
ఒక మహిళ తాలూకు ఆరోగ్యం ఎలా ఉందన్నది ఆమె మేని చాయ, నిగారింపు లాంటి అంశాలు పట్టి చూపుతాయి. ఆమె వయసుకూ, హార్మోన్ల సమతౌల్యతకూ, ఆరోగ్యకరమైన జీవనశైలికీ ఆమె చర్మం ప్రతిబింబం. కౌమార దశ నుంచి మెనోపాజ్ వచ్చేవరకు ప్రతి దశనూ ఆమె చర్మం ఓ అద్దంలా చూపిస్తూ ఉంటుంది. ప్రతి వాళ్ల చర్మమూ ప్రధానంగా (బ్రాడ్‌గా) జిడ్డు చర్మం, నార్మల్ లేదా పొడి చర్మం అనే మూడింట్లో ఏదో ఒకటిగా ఉంటుంది. ఓ మహిళది ఆయిలీ స్కిన్ అయితే... వయసు పెరుగుతున్న కొద్దీ అది క్రమంగా ఆయిలీ నుంచి నార్మల్‌కు మారవచ్చు. అదే... మరొకరి విషయంలో నార్మల్ స్కిన్ అయితే... అది నార్మల్ నుంచి పొడి చర్మానికి మారవచ్చు. ఆయా వయసుల్లో చర్మంలో వచ్చే మార్పులేమిటి, ప్రతికూల మార్పుల నుంచి రక్షణ పొందడమెలా, సుదీర్ఘకాలం పాటు చర్మ రక్షణ ఎలాగో తెలుసుకుందాం.
వేర్వేరు వయసుల్లో చర్మంలో వచ్చే మార్పులెలా ఉంటాయో, వాటిని అధిగమించి మేనిని ఆరోగ్యంగా ఉంచుకునే రక్షణ చర్యలేమిటో చూద్దాం.
టీనేజ్‌లో (అంటే 13 నుంచి 19 ఏళ్ల వయసు వరకు)...
ఈ వయసులోనే అమ్మాయిల్లో రుతుక్రమం మొదలవుతుంది. ఈ టైమ్‌లో వాళ్లలో ఈస్ట్రోజెన్, యాండ్రోజెన్ హార్మోన్ల మోతాదులు మారిపోతాయి. దాంతో చర్మం కాస్తంత జిడ్డుగా (ఆయిలీగా) మారుతుంది. ఫలితంగా మొటిమలు, బ్లాక్‌హెడ్స్ కనిపిస్తాయి. కొందరిలో ఆ మొటిమలు పగిలిపోతాయి. ఇవి ముఖ్యంగా ముఖంలోని నుదురు, ముక్కు, చుబుకం వంటి టీ–జోన్‌లో ఇవి వస్తుంటాయి.
రక్షణ ఇలా: ఇలాంటి మొటిమల నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం... జిడ్డు తొలగి΄ోయేలా మైల్డ్ సోప్‌తో ముఖం కడుక్కుంటూ ఉండటం, అన్ని పోషకాలు అందేలా సమతులాహారం తీసుకోవడం, కొవ్వులు, నూనెలు ఉన్న ఆహారాన్ని తక్కువగా తీసుకుంటుండటం, వీలైతే డాక్టర్ సలహాతో జిడ్డు తొలగేందుకు తగిన క్లెన్సింగ్ ఉత్పాదనలు వాడటం చేయాలి.
20 నుంచి 30 ఏళ్ల వయసు వరకు...
హార్మోన్లలో సమతౌల్యత ఏర్పడే వయసు ఇది. ఈ సమయంలో జిడ్డు చర్మం చాలా వరకు నార్మల్ అయ్యే అవకాశముంది. అయితే ఈ వయసులో కొన్ని రకాల ఒత్తిడులు పెరగడం జరుగుతుంది. మొదట్లో అంతగా క్రమబద్ధంగా లేని రుతుక్రమం కాస్త ఓ గాడిన పడి, క్రమం తప్పకుండా రావడం మొదలవుతున్నప్పటికీ అయితే అప్పుడప్పుడూ కొన్నిసార్లు క్రమం తప్పడమూ కనిపిస్తుంది.
ఈ వయసులోనే మహిళల గర్భధారణ జరగడం మామూలు. అలాంటి సందర్భాల్లో కొందరిలో ముఖం మీద నల్లమచ్చల్లా వచ్చే ‘క్లోయాస్మా’ అనే పిగ్మెంటేషన్ (మెలాస్మా లాంటిదే) గోధుమరంగులో ముఖం మీద కనిపిస్తుంది.
రక్షణ ఇలా: ప్రధానంగా ఈ వయసులో ఉండే ఒత్తిడిని రిలాక్సేషన్ టెక్నిక్స్‌తో అధిగ మించి ప్రశాంతంగా ఉండాలి. ఇక గర్భధారణ సమయంలో కనిపించే పిగ్మెంటేషన్ గురించి అంతగా ఆందోళన కూడా అక్కర్లేదు. ప్రసవం తర్వాత దానంతట అదే తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ.
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకుంటూ ఉండాలి. ఒంటికి తగినంత ద్రవాహారం అందేలా మంచినీళ్లు, కొబ్బరినీళ్ల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఎండలోకి వెళ్లేప్పుడు తప్పనిసరిగా ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ ప్రతి రెండు మూడు గంటలకోమారు రాసుకుంటూ ఉండాలి.
40వ పడిలో...
మహిళల్లో తమ నలభైల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్రవించే మోతాదు క్రమంగా తగ్గడం మొదలవుతుంది. దాంతో చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్ అనే ప్రోటీన్ తగ్గడం వల్ల చర్మం తమ బిగువు కోల్పోవడం మొదలై వదులుగా కనిపించడం ప్రారంభమవుతుంటుంది.
ఈ కొలాజెన్, అలాగే దేహంలో ఉండే తేమ తగ్గుతుండటం వల్ల ముఖంలో, చర్మం ముడతలు పడే ప్రాంతాల్లో సన్నటి గీతలుగా కనిపించడం మొదలవుతుంది. ఆ గీతలు క్రమంగా లోతుగా మారడం, చర్మం బాగా వదులయ్యాక ముడతలుగా కనిపిస్తుంది.
రక్షణ ఇలా: అందుకే ఇలా చర్మం డల్‌గా, వేలాడటం మొదలవ్వడానికి ముందే దేహానికి కొలాజెన్ అందించే మంచి ఆహారం, వేలడకుండా మంచి వ్యాయామం అందించాలి. తాము తీసుకునే పోషకాల్లో కొలాజెన్ అందించే ఆహారాలైన చేపలు, నట్స్, విటమిన్–సి పుష్కలంగా ఉండే తాజాపండ్లు తీసుకోవాలి. దీంతో చర్మం ఈ వయసులోనూ బిగుతుగా, మేనిలో మంచి మెరుపుతో ఉంటుంది. మరికొంతకాలం చర్మం యౌవనంతో కనిపిస్తుంటుంది.
50వ పడి మొదలుకొని... ఆ పైన...
ఈ వయసులో మెనోపాజ్ వచ్చేందుకు అవకాశాలెక్కువ. దాంతో దేహంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ మోతాదు తగ్గుతుంది. చర్మం పలుచబారడం, పారదర్శకంగా మారుతుండటం దాంతో లోపలి రక్తనాళాలు కనిపిస్తున్నట్లుగా ఉండటం, చర్మం పొడిబారడం జరుగుతుంది.
చర్మంపైన గీతలు మరింత లోతుగా మారుతూ, క్రమంగా ముడుతలు కనిపిస్తుంటాయి. ఫలితంగా ఏజింగ్ వల్ల వచ్చే మార్పులు మరింత స్పష్టమవుతుంటాయి. వయసు పైబడటం వల్ల కనిపించే అన్ని మార్పులూ వ్యక్తమవుతుంటాయి. ఈ వయసు రాగానే చర్మం తనంతట తాను రిపేర్ చేసుకునే సామర్థ్యం క్రమంగా తగ్గడం మొదలువుతుంది.
రక్షణ ఇలా: ఈ ముడతలు కనిపించడం మరింత ఆలస్యమయ్యేలా చేసుకునేందుకు అవసరమైన కొన్ని ప్రక్రియలను అనుసరించాలి.
ఇందులో భాగంగా... ఒమెగా– 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా దొరికే చేపల వంటి ఆహారాలు, అన్ని పోషకాలు అందే సమతులాహారం అవసరం. ఈ వయసులో తేమ తగ్గి చర్మం పొడిగా మారడం వల్ల గీతలు మరింత లోతుగా మారడం, ముడుతలు స్పష్టంగా కనిపించడం జరుగుతుంటాయి కాబట్టి దేహానికి అవసరమైన తేమను అందించేలా మాయిశ్చరైజర్ క్రీములు వాడాలి.
ఇక చర్మం బిగుతుగా మారడానికీ, కొలాజెన్ తగ్గే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడానికి బాగా తోడ్పడేది తగినంత వ్యాయామం. ఈ అన్ని వయసుల్లోనూ... ఆ వయసుకు తగినంత తీవ్రతతో శరీరానికి తగనంత శ్రమ తెలిసేలా వ్యాయామం చేయడం వల్ల చర్మం మరింత కాలం నిగారింపుతో, మరింత మెరుపుతో కనిపిస్తుంటుంది.
వీటితోపాటు కాస్త ఏజింగ్ ఛాయలు కనిపిస్తుండగానే వాటిని ఆలస్యం చేయడానికి, చర్మం ఆరోగ్యంగా మంచి నిగారింపుతో కనిపించడానికి డర్మటాలజిస్టుల సలహా మేరకు వారికి సరిపడే కెమికల్ పీల్స్, మైక్రోనీడిలింగ్స్, ఆర్‌ఎఫ్, బొటాక్స్, ఫిల్లర్స్ వంటి పలు చికిత్సలు చేయించుకోవచ్చు.
డా. విజయశ్రీ, సీనియర్ కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్
(చదవండి: ‘ఫాఫో పేరెంటింగ్’ అంటే..? నెట్టింట వైరల్)
Comments
Please login to add a commentAdd a comment