డిచ్ పల్లిలో బీసీ బాలికల వసతి ఎదట నిలిచిన మురికి నీరు
* తూతూ మంత్రంగా పారిశుధ్య వారోత్సవాలు
* నీటి ట్యాంకుల శుభ్రత దేవుడెరుగు
* సిబ్బంది కొరతే కారణమంటున్న అధికారులు
ఇందూరు: పల్లెలలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను జిల్లా పంచాయతీ అధికారులు నామమాత్రంగా నిర్వహించి చేతు లు దులుపుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 7నుంచి 12 వరకు పారిశుధ్య వారోత్సవాలను జరపడంలో అధికారులు విఫలమయ్యారు. ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను మండల పరిషత్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పట్టించుకోలేదు.
తప్పదనుకున్న చోట పారిశుధ్య కార్యక్రమాలను ప్రారంభించిన రెం డో రోజే మరిచిపోయారు. దీంతో గ్రామా లలో పారిశుధ్యం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిపోయిం ది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం, శుభ్రం చేయని మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. ప్రజలకు మంచినీరు అందించే ట్యాంకుల శుభ్రత, పైపులైను లీకేజీలకు మరమ్మతులను చేసిన దాఖలాలు కనిపించడం లేదు.
ఇలా అయితే వ్యాధులు రావా?
వర్షాకాలం ప్రారంభంతోనే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని సీజనల్ వ్యాధులు ప్రబలుతాయి. గ్రామీణ ప్రాంతాలలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి ఏడాది పారిశుధ్యవారోత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అధికారులు చిత్తశుద్ధితో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తే అతిసారం, ఇతర అంటు వ్యాధు లు, విష జ్వరాలకు బ్రేకు వేసినట్లువుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నీటి ట్యాంకులను శుభ్రం చేయాలి. మురికి కాలువలలో చెత్తను తొలగించి గ్రామ శివారులో పడేయాలి. ఇలాంటి కార్యక్రమాలు కొన్ని గ్రామాలలోనే కనిపించాయని అంటున్నారు. కనీసం అవగాహన సదస్సులు కూడా నిర్వహించకుండా అధికారులు పట్టింపు లేకుండా వ్యవహరించారని విమర్శలు వస్తున్నాయి.
కారణాలు ఇవేనా!
జిల్లాలో మొత్తం 718 గ్రామ పంచాయతీలున్నాయి. ఇందు లో కొన్ని గ్రామాలలో మాత్రమే సక్రమంగా పారిశుధ్య వారోత్సవాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో అధికారులు ఎందుకు విఫలమయ్యారో తెలుసుకుంటే, పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. జూలై ఒకటి నుంచి పది వరకు రెగ్యులర్‌గా గ్రామసభల నిర్వహణ, 13వ తేదీ నుంచి నెలాఖరు వరకు ‘మన ఊరు- మన ప్రణాళిక’ కార్యక్రమం ఉండటంతో, ఆ పనులలో నిమగ్నమై పారిశుధ్య వారోత్సవాలపై అంతగా శ్రద్ధ పెట్టలేకపోయామని పంచాయతీ అధికారులు పేర్కొం టున్నారు. మండల, గ్రామస్థాయిలో సిబ్బంది కొరత తీవ్రం గా ఉందని, మూడు కార్యక్రమాలు ఒకదాని తరువాత ఒకటి రావడంతో ప్రభావం పడిందని అంటున్నారు.
ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక్కో కార్యదర్శి చొప్పున మొత్తం జిల్లాలో 718 మంది ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 198 మంది కార్యదర్శులు మాత్రమే పని చేస్తున్నారు. ఒక్కో కార్యదర్శికి నాలుగేసి పంచాయతీలను అదనంగా కేటాయించారు. దీంతో పారిశుధ్య వారోత్సవాలను అనుకున్న సమయానికి నిర్వహించలేకపోయారు. ఇటు గ్రామసభల నిర్వహణతో ప్రణాళికల తయారీలో కూడా ఇబ్బందిగా మారింది. మ రోవైపు 36 మండలాలకు గాను 16 మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్‌చార్జి అధికారులే విధులు నిర్వహిస్తున్నారు. ఈఓపీఆర్‌డీ పోస్టులు కూడా 20 ఖాళీగా ఉన్నాయి. గ్రామాలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కార్మికులు లేకపోవడంతో పారిశుధ్య పనులలో జాప్యం జరుగుతోంది.