నిబంధనలకు తిలోదకాలు
కల్వర్టు, డ్రైనేజీ పనుల్లో లోపించిన నాణ్యత ప్రమాణాలు
చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు
నర్సీపట్నం: మున్సిపాలిటీలో నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు దక్కించుకున్న వారు కాకుండా అధికారపార్టీ కౌన్సిలర్లు బినామీ కాంట్రాక్టర్లుగా మారి నిర్మాణ పనులు చేపడుతున్నారు. దీంతో మున్సిపల్ అధికారులు పర్యవేక్షణను గాలికి వదిలేశారు. మున్సిపాలిటీలోని సుమారు రూ.1.5 లక్షలతో డ్రైనేజీ కర్బ్‌వాల్స్, కల్వర్టులు, రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వీటి నిర్మాణాలు ఎందుకు ఉపయోగపడని విధంగా చేస్తున్నారన్న విమర్శలు పట్టణ ప్రజలనుంచి వ్యక్తమవుతున్నాయి.
పాటించని నిబంధనలు
రోడ్డుకు ఇరుపువైలా వేసే కర్బ్‌వాల్స్‌ను అడుగు లోతున నిర్మించాల్సి ఉంది. అధికారపార్టీ కౌన్సిలర్లు ఈ నిబంధనలను పాటించడం లేదు. భూమిపై నుంచి నిర్మిస్తున్నారు. దీంతోపాటు చెత్త, చెదారాన్ని తొలగించేందుకు వీలులేకుండా కర్బ్‌వాల్స్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నీరు ఎటూ వెళ్లడానికి వీలులేకుండా ఎక్కడిక్కడ నీరు నిలిచిపోతోంది. కల్వర్టుల నిర్మాణాలను రెండు అడుగు లోతులో కాంక్రీట్‌తో చేపట్టాల్సి ఉంది. ఈ నిబంధనలను వారు పట్టించుకోకుండా పైపైన కాంక్రీట్ వేసి మొక్కుబడిగా పనులు చేస్తున్నారు.
నాసిరకం మెటీరియల్ వినియోగం
గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులు అదేవిధంగా చేస్తున్నారు. గ్రావెల్‌కు బదులు కూల్చిన ఇళ్ల మెటీరియల్‌ను వినియోగిస్తున్నారు. 6వ వార్డు గవరవీధిలో రూ.5లక్షలతో చేపట్టిన కల్వర్టులు, కర్బవాల్స్ నిర్మాణ పనుల్లో అవే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలు, నిబంధనలు పాటించకపోవడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేసినా బినామీ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్నా అధికార పార్టీ కౌన్సిలర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని మున్సిపల్ డీఈ దక్షణామూర్తి దృష్టికి తీసుకువెళ్లినా స్పందించలేదని గవరవీధి వాసులు ఆరోపిస్తున్నారు. ఆరో వార్డు కాకుండా అన్ని వార్డుల్లో ఇదే విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నారని, ఈ పనులను కాంట్రాక్టర్ జేబులు నింపుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగ పడేవిధంగా లేవని వారు విమర్శిస్తున్నారు. ఈ పనుల విషయమై మున్సిపల్ డీఈ దక్షిణామూర్తిని కోరగా నిబంధనలు మేరకు నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించామన్నారు. కేత్రస్థాయి పరిశీలిన చేసి సక్రమంగా జరగని పనులకు బిల్లులు నిలిపివేస్తామని ఆయన వివరించారు.