కొనసాగుతున్న ఆపరేషన్ జీజీహెచ్
గుంటూరు రూరల్ : గుంటూరు సమగ్ర ప్రభుత్వాసుపత్రి ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే సమీక్షించారు. ఆసుపత్రిలోని శుశ్రుత హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గత మూడు రోజులుగా 45 మంది అధికారులు, 500 మంది పారిశుద్ధ్య కార్మికులు చేసిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. 72 గంటల్లో ఆసుపత్రి ప్రక్షాళన అనేది సాధ్యం కాదని తేలిందని, ఈ కార్యక్రమాలను ఈ నెలాఖరువరకూ కొనసాగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి వార్డులో రోగులకు, సిబ్బందికి కావల్సిన సౌకర్యాలు ఒకటికి రెండుసార్లు ఆయా విభాగాలను కేటాయించిన అధికారులు సరిచూసుకోవాలన్నారు.
రోగులకు, వారి బంధువులకు రాత్రి సమయంలో బసలు కల్పించేందుకు అవసరమైన చర్యలపై ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా జీజీహెచ్ అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులు, వ్యాపార వేత్తల నుంచి మంచి స్పందన లభించిందని, ఎవరికి తోచిన సాయం వారు చేస్తున్నారన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగు కాల్వలు, టాయ్‌లెట్స్‌ను విధిగా పరిశీలించాలన్నారు. ప్రతి వారంలో ఒకసారి మురుగు కాల్వల పూర్తిస్థాయి శుభ్రం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
విద్యుత్ సౌకర్యాలు, ప్రతి వార్డులో విద్యుత్ దీపాలు, ఫ్యానులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అత్యవసర విభాగాల్లో, ఐసీయూలలో ఉన్న ఏసీలు పూర్తి స్థాయి వినియోగంలోకి తేవాలని తెలిపారు. ఆసుపత్రిలోని ప్రతి చిన్న రంధ్రాన్ని సిమ్మెంట్ కాంక్రీట్‌తో పూడ్చి ఎటువంటి ప్రమాదం లేకండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో లలితా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డెరైక్టర్ డాక్టర్ రాఘవ శర్మ తనవంతుగా ఆసుపత్రి అభివృద్దికి రూ.5 లక్షల విరాళంను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. కార్యక్రమంలో జేసీ శ్రీధర్, డీఆర్‌వో నాగబాబు, ఇన్‌చార్జి సూపరింటెండెంట్ రాజునాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.