పెళ్లి ఇంట్లో చావుబాజా
Published Thu, Aug 8 2013 2:58 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సోంపేట, న్యూస్‌లైన్: మరో పదహారు రోజుల్లో ఇంట్లో పెళ్లి బాజా మోగనుంది. ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఒకే ముహూర్తానికి ఇద్దరి అన్నదమ్ములకు పెళ్లి జరగాల్సి ఉండడంతో కుటుంబ సభ్యులందరూ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంటికి రంగులు వేశారు. పొలం పనులు పూర్తి చేస్తున్నారు. అంతా సవ్యంగా జరుగుతుందన్న తరుణంలో విధి వక్రించింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడిని మృత్యువు కాటేసింది. పెళ్లి ఇంట్లో విషాదం నింపింది. ఇది జింకిభద్ర గ్రామంలో చోటుచేసుకున్న విషాద ఘటన. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామానికి చెందిన తామాడ కృష్ణవేణికి రమేష్, భీమారావు, మహేష్ ముగ్గురు కుమారులు. రమేష్ సింగపూర్‌లోను, భీమారావు కువైట్‌లో ఉద్యోగాలు చేస్తుండగా, చిన్నవాడైన మహేష్ తల్లికి తోడుగా గ్రామంలో ఉంటున్నాడు. ఈ నెల 24న రమేష్, భీమారావుకు పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రమేష్.. అదే గ్రామానికి చెందిన సంగారు ఈశ్వరరావు అక్క నీలవేణి ఇంటికి మంగళవారం అర్ధరాత్రి ద్విచక్రవాహనంపై బారువ వెళ్తూ అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టారు. దీంతో పెళ్లి కొడుకు రమేష్(27)అక్కడికక్కడే మృతి చెందగా, ఈశ్వరరావు కాలు విరిగిపోయింది.
ఆయన ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందజేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. రమేష్ సోదరుడు భీమారావు ఈ నెల 9న కువైట్ నుంచి గ్రామానికి చేరుకోనున్నాడు. ఇంతలో ప్రమాదం జరగడంతో తల్లి కృష్ణవేణి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. భర్త మరణించి ఏడాది పూర్తయిన వెంటనే చెట్టంత కొడుకును మృత్యువు కబళించడంతో కన్నీటిపర్యంతమవుతోంది. ఆమెను ఓదార్చడం ఎవరితరమూ కావడం లేదు. క్షతగాత్రుడు ఈశ్వరరావును బారువ పోలీసులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. రమేష్ మృతదేహానికి బారువ సామాజిక ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
విషాదంలో జింకిభద్ర
గ్రామంలో చురుగ్గా తిరుగుతూ అందరితో కలవిడిగా ఉండే తామాడ రమేష్ మృతిచెందడంతో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. రమేష్ సింగపూర్ నుంచి పెళ్లికోసం ఆరునెలలు క్రితం స్వగ్రామానికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. పెళ్లిపనులు చేసుకుంటున్న యువకుడిని మృత్యువు కబళించిందంటూ వాపోతున్నారు. మంగళవారం ఉదయం రమేష్ ఎకరా పొలంలో దమ్ముచేసి నాట్లు వేయించాడని, తెల్లారే సరికి ఇలా విగతజీవిగా మారడాన్ని తట్టుకోలేకపోతున్నారు.
Advertisement