ఏమున్నాయ్.. ఎంతున్నాయ్!
రాష్ట్ర విభజన పర్వం జోరందుకుంది. తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ తేదీని ముందస్తుగా ఖరారు చేసిన ప్రభుత్వం.. ఆ లోపు ఆస్తుల పంపకాల ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు వేగిరం చేసింది. ఇందులో భాగంగా జిల్లాలవారీగా ఆయా విభాగాల నుంచి ఆస్తుల వివరాలు సేకరిస్తోంది. శాఖాపరమైన ఆస్తులు, భూములు తదితర వివరాలు పంపించాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ వివరాల కోసం ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించిన ప్రభుత్వం వాటిని జిల్లా అధికారులకు పంపించింది. నిర్దేశిత నమూనాలో పూర్తి వివరాలు పంపించాలని స్పష్టం చేసింది. దీంతో అధికారులు ఆయా వివరాలను క్రోడీకరించి పంపే పనిలో నిమగ్నమయ్యారు.
ప్రొఫార్మాలో ఏముంది? : విభజనకు సంబంధించి జిల్లాలకు పంపించిన ప్రొఫార్మాలో కీలకాంశాలున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని ఆస్తుల పంపకం జరిపే అవకాశం ఉంది.
ప్రస్తుత రాజధాని చుట్టూ జిల్లా విస్తరించి ఉన్నందున విలువైన ఆస్తులు జిల్లాలోనే ఉన్నాయి. ఉన్నతాధికారులు పంపిన ప్రొఫార్మా ప్రకారం.. అటవీ భూముల వివరాలు, ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. శాఖలవారీగా సొంత భవనాలు, ఇతర స్థిరాస్తులతో పాటు చరాస్తుల వివరాలూ సమర్పించాలి. కార్యాలయాల్లోని ఫర్నిచర్ మొదలు ప్రతి వస్తువు వివరాలు సమర్పించే విధంగా ప్రొఫార్మాలో నిర్దేశించారు. అంతేకాకుండా రాష్ట్రస్థాయి యూనిట్ల వివరాలు కూడా ఇవ్వాలని నిర్దేశించారు. ఈ లెక్కన కెమికల్ ల్యాబ్‌లు, ఉత్పత్తి కేంద్రాలు తదితర వివరాలు కూడా సమర్పించాల్సి ఉంది.