్ని రోజులకు ఆమె పరిస్థితి మరింత దిగజారడంతో ఆస్పత్రిలో చేర్పించాం. అక్కడ పరీక్ష చేసి కోవిడ్ అని నిర్ధారించారు. చికిత్స తీసుకుంటూనే ఆమె ప్రాణాలు కోల్పోయింది' అని తారావతి కుమారుడు జోగిందర్ తెలిపారు. జోగిందర్ కూడా అదే మునిసిపాలిటీలో శానిటేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నారు. (చదవండి: ఫ్రంట్‌లైన్ వారియర్)
ఎవరో నిర్లక్ష్యానికి తమ తల్లి బలి అయ్యిందని, కోవిడ్ మాస్క్‌ను కొంతమంది నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో పడేస్తున్నారని జోగిందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లోవ్స్ ఇచ్చారని.. కానీ.. ఇంటింటికీ తిరిగి చెత్తాచెదారాలను సేకరించడం, రోడ్లను శుభ్రపరచడం వంటివి చేసే తమ లాంటి వర్కర్లకు అవి ఏ మూలకూ సరిపడవని జోగిందర్ తెలిపారు. కోవిడ్ సోకకుండా ధనికులు ఎంతైనా ఖర్చు చేయగలరని, కానీ తమలాంటి పేదలకు అధికారులు ఇచ్చేవే గతి అని అన్నారు. కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా మంది శానిటేషన్ వర్కర్లకు అవగాహన లేదని ఆయన వాపోయారు. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ ట్రయల్స్ షురూ)
Comments
Please login to add a commentAdd a comment