స్టార్టప్స్‌లకు డాక్టర్ రెడ్డీస్ చేయూత!
- కొత్త ఆలోచనలకు కార్యరూపం మివ్వడంలో అండగా ఉంటాం
- డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కో-చైర్మన్, సీఈఓ జీవీ ప్రసాద్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్ (డీఆర్‌ఐఎల్‌ఎస్- డ్రిల్స్) కార్పొరేట్ పరిశోధనలతో పాటుగా స్టార్టప్ కంపెనీలకూ చేయూతనందించనుంది. ఔషధ, వైద్య రంగంలో వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులతో ముందుకొచ్చే స్టార్టప్స్‌కు కార్పొరేట్ స్థాయిలో ప్రోత్సాహం అందించడంతో పాటుగా వారి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి సరైన దిశానిర్దేశం చేస్తామని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ కో-చైర్మన్, సీఈఓ జీవీ ప్రసాద్ చెప్పారు. వైద్యం- విద్యా, పర్యావరణ పరిశ్రమ వృద్ధి అనే అంశంపై శనివారమిక్కడ ‘డ్రిల్స్ సినర్జీ 2015’ కార్యక్రమం జరిగింది.
ఆయన మాట్లాడుతూ... స్టార్టప్స్ కంపెనీల ఆర్థిక చేయూత నిమిత్తం రెడ్డీస్‌తో పాటు ఇతర కంపెనీల నుంచి నిధులను సమీకరించడంపై దృష్టిపెట్టామన్నారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో 2004లో ప్రారంభమైన డ్రిల్స్‌కు మౌలిక వసతుల అభివృద్ధి నిమిత్తంరెడ్డీస్ తొలుత రూ.28 కోట్లు.. ఆ తర్వాత 7 ఏళ్లలో మరో రూ.30 కోట్లు అందించిందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రూ.10 కోట్లు గ్రాంటు రూపంలో లభించాయని ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.
జనరిక్ మందులను కాపీ చేయొద్దు: సన్ ఫార్మా
ఇతర దేశాల్లోని జనరిక్ మందులను ఇక్కడ కాపీ చేయడం కాకుండా.. కొత్త ఔషదాలను తయారు చేయడంపై దేశీ ఔషద కంపెనీలు పరిశోధనలు చేయాలని సన్ ఫార్మా వ్యవస్థాపకుడు, ఎండీ దిలీప్ సంఘ్వీ సూచించారు. ఇందుకోసం విద్యా స్థాయిలోనే పరిశోధనల నాణ్యత, నైపుణ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
‘కేసీఆర్ ప్లాటినం స్పూన్‌తో పుట్టాడు’
ఎవరైనా అష్టైశ్వర్యాలతో పుడితే.. ‘వాడికేంటిరా.. గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు’ అంటారు. ఈ నానుడిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్వయిస్తే... ‘‘కేసీఆర్ ప్లాటినం స్పూన్‌తో పుట్టాడని’’ అనుకోవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు. విద్యా, వైద్యం, సాంకేతిక.. ఇలా ప్రతి రంగంలోనూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్.. తెలంగాణలో ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. డాక్టర్ రెడ్డీస్ సినర్జీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.