చెత్త పేరుకుపోకుండా ‘జీరో అవర్’
జీహెచ్‌ఎంసీ కొత్త విధానం
క్లీన్‌సిటీ అమలులో భాగంగా చర్యలు..
సిటీబ్యూరో: నగరంలో పారిశుధ్యకార్యక్రమాలు మెరుగుపరచేందుకు ఇప్పటికే వివిధ చర్యలకు శ్రీకారం చుట్టిన జీహెచ్‌ఎంసీ తాజాగా చెత్త రవాణా కేంద్రాల్లో చెత్త గుట్టలుగా పేరుకుపోకుండా ఏరోజుకారోజే అక్కడి నుంచి చెత్తను జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు తరలించేందుకు చర్యలు చేపట్టింది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల సమయాన్ని ‘జీరో అవర్’గా పరిగణిస్తూ, ఆ సమయానికల్లా రవాణా కేంద్రంలో చెత్త అనేది కనిపించ కుండా చేయాలని నిర్ణయించారు.
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను రవాణాకేంద్రాలకు తరలిస్తున్నప్పటికీ, అక్కడి నుంచి జవహర్‌నగర్ యార్డుకు తరలించడంలో జాప్యం జరుగుతోంది. దాంతో రవాణాకేంద్రం పరిసరాల్లో చెత్త గుట్టలు పేరుకుపోయి పరిసరాల్లో దుర్గంధం వెలువడుతుండటంతో పాటు దోమల బెడద తీవ్రమవుతోంది. ఈ సమస్యల పరిష్కారంతోపాటు నగరాన్ని క్లీన్‌సిటీగా చేసేందుకు జీరోఅవర్ విధానాన్ని పాటిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు.