పల్లెకు సెల్యూట్ | Dr Reddy's chip Service | Sakshi
Sakshi News home page

పల్లెకు సెల్యూట్

Published Mon, Oct 3 2016 10:49 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

పల్లెకు సెల్యూట్

పల్లెకు సెల్యూట్

డాక్టర్ రెడ్డీస్ చిప్ సర్వీస్


ఒక కాలం ఉండేది.
డాక్టర్లు ఇంటికొచ్చేవారు!
ఒక కాలం ఉండేది.
డాక్టర్ చెయ్యిపట్టి చూసేవారు!
ఒక కాలం ఉండేది.
డాక్టరే మందులు మింగించి వెళ్లేవారు!
ఒక కాలం ఉండేది.
డాక్టర్ మరోసారి పరామర్శకు వచ్చేవారు!
ఇప్పుడు మళ్లీ ఆ కాలం వస్తోంది!!
‘డాక్టర్ రెడ్డీస్’...
పల్లెల్ని వెతుక్కుంటూ వెళ్తోంది.
పల్లె ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ అవుతోంది.
పల్లె ప్రతిభకు పదును పెడుతోంది.
పల్లె కొలువుకు తోరణాలు కడుతోంది.
మీరు ‘లిప్’ సర్వీస్ గురించి విని ఉంటారు.
కానీ ఇది ‘చిప్’ సర్వీస్. సోల్జర్‌షిప్ సర్వీస్!
పల్లెపల్లెకూ సైన్యంలా వెళుతుంది.
ప్రతి పల్లెకూ సెల్యూట్ కొడుతుంది.


శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్. సమావేశంలో జిల్లాస్థాయి అధికారులందరూ ఉన్నారు. కలెక్టర్ ఒకే ఒక్క విషయం మీద తీవ్రంగా దృష్టి పెట్టారు. కొద్ది నెలలుగా ప్రతి సమావేశంలోనూ ఆయన ఒకటే మాట అంటున్నారు. ‘‘ఒక ప్రైవేట్ సంస్థ సమర్థంగా చేసి చూపిస్తోన్న పనిని ఇంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు చేయలేకపోతోంది?’’ అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అధికారులకు కొంచెం ఇబ్బందిగానే ఉంది ఆ పరిస్థితి. కలెక్టర్ ప్రస్తావించిన ఆ ప్రైవేటు సంస్థ.. ‘డాక్టర్ రెడ్డీస్’.


గ్రామాలలో గర్భిణుల చెంతకు
డాక్టర్ రెడ్డీస్ సంస్థ దత్తత తీసుకున్న గ్రామల్లోని గర్భిణీ స్త్రీల వివరాల నివేదిక ట్రైమిస్టర్‌ల వారీగా జిల్లా కేంద్రానికి అందుతోంది. అక్కడి గర్భిణులకు మంచి వైద్యం, మందులు అందుతున్నాయి. అబార్షన్‌లు గణనీయంగా తగ్గాయి. పిల్లలు ఆరోగ్యంగా పుడుతున్నారు. పురిటిలో బిడ్డలు పోవడం వంటి బాధాకర పరిస్థితుల నుంచి కుగ్రామాలు బయటపడ్డాయి. శారీరక బలహీనత వల్ల అంటురోగాల బారిన పడుతున్న కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ వైద్యసేవలన్నీ  క్షేత్రస్థాయిలో సమర్థంగా జరగడంతోపాటు వాటి రిపోర్టు ఎప్పటికప్పుడు జిల్లా కేంద్రానికి అందుతోంది. ఆ సంస్థ దత్తత తీసుకున్న గ్రామాల పరిస్థితి ఇలా ఉంటే, ఆ సంస్థ దత్తత తీసుకోని గ్రామాలు మాత్రం ప్రభుత్వ అలసత్వానికి ప్రతీకల్లా యంత్రాంగాన్ని మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. అక్కడి పరిస్థితుల మెరుగుదలకు ఏం చేయాలనేదే ఆ కలెక్టర్ ఆవేదన.

 
పాఠశాలలకూ... వైద్య బృందాలు

నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలోని పనుగోత తండాలో కూడా గణనీయమైన అభివృద్ధి కనిపిస్తోంది. గత ఏడాది మే నెల పదవ తేదీన డాక్టర్ రెడ్డీస్ ‘కమ్యూనిటీ హెల్త్ ఇంటర్‌వెన్షన్ ప్రోగ్రామ్’ (చిప్) వైద్యుల బృందం ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించింది. ఒకటో తరగతిలో స్నేహ అనే ఐదేళ్ల అమ్మాయి స్కాల్ప్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోంది. వైద్య బృందంలోని నర్సులు స్నేహకు మందులివ్వడంతోపాటు ఇంటికి వెళ్లి జుట్టు తీయించి, వ్యక్తిగత పరిశుభ్రత పట్ల పెద్దవాళ్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఆ ఇంటికి వెళ్లి స్నేహ కోలుకునే వరకు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించింది డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఆధ్వర్యంలోని చిప్ బృందం. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ’లో భాగంగా ఈ సంస్థ విద్యా వైద్యసేవల్ని అందిస్తోంది. 


