గడువు దాటొద్దు... | Must comply with the quality standards | Sakshi
Sakshi News home page

గడువు దాటొద్దు...

Published Sun, Dec 29 2013 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

గడువు దాటొద్దు...

గడువు దాటొద్దు...

=నాణ్యత ప్రమాణాలు పాటించాలి
 =అధికారులు సమన్వయంతో పనులు పర్యవేక్షించాలి
 =భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూడాలి
 =మంత్రులు బలరాం, వెంకటరెడ్డి
 =మహాజాతర ఏర్పాట్లపై మేడారంలో అమాత్యుల సమీక్ష
 =వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

 
మేడారం (గోవిందరావుపేట), న్యూస్‌లైన్ : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించిన పనులను నిర్ణీత గడువులోపు పూర్తిచేయూలని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి పోరిక బలరాంనాయక్, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించేలా నిరంతరంగా పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. మేడారంలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వారితోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఎంపీ గుండు సుధారాణి, ములుగు ఎమ్మెల్యే సీతక్క, కలెక్టర్ కిషన్ హాజరయ్యూరు.

ఈ సందర్భంగా అధికారులు తమ తమ పరిధిలో జరుగుతున్న పనుల గురించి వారికి వివరించారు. ఈ సందర్భంగా నాయక్, వెంకటరెడ్డి మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోటి మంది భక్తులు వస్తారన్న అంచనాలకు తగ్గట్లుగా ప్రజాప్రతినిధుల ఒత్తిడితో ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 24వ తేదీన మేడారంలో మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహిస్తామని, అప్పటివరకు పనులన్నీ పూర్తి చేయాలని పేర్కొన్నారు.
 
అటవీ, ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం

 
సామాన్యులు ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకోవాలని ఏ జీఓలో ఉంది... అంటూ మంత్రులు బలరాం నాయక్, వెంకటరెడ్డి అటవీ, ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియాకు కొమ్ము కాస్తు.. సామాన్యులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాంటి వారు ఇక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్ చేయించుకోవాలని మండిపడ్డారు. కాల్వపల్లి- నార్లాపూర్ రోడ్డు పనులు నిర్వహిస్తున్న వాహనాలను అటవీ అధికారులు అడ్డుకోవడంతోపాటు వాటి తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రుల దృష్టికి రాగా... వారు ఇలా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు తీసుకువచ్చే ట్రాక్టర్లను కూడా ఆపొద్దని పోలీస్ అధికారులకు సూచించారు.

అనంతరం గుడుంబా నివారణకు తీసుకుంటున్న చర్యలను ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. రాజమండ్రి, భద్రాచలం ప్రాంతాల నుంచి వచ్చే నల్లబెల్లాన్ని నియంత్రించకుండా స్థానికులపై దాడులు చేయడమేంటని వారిని మంత్రులు ప్రశ్నించారు. తన పార్లమెంట్ పరిధిలో 30 వేల మంది సారా తాగి చనిపోయినట్లు తమ వద్ద సమాచారం ఉందని బలరాం నాయక్ తెలిపారు. అక్రమంగా బెల్లం, ఇతర వస్తువులను తీసుకువస్తున్న వాహనాలు, అమ్మకందారులపై చర్యలు తీసుకోవాలని... దీని ద్వారా గుడుంబా తయారీ, అమ్మకాలు వాటంతట అవే తగ్గిపోతాయన్నారు.
 
రెడ్డిగూడెంలో మద్యం నిల్వకు ప్రత్యేక గోడౌన్


 ప్రతి సారి ట్రాఫిక్ రద్దీతో డిమాండ్‌కు అనుగుణంగా మద్యం బాటిళ్లను తీసుకురాలేక పోతున్నారని, ఈ మేరకు తగు చర్యలు చేపడుతున్నట్లు మంత్రులకు ఎక్సైజ్ అధికారులు వివరించారు. అధిక మొత్తంలో మద్యాన్ని దుకాణదారులకు అందించేలా రెడ్డిగూడెంలో ప్రత్యేక గోడౌన్ ఏర్పాటు చేయనున్నట్లు  తెలిపారు. సుంకం చెల్లించని, కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని.. ఈ మేరకు 10 చెక్‌పోస్టులు, ఏడు పెట్రోలింగ్ వాహనాలను వినియోగించనున్నట్లు వెల్లడించారు.
 
