వీధుల్లోకి విస్తరించిన సమైక్య ఉద్యమం
Published Thu, Aug 8 2013 2:51 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉద్ధృతమైంది. పట్టణాలు, గ్రామాలను దాటి వీధుల్లోకి సైతం విస్తరిం చింది. నిన్నటిదాకా యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొనగా బుధవారం నుంచి మహిళలు, పెన్షనర్లు, రైతు లు సైతం రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళంలోని రిమ్స్‌లో జేఏసీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలవారు ర్యాలీలు నిర్వహించారు. సోనియాగాంధీ దిగివచ్చేలా ఉద్యమం కొనసాగించాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వ గణాంక విభాగం ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ కార్యాలయ ఆవరణలో ఆర్టీసీ కార్మికులు ధర్నా చేశారు. మహిళా న్యాయవాదులు జిల్లా కోర్టు ఆవరణ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ధర్నా చేశారు. జిల్లా డ్రగ్ ట్రేడ్ అసోసియేషన్ ప్రతినిధులు డే అండ్ నైట్ కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, మంత్రులు, ప్రజాప్రతి నిధుల తీరును ఎండగట్టారు. జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగులు మూడో రోజు కూడా ఆందోళన కొనసాగించారు.
ఆర్టీసీ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
పాలకొండలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యకర్తలు డిపో ఎదుట అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జిల్లా స్థాయి సైన్స్‌ఫేర్‌కు హాజరైన ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. పాలకొండ మం డలం కొండాపురం వద్ద గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించగా, పాలకొండ-విశాఖ ప్రధాన రహదారిపై గోపాలపురం గ్రామస్తులు వంటా, వార్పు చేసి క్రికెట్ ఆడారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పాలకొండ డివి జన్ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. వీరఘట్టం మండలం నడుకూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సీతంపేట ఐటీడీఏ ప్రాంగణంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సమైక్యవాదులు అడ్డుకున్నారు. దీంతో ఐసీడీఎస్ యంత్రాంగం ఈ కార్యక్రమా న్ని ప్రైవేటు స్థలంలో నిర్వహించింది. భామినిలో మహిళా సర్పంచ్‌లు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల రిలే నిరాహారదీక్షలు బుధవారం కూడా కొనసాగాయి. పాతపట్నంలో 60 అడుగుల జాతీయ పతాకంతో మహిళలు, జేఏసీ సభ్యులు, ఎన్‌జీవో సంఘ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు కేసీఆర్‌ను గాడిదగా అభివర్ణిస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం జేఏసీ నేతలు పంచాయతీ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.
నినాదాలతో దద్దరిల్లిన పలాస
పలాసలో వివిధ వర్గాల వారు చేపట్టిన ర్యాలీ లు మూడు రోడ్ల కూడలికి చేరినపుడు ఉద్యమకారులు చేసిన నినాదాలతో పట్టణం దద్దరి ల్లింది. అక్కడ సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ ఉద్యోగులు మౌన దీక్ష చేపట్టారు. ఎన్‌జీవోలంతా రోడ్లపైకి వచ్చి ర్యాలీలు నిర్వహించారు. వజ్రపుకొత్తూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎచ్చెర్ల బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ విద్యార్థులు 16వ నంబరు జాతీయ రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శాంతిహోమం నిర్వహించారు. జాతీయ రహదారి డివైడర్‌పై సీతారామలక్ష్మణుల ప్రతిమలతో పాటు శివలింగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని ప్రార్థిస్తూ పూజలు జరిపారు. అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉద్యమకారుల డిమాండ్‌కు తలొగ్గిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాలనీలంకఠంనాయుడు పదవికి రాజీనామా చేశారు. తద్వారా జిల్లాలో అలా చేసిన తొలి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నిలిచారు. రాజాంలో వివిధ వర్గాల వారు ర్యాలీలు నిర్వహించారు. నరసన్నపేటలో న్యాయవాదులు విధులను బహిష్కరించి ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో లైన్స్‌క్లబ్, ఐసీడీఎస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న తల్లిపాలవారోత్సవాల వద్దకు వెళ్లి ర్యాలీలో పాల్గొనాలని అక్కడున్నవారిని కోరారు. అనంతరం పాతబస్టాండ్ మీదుగా ఆర్టీసీ కాంప్టెక్స్ వరకూ ర్యాలీగా వెళ్లి కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు.
రణస్థలం, కోష్ఠ, పైడిభీమవరం, పాలకొండ, ఆమదాలవలసల్లో బంద్ సంపూర్ణం
సంతకవిటి మండలంలో ఆదర్శ యువజన సం ఘాల సభ్యులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేయగా గుళ్లసీతారామపురంలో ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాల దిష్టిబొమ్మలను దహనం చేశారు. రణస్థలం, కోష్ఠ, పైడిభీమవరం, పాలకొండ, ఆమదాలవలసల్లో సంపూర్ణ బంద్ జరిగింది. ఆమదాలవలసలో లగేజీ వ్యాన్లతో యాజమానులు, కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో ఆందోళనలు జరిగాయి. జిల్లాలోని మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ ఉద్యమం చేపట్టారు. న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. పొందూరులో సోనియా, బొత్స దిష్టిబొమ్మలను దహనం చేశారు. సరుబుజ్జిలి, రొట్టవలస, షలంత్రిలలో విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. సరుబుజ్జిలిలో సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. సరుబుజ్జిలి జంక్షన్‌లో విద్యార్థులు రెండు గంటలసేపు రహదారిని దిగ్బంధిం చారు. బూర్జ మండలం లచ్చయ్యపేట, ఉప్పినివలసల్లో విద్యార్థులు ర్యాలీలు నిర్వహిం చారు. పొందూరు మండలం లైదాం, మలకాం గ్రామాల్లో విద్యార్థులు సోనియా, బొత్స దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం వాటిని దహనం చేశారు.
ఇచ్ఛాపురంలో కొవ్వొత్తులతో ప్రదర్శన
ఇచ్ఛాపురంలో ఉపాధ్యాయులు కొవ్వొత్తులతో ప్రదర్శన జరిపారు. సోంపేటలో విద్యార్థులు కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించారు. గాంధీ మండపం వద్ద మానవహారం నిర్వహించారు. టెక్కలిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేశారు.
Advertisement