ఆలోచనకు ఆద్యులు డాక్టర్ అంజిరెడ్డి
‘‘సిఎస్‌ఆర్‌కి చట్టం రూపం ఇటీవలే వచ్చింది. కానీ డాక్టర్ రెడ్డీస్ సంస్థను స్థాపించిన డాక్టర్ అంజిరెడ్డి తొలినాళ్ల నుంచే గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే నినాదాన్ని అమలు చేశారు’’ అని డాక్టర్ రెడ్డీస్ సంస్థ ప్రతినిధి డాక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ‘‘డాక్టర్ రెడ్డీస్ యూనిట్ ఉన్న ప్రతిచోటా ఇలాంటి సర్వీస్ ఇస్తూనే ఉన్నాం. మొదట్లో విద్య, స్కిల్‌డెవలప్‌మెంట్ మా ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. అలా ఇప్పటికి 59 పాఠశాలలను దత్తత తీసుకుని మంచినీటి కోసం ఆర్‌వో ప్లాంట్లు పెట్టించాం. 500మందికి పైగా మెరిట్ విద్యార్థులకు పై చదువుల కోసం ఏటా ఉపకార వేతనం ఇస్తున్నాం. వాళ్లు చదువులో నైపుణ్యాన్ని కొనసాగిస్తేనే తరువాత ఏడాది ఉపకార వేతనం అందుతుందన్నమాట. స్కిల్‌డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో స్టూడెంట్స్ పని చేసుకుంటూ చదువుకునే సౌలభ్యం ఉంది. ముందుగా ఉద్యోగంలో చేరి వృత్తి నైపుణ్యాలను పెంచుకుంటారు, అదే సమయంలో వారికోసం ప్రత్యేకంగా రూపొందిన కరికులమ్‌తో డిగ్రీ పూర్తి చేస్తారు. ఇందుకోసం గీతం యూనివర్శిటీతో టై అప్ అయ్యాం. అయితే ప్రస్తుత చైర్మన్ సతీశ్‌రెడ్డి వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మా యూనిట్‌లు ఉన్న చోట్ల స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్య సేవలు అత్యవసరం అని ఆయన భావించారు. అప్పటి నుంచి ఆరోగ్య సేవలను చాలా విస్తృతంగా అందిస్తున్నాం’’ అని డాక్టర్ నారాయణరెడ్డి వివరించారు.

 
మూడు జిల్లాలు... మారుమూల గ్రామాలు
శ్రీకాకుళం, విజయనగరం, నల్గొండ జిల్లాల్లో డాక్టర్ రెడ్డీస్ ‘చిప్’ నడుస్తోంది. ఒక్క శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోనే 29 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాల్లో చాలా వరకు రోజువారీ పనులతో జీవనం సాగించే వాళ్లే. ఇంట్లో ఒకరికి అనారోగ్యం వస్తే ఆ వ్యక్తి పనికి పోలేడు. అతడిని వైద్యానికి ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కనీసంగా పాతిక కిలోమీటర్లు ప్రయాణించాలి. మరొకరు తోడు వెళ్లాలి. ఆ రోజుకు ఇద్దరికీ కూలి డబ్బు రాకపోవడంతోపాటు దారి ఖర్చులు, మందుల ఖర్చులు కలిపి ఐదువందలకు పైగా ఖర్చు. అంత డబ్బు చేతిలో లేకపోవడంతో హాస్పిటల్‌కు వెళ్లకుండా ఏదో ఆకు పసర్లతో రోజులు గడుపుతూ వ్యాధిని ముదరబెట్టుకుంటుంటారు. అనారోగ్యం, ఆర్థిక సమస్యలతోనే కాలం వెళ్లదీస్తుంటారు. గర్భిణులది ఇంకో రకమైన సమస్య.

 
వెళ్లలేని వాళ్ల ఇళ్లకే... డాక్టర్లు!