బస్టాండ్ వద్ద కనీస పనులకు నిధులివ్వండి
 
బస్టాండ్ ప్రాంగణంలో ప్రతి సారి వెట్‌మిక్స్ వేయడం ద్వారా మట్టి లేవకుండా ఉండేదని... ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న బస్టాండు వద్ద లెవలింగ్, రోలింగ్ మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ బస్టాండ్ చుట్టూ  రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని వారు...  మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు బస్టాండ్ ప్రాంగణంలో కనీస పనులకు నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ డ్రైవర్లు మద్యం సేవించి బస్సులు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆల్కహాల్ బ్రీతింగ్ అనలైజర్లను అన్ని పెట్రోలింగ్ వాహనాల్లో ఏర్పాటు చేసి.... డ్రైవర్లను పరీక్షించాలన్నారు. దీనివల్ల భక్తులకు బస్సు ప్రయాణంపై నమ్మకం కలుగుతుందన్నారు. సమావేశంలో ఏజేసీ, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ సంజీవయ్య, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు.
 
 అధిక నిధులిచ్చిన ఘనత మాదే : రాంరెడ్డి

 ఆదివాసీల జాతరకు అత్యధిక నిధులిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మేడారం మహా జాతర సందర్భంగా రూ.100 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయనతోపాటు ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట్రమణారెడ్డి, రాష్ట్రమంత్రి బస్వరాజు సారయ్య, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణిలు ప్రారంభించారు. అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు.

ప్రస్తుత జాతరకు కోటి మంది భక్తులు వస్తారనే అంచనాలకనుగుణంగా ప్రభుత్వం నిధుల మం జూరు చేసేలా ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేశారన్నారు. ప్రతిసారి పనుల హడావుడితో పనుల్లో నాణ్యత లోపాలు తలెత్తాయని.. ఇప్పటికైనా అలాంటి సంప్రదాయూనికి చెక్ పెట్టేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతర సమయంలో మేడారం చుట్టుపక్కల గ్రామాల్లో వెయ్యి ఎకరాల్లో పంట వేయకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని, వీరిలో పట్టాలు లేని రైతులకు కనీసం ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని ఎమ్మెల్యే సీతక్క కోరగా... మంత్రులు సానుకూలంగా స్పందించారు. రైతులకు ఏదో ఒక రూపంలో పరిహారం అందే లా చూస్తామన్నారు. స్థానికంగా ఆదివాసి మ్యూజియం ఏర్పాటుకు రూ.3 కోట్లు, చిలకలగుట్ట చుట్టూ ఫెన్సింగ్‌కు రూ.కోటి విడుదల చేస్తామని చెప్పారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా చూసేందుకు ప్రజాప్రతినిధులు మూడు రోజుల జాతర వద్దే ఉండాలని మంత్రి రాంరెడ్డి సూచించారు.

ఎంపీ రాజయ్య మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకునేందుకు వచ్చిన నాయకులు కొందరు సమ్మక్క-సారలమ్మ తల్లుల ముందు ఓ మాట, మనసులో మరో మాట అనుకుంటారని...  అయితే వారి మనసులోని మాట తల్లులకు తెలుసన్నారు.  వారి మనసులో ఉండే కుతంత్రాలను మార్చాలని తాము తల్లులను కోరుకుంటున్నామని పేర్కొన్నారు. పనుల ప్రారంభోత్సవంలో కలెక్టర్ కిషన్, రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు, జెడ్పీ సీఈఓ ఆంజనేయులు, ఏజేసీ, ఐటీడీఏ ఇన్‌చార్జ్ పీఓ  సంజీవయ్య, మేడారం ట్రస్ట్‌బోర్డు చైర్మన్ నాలి కన్నయ్య, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు,  పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement