
సాక్షి, ముంబై: రష్యా కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన దేశీయ ఫార్మా దిగ్గజం డా.రెడ్డీస్ భారీ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. స్పుత్నిక్-వి వ్యాక్సిన్ పంపిణీ, క్లినికల్ ట్రయల్స్ కోసం రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఆర్‌డీఎఫ్)తో భారీ డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పదికోట్ల (100 మిలియన్ల ) మోతాదుల కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది.
ట్రయల్స్ విజయవంతమైతే నవంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రేవ్ వెల్లడించారు. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ అడెనోవైరల్ వెక్టర్ ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటుందన్నారు. దశాబ్దాలుగా 250 కి పైగా క్లినికల్ అధ్యయనాలలో పరీక్షించబడిందని,ఇందులో దీర్ఘకాలిక ప్రతికూలతలు లేకుండా సురక్షితంగా తేలిందన్నారు. అలాగే ఈ టీకా తయారీ మరో నాలుగు భారతీయ తయారీదారులతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఒకటి, రెండు దశల ప్రయోగాల్లో సానుకూల ఫలితాల నేపథ్యంలో మూడు దశ ట్రయల్స్ నిర్వహించనున్నామని రెడ్డీస్ సీఈవో జీవీ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ సహా రష్యా వ్యాక్సిన్‌పై పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘స్పుత్నిక్ వి’కి మూడో దశ పరీక్షలకు భారత్‌లో రెడ్డీస్ ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, తయారీకి పుణేకు చెందిన సీరం సంస్థ ఒప్పందాన్ని చేసుకుని ప్రయోగాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. (కరోనా: డా.రెడ్డీస్ కొత్త ఔషధం)
Comments
Please login to add a commentAdd a comment