‘‘పోషకాహారలోపం వల్ల గర్భం నిలవకపోవడం సర్వసాధారణంగా ఉండేది. మళ్లీ త్వరగా గర్భం రావడంతో ఆ మహిళలు రక్తహీనతతో పాలిపోయి కనిపించేవారు. గర్భం నిలిచినా పిల్లలు బలహీనంగా పుట్టడం, ఇమ్యూనిటీ లేక నెలలు నిండకనే చనిపోవడం వంటివి ఎక్కువగా ఉండేవి. ఇదంతా అవగాహనకు వచ్చిన తర్వాత మేము సిఎస్‌ఆర్‌లో వైద్య సేవలను విస్తృతంగా అందించాలనుకున్నాం’’ అని చెప్పారు డాక్టర్ నారాయణరెడ్డి. ‘‘ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు, మా ‘ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసెస్ సెంటర్’కు రాలేని వృద్ధులకు ఇంటి దగ్గరే వైద్యం, మందులు ఇస్తున్నాం. మా సేవా కార్యక్రమాలకు కార్యనిర్వాహక సహకారం నైస్ సంస్థ అందిస్తోంది. ఉద్యోగుల శ్రేయస్సుతోపాటు కమ్యూనిటీ ప్రోగ్రెస్ కోసం కూడా పని చేయాలనేవారు మా సంస్థ వ్యవస్థాపకులు అంజిరెడ్డి. ఆయన చూపించిన దారిలో నడుస్తూ వారి ఆశయాలను ఆచరణలో పెట్టడం సంతోషంగా ఉంది’’ అన్నారాయన.  ప్రభుత్వం నిష్క్రియాశీలంగా ఉన్నప్పుడు సమాజహితం కోసం శ్రమించే వారు స్పందించి ప్రభుత్వ యంత్రాంగంలో చురుకు పుట్టిస్తారు. అందుకు డాక్టర్ రెడ్డీస్ వంటి సంస్థల సేవలే నిదర్శనం.


‘ఆరోగ్యశ్రీ’తోనూ అనుసంధానం
మేము నిర్వహించే క్లినిక్కులను ఎఫ్‌డిహెచ్‌ఎస్ (ఫిక్స్‌డ్ డే హెల్త్ సర్వీసెస్) అంటాం. మూడు జిల్లాలకు గాను 145 గ్రామాల్లో 196 క్లినిక్కులున్నాయి. ఆరు మొబైల్ యూనిట్లు పని చేస్తున్నాయి. ప్రతి క్లినిక్కుని రెండు వారాలకోసారి సందర్శిస్తాయవి. వాటి ద్వారా ఇప్పటి వరకు రెండు లక్షల పద్నాలుగు వేల మందికి వైద్యసేవలందించాం. 9, 445 మందికి దీర్ఘకాలిక అనారోగ్యాలకు వారింటి వద్దనే వైద్యం అందించాం. మా పరిధిలో చేయలేని పన్నెండు వందల కేసులను పెద్దాసుపత్రులకు పంపించి ఆరోగ్యశ్రీ వంటి స్కీములతో జత కలిపాం. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ వైద్యులు ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం అందిస్తారు. మా చిప్ బృందాలు రోగులను గుర్తించి, వారిని ఆసుపత్రులకు చేరుస్తున్నాయి. మేము దత్తత తీసుకున్న గ్రామాల పరిసరాల్లో ఆరోగ్యం అందని కేసుల గురించి పత్రికల్లో చదివినప్పుడు మా చైర్మన్ వెంటనే స్పందిస్తుంటారు. ఆలాంటి కేసులను మా చిప్ బృందాలు టేకప్ చేస్తుంటాయి.

 - డాక్టర్ వి. నారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్
హెడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, హైదరాబాద్

 

‘చిప్’ బృందం ఇలా పని చేస్తుంది!
ఫీల్డ్ సూపర్‌వైజర్.. గ్రామాల్లో అల్పాదాయ వర్గాల వాడల్లోని ఇంటింటికీ తిరిగి పేర్లు నమోదు చేస్తారు. పేషెంట్ హెల్త్ రికార్డు కూడా ఫీల్డు సూపర్‌వైజర్‌లే మెయింటెయిన్ చేస్తారు. డాక్టర్, నర్సులు, హెల్త్ అసిస్టెంట్లతో కూడిన బృందం రెండు వారాలకోసారి గ్రామాల్లో పర్యటిస్తుంది.

      
గర్భధారణ నిర్ధారణ పరీక్షలు, అల్ట్రాసౌండ్, కడుపులో బిడ్డ గుండె పనితీరును పర్యవేక్షించడం, ఇతర సాధారణ రక్త పరీక్షలు, హైబీపీ, మూత్ర పరీక్షలు... వంటివన్నీ ఇప్పుడు గ్రామాల్లోనే. సంబంధిత పరికరాలన్నీ మొబైల్ వ్యాన్‌లో తీసుకెళ్తారు.  డయాబెటిస్, హైబీపీ, సాధారణ జ్వరాలు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, రక్తహీనతతో వచ్చే అనుబంధ సమస్యలు, మూత్రకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్‌లు, ఈఎన్‌టి సమస్యలు, ఎముకలు- కీళ్ల వ్యాధులు, నొప్పులకు వైద్యం చేసి ఉచితంగా మందులిస్తారు.


 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement